తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

‘కేజీయఫ్‌-1'లో జరిగింది ఇది.. 'చాప్టర్​-2' ఆ సీన్​తోనే స్టార్ట్​ అవుతుందా?

కేజీయఫ్‌ ఛాప్టర్‌ -1.. యశ్‌- దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. దేశంలోని అన్ని సినిమా పరిశ్రమలను శాండల్​వుడ్​ వైపు మళ్లించేలా చేసింది. ‘కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌’ (కేజీయఫ్‌) కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో ఒక్కో డైలాగ్​ మాస్టర్​ పీస్​. మొదటి భాగం సూపర్​ హిట్​ కావడం వల్ల చాప్టర్​-2పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నెల 14న 'కేజీయఫ్‌ ఛాప్టర్‌- 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని పాత్రలు, ప్రాముఖ్యతను ఒకసారి గుర్తు చేసుకుందాం.

కేజీయఫ్‌
KGF

By

Published : Apr 13, 2022, 5:54 PM IST

"శత్రువులు ఎంత ఎక్కువగా వస్తే.. వాడు అంత ఎక్కువగా మండుతాడు.."

''ఊరు చూడటానికి వచ్చినోడు ఊరు గురించి తెలుసుకుంటాడు. ఊరిని యేలడానికి వచ్చినోడు ఆడి గురించి ఊరికి తెలిసేలా చేస్తాడు.''

''గ్యాంగ్​తో వచ్చేవాడు గ్యాంగ్​స్టర్​.. కానీ అతనొక్కడే వస్తాడు.. మాన్​స్టార్​''

"ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు"

"ముందు ఎవడి మీద దెబ్బ పడిందన్నది కాదు.. ముందు ఎవడు కింద పడిపోయాడన్నదే లెక్కలోకి వస్తుంది"

'కేజీయఫ్‌ ఛాప్టర్‌- 1' లోని ఒక్కో డైలాగ్​ థియేటర్​లో డైనమెట్​గా పేలింది. అప్పటి వరకు ​ తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని యశ్​కు.. 'సలాం రాఖీభాయ్​' అంటూ సగటు తెలుగు సినీ అభిమానులు స్వాగతం పలికారు. మళ్లీ అలాంటి అనుభూతిని పంచేందుకు సిద్ధమయ్యాడు 'రాఖీభాయ్'. ఈ నెల 14న కేజీయఫ్‌ ఛాప్టర్‌-2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 'ఛాప్టర్‌ -1'లోని ప్రధాన పాత్రలను గుర్తుచేసుకుందాం..

రాఖీ.. ఓ బ్రాండ్‌

బ్రాండెడ్‌ వస్తువులను ఎలా మర్చిపోలేమో.. ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’ చూసిన వారు హీరో పాత్రనూ మర్చిపోలేరు. ఎందుకంటే అది కూడా ఓ ‘బ్రాండ్‌’! హీరోలా కనిపించే విలన్‌.. విలన్‌లా కనిపించే హీరో క్యారెక్టర్‌ అది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, ఆమెకు ఇచ్చిన మాట కోసం పవర్‌, మనీ సంపాదించేందుకు ముంబయి వెళ్లడం.. అక్కడ అంచలంచెలుగా ఎదిగి పెద్ద డాన్‌లా మారడం.. ‘నరాచీ లైమ్‌ స్టోన్‌ కార్పొరేషన్‌’ సామ్రాజ్యాధినేత కొడుకును చంపితే ముంబయిను తన గుప్పిట్లోకి తెచ్చుకునే అవకాశం రావడం.. ఇలా పూర్తిస్థాయి యాక్షన్‌ నేపథ్యంలో సాగే పాత్ర ఇది. చిన్నప్పటి రాఖీ పాత్రను అన్మోల్‌ విజయ్‌ పోషించగా, అసలైన రాఖీ క్యారెక్టర్‌లో యశ్‌ నట విశ్వరూపం చూపించాడు. పొడవాటి జుత్తు.. గడ్డంతో కూడిన స్టైలిష్‌ లుక్‌, పవర్‌ఫుల్‌ సంభాషణలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రధాన విలన్‌ను హత్యచేసి, ‘ఛాప్టర్‌ 2’లో ఏం చేస్తాడోనన్న ఆసక్తిని పెంచాడు.

రాఖీభాయ్​

సూర్యవర్ధన్‌.. నరాచీ

సూర్యవర్ధన్‌.. కోలార్‌ ప్రాంతంలో బంగారాన్ని గుర్తించిన ప్రభుత్వ అధికారులను చంపి, ఎవరికీ అనుమానం రాకుండా బంగారు గనులను ‘నరాచీ లైమ్‌స్టోన్‌ కార్పొరేషన్‌’గా మార్చి పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. ఈ క్యారెక్టర్‌ నిడివి తక్కువే కానీ కీలకం. అక్రమంగా ‘బంగారు’ కోట కట్టుకున్న సూర్యవర్ధన్‌ కొన్నాళ్లు అనారోగ్యంతో బాధపడి, మరణిస్తాడు. నెగెటివ్‌ ఛాయలున్న ఈ పాత్రను దర్శక-నటుడు రమేశ్‌ ఇందిర పోషించారు. పార్ట్‌ 2లో ఈ పాత్ర కనిపించదు.

