Varisu First Single Released: తమిళ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'వారిసు'. తెలుగులో ఈ సినిమా వారసుడుగా రిలీజ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన రష్మిక, విజయ్‌ల ఫస్ట్ లుక్ విపరీతంగా ఆకర్షిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. తమిళ వర్షన్‌లో విడుదలైన ఈ సాంగ్ అభిమానులను ఊర్రూతలూగిస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో విజయ్ ఏకకాలంలో నటిస్తున్న చిత్రం వారిసు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్ ఈ మూవీతో నేరుగా పలకరించబోతున్నారు. ఈ చిత్రం ఫ్యామిలీ సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్, రొమాన్స్ కథా చిత్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Nachindi Girl Friend Trailer: ఉదయ్ శంకర్ కథానాయకుడిగా గురు పవన్ తెరకెక్కించిన చిత్రం 'నచ్చింది గర్ల్ ఫ్రెండూ'. అట్లూరి నారాయణరావు నిర్మాత. జెన్నీఫర్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హీరో వెంకటేష్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ట్రైలర్ చాలా బాగుంది. కథ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయని తెలిసింది. ఈ చిత్రంతో ఉదయ్‌కు మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్నా" అన్నారు.
"యువతరం మెచ్చే కథతో రూపొందిన చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నా" అన్నారు చిత్ర నిర్మాత అట్లూరి నారాయణరావు. హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. "ఒక్కరోజులో జరిగే కథ ఇది. అన్ని రకాల భావోద్వేగాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమా యువతరానికి బాగా నచ్చుతుంది. వెంకటేష్ మా ట్రైలర్‌ను విడుదల చేసి.. మా బృందాన్ని అభినందించడం మాకు కొత్త శక్తిని ఇచ్చింది" అన్నారు. "ఒకరోజులో జరిగే ఈ ప్రేమకథలో చాలా భావోద్వేగాలున్నాయి" అంది నాయిక జెన్నీఫర్. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్, ఛాయాగ్రహణం: సిద్దం మనోహర్.