తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ప్రేక్షకుల అవగాహన పెరిగింది.. ఓటీటీలతో నష్టమే.. ఇక మేం మారాల్సిందే' - thank you movie release

నాగచైతన్య కథానాయకుడిగా, విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'థ్యాంక్‌ యూ'. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్​రాజు సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

thank you naga chaitanya
thank you naga chaitanya

By

Published : Jul 19, 2022, 7:16 AM IST

"మంచి సినిమాలు అందిస్తూ.. అందుబాటులో టికెట్‌ ధరలు ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. విడుదలైన వెంటనే ఓటీటీల్లో రావడం వల్ల థియేటర్లకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోంది. వాళ్లలో ఖర్చు చేసే సామర్థ్యమూ తగ్గడం అందుకు ఓ కారణం. నెల రోజుల్లో పరిశ్రమని మళ్లీ కొత్తగా చూస్తార"న్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌తో కలిసి వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారాయన. ఇటీవల ఆదిత్య మ్యూజిక్‌ సంస్థతో కలిసి 'థ్యాంక్‌ యూ' నిర్మించారు. నాగచైతన్య కథానాయకుడిగా, విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఈనెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

"నేను చేసిన ఏ సినిమాని ఇప్పటిదాకా నా జీవితంతో పోల్చి చూసుకోలేదు. తొలిసారి 'థ్యాంక్‌ యూ'తోనే అది జరిగింది. రచయిత బి.వి.ఎస్‌.రవి నాలుగేళ్ల కిందట నాకు కథ చెప్పారు. అందులో ఒక అంశం బాగా నచ్చింది. జీవితంలో 'థ్యాంక్‌ యూ' పదాన్ని ఎక్కువగా వాడుతుంటాం. కానీ చెప్పాల్సిన వాళ్లకి ఆ మాట చెబితే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. ఎక్కడో ఆటోమొబైల్‌ రంగంలో నా జీవితం మొదలైంది. ఇప్పుడు సమాజానికి దిల్‌రాజుగా కనిపిస్తున్నా. పంపిణీదారుడిగా, నిర్మాతగా నాకు చాలామందే సాయం చేశారు. ఇక్కడ ఆగి నాకు సాయం చేసినవాళ్లని గుర్తు చేసుకోవాలి. వాళ్లని కలిసి కృతజ్ఞతలు చెబితే రెండువైపులా ఆ భావోద్వేగాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి ప్రత్యేకతతో కూడిన సినిమానే ఇది. ఓ సాధారణ కుర్రాడు ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. అతను ఆ ప్రయాణమంతా తనదొక్కడితే అనుకుంటాడు. కానీ అది నిజం కాదు. అతనికి సాయం చేసినవాళ్లు చాలా మందే. వాళ్లని గుర్తు చేసే క్రమంతోపాటు, అందమైన ప్రేమకథలు, వాణిజ్య కోణాలన్నీ కలిపితే ఈ సినిమా. 'థ్యాంక్‌ యూ' స్ఫూర్తితో నేను కూడా కరోనా సమయంలో కృతజ్ఞతలు చెబుతూ నా ప్రయాణాన్ని మొదలుపెట్టా. నా స్కూల్‌ జీవితం నుంచి ఆటోమొబైల్‌, సినీ ప్రయాణంలోనూ నాకు సాయం చేసినవాళ్లని కలుస్తున్నా. అందుకు సంబంధించి ఫొటోలూ, వీడియోలు తీయిస్తూ భద్రపరుస్తున్నా".

ఇందులో మూడు కథలు ఉంటాయి. నాగచైతన్య చేసిన 'ప్రేమమ్‌'లో ప్రేమకథలే ఉంటాయి. ఇది మాత్రం జీవితానికి సంబంధించిన కథలు. టీనేజ్‌, కాలేజీ జీవితాలతోపాటు.. జీరో నుంచి హీరోగా ఎదిగే క్రమం కూడా కీలకం. ఈ కథ వినడానికి గందరగోళంగా ఉంటుంది. కానీ విక్రమ్‌ కె.కుమార్‌ ఎంతో స్పష్టతతో సినిమాని తెరకెక్కించాడు. 90శాతం మా అంచనాల్ని అందుకున్నాడు. విక్రమ్‌కి ఈ కథ చెప్పాక నాగచైతన్య పేరు సూచించాడు. మూడు లుక్స్‌లో తను చాలా బాగా ఒదిగిపోయాడు. పీసీ శ్రీరామ్‌ కూడా ఈ కథలో ప్రయాణాన్ని నమ్మారు. విక్రమ్‌కీ, నాగచైతన్యకీ మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది. జులైలో విడుదలై ఘన విజయాలు అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. 'సింహాద్రి', 'తొలిప్రేమ', 'ఫిదా'... ఇవన్నీ ఆ నెలలోనే వచ్చాయి. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడొచ్చినా ఆదరిస్తారు.

కరోనా తర్వాత చిత్ర పరిశ్రమలో పరిస్థితులు మారిపోయాయి. ప్రేక్షకుల ఆలోచనల్లోనూ చాలా మార్పులొచ్చాయి. ఇంట్లో కూర్చుని భిన్నమైన కంటెంట్‌ని ఆస్వాదించారు. సినిమాల పరంగా ఎంతో అవగాహన పెంచుకున్నారు. ఇప్పుడు వాళ్లకి అంతంతమాత్రం కథలు నచ్చడం లేదు. ఇలాంటి సినిమాల కోసం ఇంత డబ్బు పెట్టి వెళ్లాలా అనుకుంటున్నారు. ఈ విషయాన్ని మేం అర్థం చేసుకుని, తదనుగుణంగా మారాల్సిన సమయం ఇది. ఈ మధ్య నిర్మాతలంతా కలిసి ఆ విషయమే మాట్లాడుకున్నాం. కథలు, మేకింగ్‌ శైలితోపాటు, నాన్‌ థియేట్రికల్‌, థియేట్రికల్‌ లెక్కలు మారిపోయాయి. వాటి గురించి ఇంకా బాగా అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి సినిమాకీ డబ్బు పోతుందని తెలిస్తే బాధ ఉంటుంది. నిర్మాతలకే కాకుండా.. ఇప్పుడు దర్శకులకి, హీరోలకీ కూడా ఆ విషయం అర్థమైంది.

ఓటీటీలతో నిర్మాతలకి లాభం కంటే నష్టమే ఎక్కువ. ఓటీటీలో సూపర్‌హిట్‌ అయినా మాకు వచ్చేదేమీ ఉండదు. అదే థియేటర్లలో విడుదలైతే, ఎప్పటికప్పుడు వసూళ్లు పెరుగుతుంటే ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది. నిర్మాతల గురించి హీరోలూ ఆలోచిస్తున్నారు. అందరూ అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. సమస్యల్ని అందరికీ అర్థమయ్యేలా చెబితే సరిపోతుందనేది నా అభిప్రాయం. స్టార్‌ హీరోల సినిమాలు థియేటర్ల తర్వాతే ఓటీటీకి వెళ్లాలి. అది కూడా పది లేదా ఇంకెన్ని వారాలో.. అనే విషయం గురించి చర్చిస్తున్నాం. పరిస్థితులన్నీ త్వరలోనే గాడిన పడతాయని నమ్ముతున్నా.

ఇవీ చదవండి:'ఆ విషయాన్ని 'థ్యాంక్‌ యూ' స్క్రిప్ట్​ గుర్తుచేసింది'

నాలుగో పెళ్లి చేసుకున్న జెన్నిఫర్ లోపేజ్.. సీక్రెట్​గా స్టార్​హీరోతో

ABOUT THE AUTHOR

...view details