ప్రముఖ నటుడు, దర్శకుడు మనోబాల కన్నుమూశారు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. బుధవారం ఆయన తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ ఇండస్ట్రీ శోక సంద్రంలోకి మునిగింది. ఆయన మృతి పట్ల ప్రముఖలు సంతాపం తెలుపుతున్నారు. 1970లో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మనోబాల.. దాదాపు మూడున్నర దశాబ్దలపాటు తమిళ సినీపరిశ్రమకు సేవలందించారు. ఓ దర్శకుడిగా, నిర్మాతగా, కమెడియన్‌గా ఆయన కోలివుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ సుపరిచితుడే.
డిసెంబరు 8, 1953లో జన్మించిన ఆయన.. 1979లో ప్రముఖ కోలివుడ్ దర్శకుడు భారతీరాజా దగ్గర 'పుతియా వార్పుగల్' అనే తమిళ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ పనిచేశారు. అలా తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఇక 1982లో వచ్చిన 'అగయా గంగై' అనే సినిమా కోసం తొలిసారి మెగాఫోన్ పట్టారు. అలా డైరెక్షన్ వైపు అడుగులేసిన ఆయన దాదాపు 24 చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన ఆఖరి సినిమా 'నైనా' (2002).
ఓ వైపు సినిమాలను తెరకెక్కిస్తూనే మరోవైపు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో దాదాపు 345 చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తన కామెడీ టైమింగ్‌తో పాటు తన నటన శైలితో ఇండస్ట్రీలో వెలుగొందిన ఆయన.. 19 ధారావాహికల్లో నటించి బుల్లితెర ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అవ్వడం వల్ల తెలుగు అభిమానులకు చేరువయ్యారు.
ఇక తెలుగులో ఆయన 'మహానటి', 'దేవదాసు', 'రాజ్‌దూత్', 'వాల్తేరు వీరయ్య' వంటి చిత్రాల్లో తన నటనతో టాలీవుడ్ ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇటీవలే ఆయన 'వాల్తేరు వీరయ్య' సినిమాలో జడ్జి పాత్రలో కనిపించి కడుపుబ్బా నవ్వించారు. కాజల్ అగర్వాల్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఘోస్టీ'లో ఆయన చివరిసారిగా కనిపించారు. దాదాపు 350 సినిమాల్లో సహాయ నటుడిగా మెరిసిన ఆయన.. మూడు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి స్టార్స్ సినిమాల్లో హాస్యనటుడిగా నటించి ప్రేక్షకులను అలరించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. 'వేస్ట్ పేపర్' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నడిపించేవారు. తమిళ ఇండస్ట్రీలోని అగ్ర తారలతో పాటు యంగ్ స్టార్స్‌తో కూడా ఆయన పనిచేశారు.మనోబాల మృతి తమిళ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.