ఈ ఏడాది బాలీవుడ్ సినిమాలు ఆశించినంతగా అలరించలేకపోయాయి. కొన్ని సినిమాలు ఫర్వాలేదనిపించినా మరికొన్ని మాత్రం బాక్సాఫీసు వద్ద డీలాపడ్డాయి. కారణం ఏదైనా ప్రముఖ హీరోల చిత్రాలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. భారీ అంచనాల మధ్య విడుదలైనా సినిమాలు బడ్జెట్‌ను కూడా వసూలు చేయలేకపోయాయి. 2022లో సినీ ప్రియుల ఎదురుచూపులను నిరాశపరిచిన బీటౌన్ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.
హీరోపంతి-2
బాలీవుడ్ టాప్ హీరో టైగర్ ష్రాఫ్, తారా సుతారియా జంటగా నటించిన హీరోపంతి-2 చిత్రం హిట్ కొట్టలేక పోయింది. ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అహ్మద్‌ఖాన్ దర్శకత్వంలో రూ.70 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ.24.91 కోట్లు మాత్రమే సాధించగలిగింది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మాత్రం డల్ అయింది.
జయేశ్‌భాయ్ జోర్దార్
రణ్‌వీర్‌సింగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రాల్లో 'జయేశ్‌భాయ్ జోర్దార్' ఒకటి. దివ్యాంగ్ థక్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బొమన్ ఇరానీ, రత్నపథక్ షా, జియా వైద్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మే13న విడుదలైన ఈ చిత్రం సినీ ప్రియులను ఆకట్టుకోలేక పోయింది. రూ.86 కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ.16.59 కోట్లు వసూలు చేయగలిగింది.
యాక్షన్ హీరో
ఆయుష్మాన్ ఖురానా తన కెరీర్‌లోనే తొలిసారి యాక్షన్ కథాంశంతో 'యాక్షన్ హీరో' అంటూ సందడి చేద్దామనుకున్నాడు. అయితే, ఎంతో ఆశగా వచ్చిన ఈ హీరోకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. తాజాగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.8.19కోట్లకే పరిమితమైంది.
సామ్రాట్ పృథ్వీరాజ్
ప్రేమ, శౌర్యం, ధర్మం మూర్తీభవించిన మహా వీరుడు పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో అక్షయ్‌కుమార్ నటించిన చిత్రం 'సామ్రాట్ పృథ్వీరాజ్'. ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రాల్లో ఇది ఒకటి. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయడంలో విఫలమైంది. రూ.175 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ.68.06 కోట్లు రాబట్టింది.
రక్షా బంధన్
అక్షయ్‌కుమార్ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'రక్షాబంధన్'. ఈ సినిమాకు ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. టైటిల్‌కు తగట్టు సినిమాలేదన్నది సినీ అభిమానుల అభిప్రాయం. దీంతో ఈ సినిమా ఈ ఏడాది వైఫల్యాల జాబితాలో చేరింది. రూ.100కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.45.23 కోట్లు సాధించింది.