The Vaccine War First Look : వాస్తవిక ఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాలు తెరకెక్కించడంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి మంచి పేరుంది. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఆయన.. తాజాగా 'ది వ్యాక్సిన్ వార్' సినిమాను తెరకెక్కించారు. సుమారు 11 భాషల్లో విడుదలవ్వనున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో సీనియర్ హీరో నానా పాటేకర్, 'ది కశ్మీర్ ఫైల్స్' ఫేమ్ నటి పల్లవి జోషి, సీనియర్ స్టార్ అనుపమ్ ఖేర్, 'కాంతార' హీరోయిన్ సప్తమి గౌడ ఉన్నారు.
ప్రపంచమంతటా కొవిడ్ వ్యాప్తించి ప్రజలు భయభ్రాంతులతో వణుకున్న సమయంలో అందరికీ అందుబాటులో ఉండేలా ఓ వాక్సిన్ తయారైంది. ఈ టీకాను భారత్లోని పలువురు శాస్త్రవేతలు కనుగొన్నారు. ఐసీఎంఆర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ- పుణెతో కలిసి ఆ టీకాను మన దేశంలో తయారు చేశారు. ఆ వాక్సిన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఎందరికో ప్రాణదానం చేశారు. అలా ఒక్క టీకాతో ప్రపంచం మొత్తాన్ని మన వైపుకు చూసేలా చేసిన భారతీయ శాస్త్రవేత్తల గురించి ఈ సినిమాను తీస్తున్నట్లు వివేక్ తెలిపారు. కరోనా సమయంలో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన వ్యాక్సిన్‌ను తయారుచేయడంలో మహిళా శాస్త్రవేత్తల పాత్ర కూడా ఉందని వారి గురించి ఇందులో ప్రత్యేకంగా ప్రస్థావించినట్లు ఆయన వెల్లడించారు.