Suriya Kanguva Movie Update : తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా 'కంగువా'. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేలా చేశాయి. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి నిర్మాత జ్ఞానవేల్ రాజా తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
"ఈ సినిమా ప్రస్తుతం మేకింగ్ దశలో ఉంది. విడుదలకు భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. 'కంగువా'ను ఏకంగా 38 భాషల్లో రిలీజ్ చేయనున్నాం. ