కొన్ని సినిమాలు అటు ప్రేక్షకుల్ని, ఇటు విమర్శకుల్నీ మెప్పించి వసూళ్ల వర్షం కురిపిస్తుంటాయి. కొన్నేమో అభిమానుల్ని మాత్రమే మెప్పించి వసూళ్లు సాధిస్తుంటాయి. మరికొన్నేమో విమర్శకుల్ని మాత్రమే మెప్పించి, వసూళ్లతో సంబంధం లేకుండా విజయాలుగా నమోదవుతుంటాయి. మహేష్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' సినిమాలతో వసూళ్ల వర్షం కురిపించారు. ఈ చిత్రాలు బాక్సాఫీసు దగ్గర విజయాల్ని నమోదు చేశాయి. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు మహేష్. 'గాడ్‌ఫాదర్'తో చిరంజీవి విజయాల బాట ఎక్కారు. ఆ చిత్రం వసూళ్ల కోణంలో కంటే.. విమర్శకుల్ని మెప్పించిన సినిమాగా నిలిచింది. గాఢతతో కూడిన చిరంజీవి నటన ఎక్కువగా మెప్పించింది. 'వాల్తేరు వీరయ్య'తో మరోసారి ఆయన కామిక్ టైమింగ్ చూపించి పాత సినిమాల్లో చిరంజీవిని గుర్తు చేశారు. అలా వరుస విజయాలతో కొనసాగుతూ... 'భోళా శంకర్' సినిమాలో నటిస్తూ మరిన్ని అంచనాల్ని పెంచుతున్నారు.
- 'అఖండ', 'వీరసింహారెడ్డి'లతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు బాలకృష్ణ. దీంతో ఇప్పుడు ఆయన దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి చేస్తున్న సినిమాతో అంచనాలు భారీగా పెరిగాయి. రవితేజ కూడా 'ధమాకా'తో బాక్సాఫీసుని కళకళలాడించారు. తొలి వారంలోనే రూ.వంద కోట్ల వసూళ్లని సాధించిందా చిత్రం. ఆ వెంటనే 'వాల్తేరు వీరయ్య'తోనూ సందడి చేసి వరుస విజయాల్లో భాగం అయ్యారు.
- రాశికంటే వాశి ముఖ్యమని భావిస్తూ... సినిమాలు చేయడంలో ఆలస్యమైనా విజయవంతంగా ప్రయాణం చేస్తున్న కథానాయకులు కొద్దిమంది ఉన్నారు. ప్రేక్షకుల అభిరుచులు... నేటి సినిమాల స్థాయిని పరిగణనలోకి తీసుకుని అందుకు తగ్గట్టుగా సినిమాలు చేస్తున్నారు. 'అల వైకుంఠపురములో'తో విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్, తర్వాత 'పుష్ప: ది రైజ్'తో మరో హిట్ అందుకున్నారు. ఆ పరంపరని కొనసాగించడమే లక్ష్యంగా, మధ్యలో ఏడాదికిపైగా విరామం వచ్చినా మరో చిత్రం చేయకుండా 'పుష్ప: ది రూల్' కోసం రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ 'అరవింద సమేత వీర రాఘవ'తో విజయాన్ని అందుకున్న అనంతరం, 'ఆర్‌ఆర్‌ఆర్'పైనే దృష్టిపెట్టి మరోసారి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత అందుకు దీటైన సినిమా చేయాలనే సంకల్పంతో, మధ్యలో విరామం వచ్చినా లెక్క చేయకుండా కొరటాల శివతో కలిసి రంగంలోకి దిగుతున్నారు. త్వరలోనే ఈ కలయికలో సినిమా పట్టాలెక్కనుంది. 'వకీల్‌సాబ్'తో అలరించిన పవన్‌కల్యాణ్... 'భీమ్లానాయక్'తోనూ అభిమానుల్ని మెప్పించారు. ఈ సినిమాల వసూళ్లపై రకరకాల అంశాలు ప్రభావం చూపించినా... పవన్ కల్యాణ్ కెరీర్‌లో మంచి సినిమాలుగా నమోదయ్యాయి. ఇప్పుడు 'హరి హర వీరమల్లు'ని పూర్తిచేసే పనిలో ఉన్న ఆయన 'ఉస్తాద్ భగత్‌సింగ్' సహా పలు కొత్త చిత్రాలకి పచ్చజెండా ఊపారు.
- యువ కథానాయకులు కూడా వరుస విజయాలతో జోరు ప్రదర్శిస్తున్నారు. అడివి శేష్ 'క్షణం' మొదలుకొని తిరుగులేని రీతిలో విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. 'అమీతుమీ', 'గూఢచారి', 'ఎవరు', 'మేజర్', 'హిట్2'... ఇలా వరుసగా విజయాలే ఆయనకి. ఇప్పుడు 'గూఢచారి2' పూర్తిచేసే పనిలో ఉన్నారు. మరో యువ కథానాయకుడు నిఖిల్ 'అర్జున్ సురవరం'తో హిట్ ట్రాక్‌లోకి ఎక్కారు. ఆ తర్వాత వచ్చిన 'కార్తికేయ2' పాన్ ఇండియా స్థాయిలో విజయవంతమైంది. ఇటీవలే వచ్చిన '18 పేజీస్' కూడా యువతరాన్ని మెప్పించి ఆయన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది. నవీన్ పోలిశెట్టి 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ'తో సత్తా చాటి, ఆ తర్వాత 'జాతిరత్నాలు'తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మహేష్ దర్శకత్వంలో అనుష్కకి జోడీగా ఓ సినిమా చేస్తున్నారు.
ఇవీ చదవండి: