The Elephant Whisperers Bomman And Bellie : ఆస్కార్ విజేత, ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీ దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌పై బెల్లీ, బొమ్మన్ దంపతులు తీవ్ర ఆరోపణలు చేశారు. డాక్యుమెంటరీ చిత్రీకరించే సమయంలో తమతో ఆత్మీయంగా ఉన్న కార్తికి.. ఆస్కార్ గెలుపొందిన తర్వాత ఎంతో మారిపోయారని ఆరోపించారు. తమ ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం లేదని తెలిపారు. ఇప్పటివరకూ తమకు డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. ఈ డాక్యుమెంటరీ తర్వాత తమకు ఉన్న ప్రశాంతత మొత్తం పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
'లక్ష ఇస్తానని చెప్పి.. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు..'
Bomman And Bellie Controversy : డాక్యుమెంటరీ చిత్రీకరించిన సమయంలో దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ మాతో చక్కగా ఉండేవారని బెల్లీ, బొమ్మన్ దంపతులు తెలిపారు. "షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓరోజు ఆమె మావద్దకు వచ్చి పెళ్లి సీన్ షూట్ చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. ఆమె వద్ద డబ్బు లేదని తెలిపింది. మమ్మల్నే ఖర్చు పెట్టమని అడిగింది. సరే అని చెప్పి.. బెల్లీ తన మనవరాలి చదువు కోసం దాచిన డబ్బు తీసి ఆమెకు ఇచ్చాం. పెళ్లి సీన్ కోసం దాదాపు రూ.1 లక్ష ఖర్చు పెట్టాం. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ తిరిగి ఇవ్వలేదు. ఫోన్ చేసినా బిజీగా ఉంటున్నానని.. తర్వాత చేస్తానంటూ కాల్ కట్ చేస్తున్నారు" అంటూ ఆరోపణలు చేశారు.