Telugu Cinema Shooting Bandh: చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1వ తేదీ నుంచి చిత్రీకరణలు నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయించారు. గిల్డ్ నిర్ణయానికి ఫిలిం ఛాంబర్ మద్దతు తెలిపింది. టికెట్ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో సినిమాల విడుదలపై చర్చే ప్రధాన అజెండాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు షూటింగ్‌లు నిలిపివేస్తామని ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న వాటికి కూడా బ్రేక్ ఇస్తామని ఆయన చెప్పారు. సినిమా చిత్రీకరణలను కొన్ని రోజులు ఆపాలని నిర్ణయించినట్లు తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడు బసిరెడ్డి తెలిపారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోతున్నామనుకుంటున్న సినీ నిర్మాతలు.. ఇప్పుడు మేల్కోకపోతే ఇండస్ట్రీ మనుగడ ప్రమాదంలో పడిపోతుందని గ్రహించారు. ఈ మేరకు నష్టనివారణ చర్యలు మొదలుపెట్టారు. అందుకోసం చిత్రీకరణలు నిలిపివేసి సమస్యలు పరిష్కరించుకోవాలని తెలుగు నిర్మాతలు నిర్ణయించారు. సినిమాల్లో సరైన కంటెంట్ లేకపోవడం, ఓటీటీలకు ప్రేక్షకులు అలవాటు పడటంతో ప్రేక్షకులు థియేటర్లకు దూరమైనట్లు నిర్మాతలు భావిస్తున్నారు. కొత్త సినిమాలు రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదల కావడమూ నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారు. చిన్న,పెద్ద సినిమాలతో సంబంధం లేకుండా టికెట్ ధరలను పెంచడం వల్ల కూడా ప్రేక్షకులు ఓటీటీలపై దృష్టి పెట్టినట్లు గుర్తించారు.
సమస్యల పరిష్కారానికి 36 మందితో కమిటీ.. అంతకుముందు.. ఆదివారం ఉదయం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. నూతన అధ్యక్షుడిగా బసిరెడ్డి రెండు ఓట్ల తేడాతో గెలిచారు. ఆయనతో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ పోటీ పడ్డారు. 42 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సమస్యల పరిష్కారానికి 36 మందితో ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ... ఆగస్టు 2న సమావేశం కానుంది. వారం నుంచి రెండు వారాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయని నిర్మాతలు భావిస్తున్నారు.