Tamil Movie Tollywood : ఒకప్పుడు తమిళ అనువాద చిత్రాలకు ఫుల్ క్రేజ్ ఉండేది. పాన్ ఇండియా లెవల్లో సంచలనం సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. తెలుగులోనూ అక్కడి చిత్రాలు సత్తా చాట్టాయి. ఆ హీరోలకు కూడా ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. 2000వ దశకంలో అయితే చంద్రముఖి, గజిని, అపరిచితుడు, శివపుత్రుడు, శివాజి, రంగం, రోబో లాంటి ఎన్నో అనువాద చిత్రాలు ఇక్కడ బాక్సాఫీస్ ముందు వసూళ్ల మోత మోగించి రికార్డులు క్రియేట్ చేశాయి.
అయితే గత దశాబ్ద కాలంలో కాస్త పరిస్థితులు మారాయి. తెలుగు సినిమాల రేంజ్ బాగా పెరిపోయింది. మార్కెట్ పరిధి కూడా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా 'బాహుబలి' పుణ్యమా అంటూ వరల్డ్ వైడ్‌గా టాలీవుడ్ పాపులారిటీ పెరిగిపోయింది. అదే సమయంలో తమిళ సినిమా హవా కూడా కాస్త తగ్గింది. అనువాద చిత్రాలకు ఇక్కడ కాస్త డిమాండ్ తగ్గింది. అయితే కోలీవుడ్ మాత్రం ఎప్పుడు టాలీవుడ్‌కు పోటీ ఇవ్వాలనే ఆలోచనతోనే ముందుకెళ్తుంటుంది. ఈ క్రమంలోనే మళ్లీ కోలీవుడ్ వేగం క్రమక్రమంగా పుంజుకుంటోంది. అలాగే టాలీవుడ్లో కోలీవుడ్ సినిమాలకు మళ్లీ మార్కెట్ పెరుగుతోంది. ఇప్పటికే పొన్నియిన్ సెల్వన్, విక్రమ్, వారసుడు, బిచ్చగాడు-2 లాంటి చిత్రాలకు ఇక్కడ మంచి కలెక్షన్లే వచ్చాయి. తాజాగా రజనీకాంత్ 'జైలర్'(Jailer movie collections) కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ మార్కును దాటిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.