Producers Guild: కరోనా పాండెమిక్ తరువాత సినిమాల బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. దానిక తగ్గట్టే నటీనటులు పారితోషికాలు కూడా పెంచేశారు. మరోవైపు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు కూడా భారీగా రెమ్యునరేషన్లను పెంచేశారని సమాచారం. ఇటీవల 24 క్రాప్ట్స్కు చెందిన టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్ట్‌లు కూడా తమ కనీస వేతనాలు పెంచాల్సిందే అంటూ మెరుపు సమ్మెకు దిగారు. ఇలా ప్రతీ విషయంలోనూ సినిమాల నిర్మాణం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో తెలుగు సినిమా నిర్మాతల మండలి (Producers Guild) ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
ఈ మేరకు గిల్డ్ సభ్యులైన నిర్మాతలు శనివారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారట. ఆ సమావేశంలోనే సంచలన నిర్ణయానికి సిద్ధం అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఓవైపు స్టార్ హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు.. మరోవైపు రోజు కూలీలతో పాటు 24 క్రాఫ్ట్‌లకు చెందిన వారంతా ఒకేసారి పారితోషికాలు పెంచేయడంతో సినిమాలు నిర్మించలేని స్థితిలో ఉన్నామని సమావేశంలో నిర్మాతలు వాపోతున్నారని తెలిసింది. ఈ సమావేశంలో పారితోషికాల విషయంలో సమ్మెకు దిగుతూ కొంత మంది సినిమాల షూటింగ్‌లను ఆపడానికి ప్రయత్నించిన విషయం.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫైవ్ స్టార్ భోజన ఖర్చులతో పాటు కొంత మంది రోజుల వారీగా.. గంటల వారిగా రెమ్యునరేషన్లను డిమాండ్ చేస్తున్న విషయం కూడా చర్చకు వచ్చినట్టుగా చెబుతున్నారు.