తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పవన్‌ కల్యాణ్‌, ఎన్టీఆర్​లలో ఎవరు నటించినా అది చరిత్ర సృష్టించేది'

ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా పలు విశేషాలు పంచుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో సినిమా చిత్రీకరణలు నిలిపివేసి, సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనమేమీ లేదని మీడియాతో ముచ్చటించారు. ఇంకా ఎమన్నారంటే..

telugu-news/movies/producer-c-kalyan-interview
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్

By

Published : Dec 9, 2022, 6:44 AM IST

ఈ ఏడాది ఆగస్టులో సినిమా చిత్రీకరణలు నిలిపివేసి, సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనమేమీ లేదని ప్రముఖ నిర్మాత, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్ అన్నారు. అది ఓ అట్టర్‌ ఫ్లాప్‌ షో అని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

గోవా తరహాలో వేడుకలు..
గోవాలో ప్రతి సంవత్సరం జరిగే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు మించిన వేడుకలను ఇక్కడా నిర్వహించాలనే ఆలోచన ఉంది. దక్షిణాది సినిమాలకు పెద్ద పీట వేస్తూ వచ్చే ఏడాది నుంచి అవార్డులు ఇవ్వాలనుకుంటున్నాం. ఈ విషయంలో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అవార్డుల విషయంలో పాదర్శకంగా వ్యవహరిస్తాం. ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ద్వారా వచ్చే ప్రతి రూపాయినీ చిత్ర పరిశ్రమ కోసమే ఖర్చుచేస్తాం. ఈ ఇండస్ట్రీ వల్లే ‘కల్యాణ్‌ అమ్యూస్మెంట్‌ పార్క్‌’ నిర్మించే అవకాశం దక్కింది. అది తమిళనాడు ప్రభుత్వం, దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నా. సహాయ దర్శకుడిగా నా కెరీర్‌ చెన్నైలోనే ప్రారంభమైంది.

ఫిల్మ్‌ ఛాంబర్‌ శాశ్వతం..!
ఇటీవల షూటింగ్‌లు ఆపేసి, సమస్యలపై నిర్మాతలు చర్చించుకోవడం అనేది అట్టర్‌ ఫ్లాప్‌ షో. దాన్ని వల్ల ప్రయోజనం లేదనేది ఐదో రోజు సమావేశంలోనే నాకు అర్థమైంది. అగ్ర హీరోలతో సినిమాలు తీసే పెద్ద నిర్మాతలు డబ్బు ఎక్కడ వృథా అవుతుందోనన్న దాన్ని ఆ మీటింగ్‌ వల్ల తెలుసుకున్నారు. కానీ, ఇప్పటికీ అమలుచేయలేకపోతున్నారు. ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ తమ గురించి తామే మాట్లాడుకునే ఆర్గనైజేషన్‌. దాన్ని నేను పట్టించుకోను. అంతకు ముందు ఏదో పేరు ఉండగా అది గిల్డ్‌ అయింది, రేపు గిల్డ్‌ స్థానంలో మరోటి వస్తుంది. శాశ్వతంగా ఉండబోయేది ఫిల్మ్‌ ఛాంబర్‌ మాత్రమే. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల గురించి మాట్లాడేందుకు దిల్‌ రాజు వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలనుకున్నాడు. కానీ, ప్రైవేట్‌ డిస్కషన్‌ వద్దనుకుని ఛాంబర్‌ తరఫున చర్చించుకున్నాం.

ఆ పరిస్థితి ఇప్పుడు లేదు
ఆంధ్రప్రదేశ్‌.. సినిమా పరిశ్రమకు రెండో ఊరు అయింది. ఇక్కడ ఏదైనా సమస్య వస్తే అక్కడికి నలుగురు కలిసి వెళ్లడమే పెద్ద పనిగా మారింది. పదేళ్ల తర్వాత ఏపీ వారు ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండరని భావిస్తున్నా. ఒకప్పుడు కృష్ణా జిల్లా నుంచి పది మంది పరిశ్రమలో అడుగుపెడితే వారిలో ఒకరు విజయం సాధించేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి ఏపీలో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలని ఉంది.

అది తప్పు
సంక్రాంతికి సినిమా విడుదల విషయంలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ చిత్ర బృందాలు ఫిర్యాదు చేయలేదు. అందుకే ఆ విషయంలో ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ మాట్లాడడం తప్పు. దీని గురించి వారికీ చెప్పాను. ఇండస్ట్రీ ఇచ్చిన రూపాయితో మేం జీవితంలో నిలబడ్డాం. అందుకే పరిశ్రమకు సహకరించమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.

నా బాధ అదే..
నేను నిర్మించిన ‘గాడ్సే’ మంచి చిత్రం. అయితే, ఓటీటీలో చూసినంతగా ప్రేక్షకులు దాన్ని థియేటర్లలో చూడలేదు. ఆ కథను మోయగలిగే నటుడుకావాలని నేను దర్శకుడికి ముందే చెప్పా. కానీ, అప్పటికే హీరో ఫిక్స్‌ అయిపోయాడు. ఆ సబ్జెక్ట్‌ని బాగా డీల్‌ చేయగలిగేది తెలుగులో పవన్‌ కల్యాణ్‌, ఎన్టీఆర్‌ మాత్రమే. ఈ ఇద్దరిలో ఎవరు నటించినా ‘గాడ్సే’ ఓ చరిత్ర సృష్టించేది. పిల్లల్ని బాగా చదివించి, వారికి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న తల్లితండ్రులందరికీ ఇది రీచ్ అవుతుందని భావించాం. కానీ, కుదరలేదు. అదొక్కటే బాధ. రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించాం. నటుడు సత్యదేవ్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ సినిమాగా నిలిచింది.

తదుపరి ప్రాజెక్టులు..
‘ఆర్గానిక్‌ మామా హైబ్రీడ్‌ అల్లుడు’ సినిమా పూర్తయింది. ఆ చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడు. ఆయనకు మంచి విజయం అందిస్తుందని అనుకుంటున్నా. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా అది. ఓ అగ్ర హీరోతో ‘రామానుజాచార్య’ అనే సినిమాను ఇంగ్లిష్‌లో నిర్మించనున్నాం. అంతర్జాతీయ కంపెనీతో కలిసి ఆ ప్రాజెక్టును ప్రొడ్యూస్‌ చేయబోతున్నాం. త్వరలోనే ప్రారంభిస్తాం. ముందుగా ఈ సినిమాని మూడు భాగాలుగా తీయాలనుకున్నా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒకే సినిమాగా చేస్తున్నాం. ‘బాలకృష్ణ చేస్తారా?’ అని ప్రశ్నించగా ఆయన్నే అనుకుంటున్నామని కల్యాణ్‌ తెలిపారు. వీటితోపాటు తక్కువ బడ్జెట్‌లో కొన్ని చిత్రాలు నిర్మిస్తున్నానని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details