సూర్యవర్ధన్‌

సూర్యవర్ధన్‌ బలగం..

బంగారం అక్రమ రవాణాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు, నరాచీలోకి ఎవరూ ప్రవేశించకుండా ఉండేందుకు సూర్యవర్ధన్‌ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాడు. వ్యాపారాన్ని భద్రంగా కాపాడుకోవడానికి ఐదుగురు భాగస్వాములను మూలస్తంభాలుగా ఎంచుకుంటాడు. భార్గవ్‌.. అతను చనిపోయాక కొడుకు కమల్‌, రాజేంద్ర దేశాయ్‌, ఆండ్రూస్‌, గురు పాండియన్‌. వీరు కాక సూర్యవర్థన్‌కు ఉన్న అతిపెద్ద బలం అతని తమ్ముడు అధీర. అతని సామర్థ్యంతో కట్టిన కోటకు సూర్యవర్థన్‌ కొడుకు గరుడ తోడవడంతో నరాచీని ఎవ్వరూ తాకలేనంత పటిష్టంగా తయారైంది. రాజేంద్ర దేశాయ్‌గా లక్కీ లక్ష్మణ్‌, రాజకీయ నాయకుడు గురు పాండియన్‌గా అచ్యుత్‌ కుమార్‌ వైవిధ్యం చూపించారు. వీటితోపాటు పోటీపడే మరో పాత్ర వానరం. అయ్యప్ప పి.శర్మ పోషించిన ఈ క్యారెక్టర్‌ ద్వితీయార్ధంలో ఎంట్రీ ఇచ్చినా మరో స్థాయిలో నిలిచింది. గరుడ పాత్ర మినహా మిగిలినవన్నీ సీక్వెల్‌లో ఉంటాయి.

గరుడ.. గంభీరం

గరుడ.. గంభీరమైన ప్రధాన విలన్‌ పాత్ర. సూర్యవర్ధన్‌ పెద్ద కొడుకు. నటుడు రామచంద్రరాజు.. ఈ క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు. ముఖ్యంగా, తనపై హత్యా ప్రయత్నం జరిగే సమయంలో గరుడ ఇచ్చిన ‘విగ్రహం’ ట్విస్ట్‌ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే. తన తదనంతరం నరాచినీ చూసుకోవాల్సిన బాధ్యతను తమ్ముడు అధీరాకు కాకుండా తనయుడికే ఇస్తాడు సూర్యవర్ధన్‌. దాంతో.. అధీరా, గరుడ మధ్య పోరు మొదలవుతుంది. మరోవైపు, గరుడను చంపేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే.. ఓ ప్రయత్నం విఫలమైనా ఎట్టకేలకు గరుడను రాఖీ హతమారుస్తాడు. దాంతో.. ఈ పాత్రా 2వ అధ్యాయంలో కనిపించదు.

గరుడ

ఆండ్రూస్‌.. అదుర్స్‌

సూర్యవర్ధన్‌ నమ్మిన బంటుల్లో ఆండ్రూస్‌ ఒకడు. కానీ, నరాచీపై కన్నుపడటంతో గరుడను చంపేందుకు ప్రణాళిక రచిస్తాడు. ‘ఆ పని చేయగలిగింది రాఖీ మాత్రమేన’నే నిర్ణయానికొస్తాడు. గరుడను మర్డర్‌ చేస్తే ముంబయిను చేజిక్కించుకోవచ్చనే ఆఫర్‌ను రాఖీకు ఇస్తాడు. రాఖీ ప్లాన్‌ అమలు చేయగానే.. అతని పవర్‌ను ఆండ్రూస్‌ పాత్ర ఎలివేట్‌ చేసే తీరు అదరహో అనిపిస్తుంది. ఈ విభిన్న పాత్రను బి.ఎస్‌. అవినాష్‌ పోషించారు. రెండో భాగంలోనూ ఈ ఆండ్రూస్‌ను చూడొచ్చు.

ఆండ్రూస్​

అందాల నిధి..

‘కేజీయఫ్‌’కు గ్లామర్‌ టచ్‌ ఇచ్చిన భామ శ్రీనిధి శెట్టి. మోడల్‌ అయిన నిధి ‘మిస్‌ కర్ణాటక 2015’, ‘మిస్‌ దివా 2016’ తదితర అవార్డులు గెలుచుకొని ఈ సినిమాతోనే నటిగా మారింది. రాజేంద్ర దేశాయ్‌ కూతురు రీనా దేశాయ్‌గా కనిపించింది. తన అందం అభినయంతో ఆకట్టుకుంది. రాఖీని అసహ్యించుకునే ధనవంతురాలిగా, తర్వాత.. రాఖీని ప్రేమించే మనసున్న అమ్మాయిగా విభిన్న పార్శ్వాలు చూపింది. యశ్‌కు తగ్గ జోడీ అనిపించుకుంది. సీక్వెల్‌లోనూ సందడి చేయనుంది.

