వేసవి తర్వాత బాక్సాఫీసు యువ కథానాయకులకే అంకితమైంది. స్టార్ హీరోల సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. మళ్లీ బాక్సాఫీసు దగ్గర అసలు సిసలు హంగామా దసరా నుంచే మొదలవుతోంది. చిరంజీవి, నాగార్జున నటించిన 'గాడ్‌ఫాదర్', 'ది ఘోస్ట్' అక్టోబరు 5న విడుదలవుతున్నాయి. మంచు విష్ణు నటించిన 'జిన్నా'తోపాటు మరికొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. వాయిదా పడుతూ వచ్చిన కొత్త సినిమాలు పట్టాలెక్కడానికి కూడా ఇదే తరుణంగా కనిపిస్తోంది.
ఆ జాబితాలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ సినిమాలు ముందు వరసలో ఉన్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న 'పుష్ప2' అక్టోబరులోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం. చాలా రోజులుగా పూర్వ నిర్మాణ పనుల్ని నిర్వహిస్తోంది చిత్రబృందం. దాదాపుగా ఆ పనులు పూర్తి కావడంతో ఇక అల్లు అర్జున్ కెమెరా ముందుకు రావడం పక్కా అయినట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ - కొరటాల కలయికలలో రూపొందనున్న సినిమాకి సంబంధించిన కసరత్తులు కూడా పూర్తయినట్టు తెలిసింది. ఇటీవలే ఎన్టీఆర్ పూర్తిస్థాయి స్క్రిప్ట్ విని పక్కా చేసినట్టు తెలిసింది. దాదాపుగా అక్టోబర్ నెలలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం. పవన్‌కల్యాణ్ కూడా తన సినిమా 'హరి హర వీరమల్లు'ని అదే నెలలోనే పునః ప్రారంభించనున్నట్టు సమాచారం. మహేష్‌బాబు - త్రివిక్రమ్ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా రంగంలోకి దిగనుంది.
ప్రచార సందడి
పండగలు వచ్చాయంటే చిత్రసీమలో ప్రచార హంగామా ఓ స్థాయిలో సాగుతుంటుంది. భలే మంచి రోజు అంటూ ప్రచార చిత్రాల్ని విడుదల చేస్తుంటారు సినీ రూపకర్తలు. కొత్త కలయికల్ని, సినిమాల పేర్లనీ ప్రకటిస్తుంటారు. వేడుకల్నీ నిర్వహిస్తుంటారు. ఆ తరహా సందడి దసరా, దీపావళి సందర్భంగా గట్టిగానే సాగనున్నట్టు స్పష్టమవుతోంది.