మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన 'గని' సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాక్సింగ్ కథాంశంతో ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాలు.. బక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. పవన్‌కల్యాణ్, రవితేజతో పాటు చాలా మంది హీరోలు రింగ్‌లోకి దిగి ‘పంచ్’విసిరి.. ప్రేక్షకులను అలరించిన వారే. బాక్సింగ్ థీమ్‌తో వచ్చిన సినిమాలపై ఓ లుక్కేద్దాం.
దట్ ఈజ్ తమ్ముడు
బాక్సింగ్ సినిమా అంటే తెలుగు ప్రేక్షకులకు ఠక్కున గుర్తొచ్చేది ‘తమ్ముడు’. అంతగా ఈ సినిమా ప్రభావం చూపింది. అన్నదమ్ముల (పవన్ కల్యాణ్, అచ్యుత్) అనుబంధం నేపథ్యంలో తెరకెక్కి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రమాదవశాత్తూ బాక్సింగ్‌కు అనర్హుడైన అన్న కలను నిజం చేసే తమ్ముడి కథ ఇది. సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు (సుభాష్) పాత్రలో ఓ వైపు నవ్వులు, మరోవైపు యాక్షన్‌తో పవన్ కల్యాణ్ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, బాక్సింగ్ ప్రాక్టీస్ కోసం ఆయన చేసిన రియల్ స్టంట్స్, ‘లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్’ గీతం ఎందరిలోనో స్ఫూర్తినింపాయి. ఇప్పటికీ ఈ పాట వింటూ కసరత్తులు చేసేవారెందరో ఉన్నారు. ఈ చిత్రానికి అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు.
తండ్రికి తగ్గ తనయుడు
రఘువీర్ (ప్రకాశ్‌రాజ్) కిక్ బాక్సింగ్‌లో ఛాంపియన్. ఒకానొక సమయంలో తన ప్రియ శిష్యుడు ఆనంద్ (సుబ్బరాజ్)ను ఛాంపియన్‌గా మార్చాలనుకుంటాడు. కానీ, కూతురు స్వప్నను మోసం చేశాడని తెలుసుకుని షాక్ అవుతాడు. అప్పుడు చందు (రవితేజ) రంగంలోకి దిగుతాడు. తనయుడు గొప్ప బాక్సర్ అని తెలుసుకున్న రఘువీర్ ఆ క్షణం ఉప్పొంగిపోతాడు. తన వారసుడు వచ్చాడని మురిసిపోతాడు. చదువుతుంటేనే ‘ట్విస్ట్ అదిరింది’ అని అనిపిస్తుంది కదూ. ఈ కథతో తెరకెక్కిందే ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. టైటిల్‌కు తగ్గట్టు అమ్మ (జయసుధ), నాన్న (ప్రకాశ్‌రాజ్), ఓ తమిళ అమ్మాయి (అసిన్) చుట్టూ కథ తిరుగుతుంది.
ఇరు దేశాల మధ్య..
మిగతా బాక్సింగ్ చిత్రాలతో పోలిస్తే ‘జై’ విభిన్నంగా నిలుస్తుంది. ఎందుకంటే ఇండియా- పాక్ మధ్య యుద్ధంలా సాగే కథ ఇది. మిగతా సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్ ఉంటే ఇందులో దేశభక్తి కనిపిస్తుంది. భారతీయులను తక్కువ చేసి మాట్లాడిన పాక్ ఛాంపియన్‌ను బాక్సింగ్ బరిలో మట్టికరిపించిన ఓ యువకుడి ప్రయాణమిది. నవదీప్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు తేజ దర్శకుడు. నవదీప్ నటించిన తొలి చిత్రమిదే. తేజ దర్శకత్వం వహించారు.
గురువు అంటే ఇలా..
మాధవన్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన తమిళ చిత్రం సాలా ఖడూస్’. సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఇదే సినిమా ‘గురు’ పేరుతో తెలుగులో రీమేక్ అయింది. వెంకటేశ్ హీరోగా రితికా సింగ్ కీలక పాత్రలో తెరకెక్కింది. బాక్సింగ్ అసోసియేషన్ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటూనే.. పేదింటి అమ్మాయి (రితికా) ప్రతిభను గుర్తించి, ఆమెను ఛాంపియన్‌గా మార్చే ఓ కోచ్ కథ ఇది. టాలెంట్‌కు డబ్బుతో పనిలేదని రితికా పాత్ర నిరూపిస్తే ‘గురువు అంటే ఇలా ఉండాలి’ అని వెంకటేశ్ పాత్ర అందరితోనూ అనిపించింది.