Telugu Movies in Theaters: పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్‌ఆర్'తో రెండో వారమూ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈ క్రమంలో ఈ వారం అటు థియేటర్, ఇటు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దామా! వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటించిన గని, రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మా ఇష్టం(డేంజరస్), బరి, డస్టర్ వంటి చిత్రాలు థియేటర్లలో సందడి చేయనుండగా.. ఇంకొన్ని ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
పెద్ద సినిమా ఆ ఒక్కటే: ఇటీవల కాలంలో అడపాదడపా క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. కథల ఎంపిక బాగున్నా, భావోద్వేగాల పరంగా మెప్పించడంలో తడబడుతున్నాయి. కానీ, ఆ లోటు తీర్చేస్తానంటున్నారు యువ కథానాయకుడు వరుణ్‌తేజ్. ఆయన బాక్సర్‌గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గని'. సయీ మంజ్రేకర్ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 8నప్రేక్షకుల ముందుకు రానుంది. బాబాయ్ పవన్‌కల్యాణ్ 'తమ్ముడు' స్ఫూర్తితోనే ఈ సినిమా చేసినట్లు వరుణ్ చెబుతున్నారు. జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్‌శెట్టి ఇలా భారీ తారాగణమే ఉంది. దీనికి తోడు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. మరి బాక్సర్‌గా అబ్దుల్ గని ఉస్మాన్ అలియాస్ గని ప్రయాణం ఎలా సాగింది? బాక్సర్‌గా పేరు తెచ్చుకునే క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కడం విశేషం.
వర్మ మరో ప్రయోగం:సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ డ్రామా చిత్రం 'మా ఇష్టం'(డేంజరస్). అప్సరారాణి, నైనా గంగూలీ కీలక పాత్రలు పోషించారు. తెలుగులో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేస్తున్నారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఈ సినిమా పోస్టర్ చూసినా, ట్రైలర్ చూసినా 'పెద్దవాళ్లకి మాత్రమే' తరహా సినిమానేమో అనే అభిప్రాయం కలుగుతుంది. నిజానికి ఇదొక క్రైమ్ డ్రామా. స్వలింగ సంపర్కులైన ఇద్దరు మహిళల ప్రేమకథగా సాగుతుంది. ఇన్నేళ్లుగా ఇన్ని సినిమాలు చేశాక నేనొక ప్రయోగం చేస్తే నాకు పోయేదేమీ లేదు' అని వర్మ చెబుతున్నారు. మరి వర్మ మరో ప్రయోగం ఫలిస్తుందా? వికటిస్తుందా? చూడాల్సి ఉంది. వీటితో పాటు, మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.'రెడ్డిగారింట్లో రౌడీయిజం', 'బరి', 'డస్టర్', 'కథ కంచికి మనం ఇంటికి' సినిమాలు వాటిలో ఉన్నాయి.
ఈ వారం ఓటీటీలో రాబోతున్న చిత్రాలివే! స్టాండప్ రాహుల్:ఇటీవల విడుదలై, ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం 'స్టాండప్ రాహుల్'. రాజ్‌తరుణ్ కథానాయకుడిగా శాంటో మెహన వీరంకి తెరకెక్కించారు. వర్ష బొల్లమ్మ కథానాయిక. స్టాండప్ కామెడీతో నవ్వులు పంచడమే కాదు, కథానాయికతో కలిసి తెరపై భావోద్వేగాలు పంచారు రాజ్‌తరుణ్. ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగాఏప్రిల్ 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్, మురళీశర్మ, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో
- మర్డర్ ఇన్ అగోండా(హిందీ) ఏప్రిల్ 8
- నారదన్ (మలయాళం) ఏప్రిల్ 8