నిధి

అమ్మ స్ఫూర్తి

నిజ జీవితంలో, సినిమాల్లోనూ ప్రతి ఒక్కరికీ ఎవరో ఒకరు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఒకానొక సమయంలో ముంబయిను శాసించే విధంగా మారేందుకు, ఎదుటివారికి సాయపడేందుకు రాఖీకు స్ఫూర్తినిచ్చింది తన తల్లి శాంతమ్మ. ఈ కీలక పాత్రను అర్చనా జొయిస్‌ పోషించింది. డబ్బులేకపోతే బతకడం మాత్రమే కష్టం కాదని, చావు కూడా కష్టంగానే ఉంటుందంటూ ఈ పాత్ర చెప్పిన మాట ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకుంది. ఓ వ్యాధి కారణంగా ‘శాంతమ్మ’ పాత్ర చనిపోవడంతో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో కనిపించే అవకాశం ఉంది.

రాఖీ అమ్మ

కథ చెప్పింది వీరే..

తెరపై కనిపించింది తక్కువ సమయమే అయినా కథను ముందుకు తీసుకెళ్లడంలో పెద్ద పాత్ర పోషించారు మాళవిక అవినాష్‌, అనంత్‌ నాగ్‌. ‘నరాచీ లైమ్‌స్టోన్‌ కార్పొరేషన్‌’.. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీయఫ్‌) అనే వాస్తవాన్ని కళ్లకు కట్టినట్టు రాసిన రచయిత ఆనంద్‌ వాసురాజ్‌గా అనంత్‌ నాగ్‌ ఒదిగిపోయారు. ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్‌ తెలుగు డబ్బింగ్‌ చెప్పడంతో ఈ పాత్ర ప్రత్యేకంగా నిలిపింది. నరాచీలో జరిగే విషయాల గురించి తాను రాసిన వివాదాస్పద పుస్తకం ‘ఎల్‌ డొరాడో’ను ప్రభుత్వం బ్యాన్‌ చేస్తుంది. తమ ఇన్‌ఫ్లూయన్స్‌ ద్వారా ఓ వార్తాసంస్థ ఒక కాపీని చేజిక్కించుకుంటుంది. ఆ పుస్తకం ఎందుకంత వివాదాస్పదమైంది? అందులో ఉన్న నిజమేంటి? తెలుసుకునేందుకు ఆనంద్‌ను ఇంటర్వ్యూ చేస్తుంది చీఫ్‌ ఎడిటర్‌ దీపికా హెగ్డే (మాళవిక). ఈ క్రమంలో వచ్చే ‘ఇప్పుడేం చేస్తాడు మీ హీరో’ అనే సంభాషణ ఎంతగా పాపులరైందో తెలిసిన విషయమే. ‘పవర్‌ఫుల్‌ పీపుల్‌ కేమ్‌ ఫ్రమ్‌ పవర్‌ఫుల్‌ ప్లేసెస్‌’ అంటూ ఆనంద్‌ ఇచ్చిన సమాధానం ఎంతటి సంచలనం సృష్టించిందో విధితమే. ‘ఇది పరిచయం మాత్రమే అసలు కథ ముందుంది’ అంటూ రెండో అధ్యాయంపై అంచనాలు పెంచింది ఆనంద్‌ పాత్ర.

ఈ సీన్​తోనేనా స్టార్ట్​ అవుతుందా?

అమ్మవారికి పూజలు చేసేందుకు వెళ్లిన గరుడను.. రాఖీ చంపేయడం వల్ల.. 'కేజీయఫ్​ -1'కు శుభం కార్డు పడుతుంది. అయితే ఇప్పుడు చాప్టర్​-2 ఎక్కడి నుంచి మొదలవుతుంది అనే సందిగ్ధత సినిమా అభిమానులు.. సినీ ప్రియుల్లో నెలకొన్నది. కథను ముందుకు తీసుకెళ్లడంలో కీలమైన ఆనంద్‌ వాసురాజ్‌ పాత్రతోనే కథ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రేక్షకులు అసౌకర్యానికి గురి కాకుండా.. జరిగిన దానిని గుర్తు చేసేందుకు.. కథను చెప్పే ఆనంద్‌ వాసురాజ్‌ పాత్రతోనే.. పార్ట్​-2 మొదలవుతుందని సినీ విశ్లేషకుల అంచనా.

ఇదీ చూడండి:సోనమ్‌ ఇంట్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు- ఆమె అత్త..!

ABOUT THE AUTHOR

...view details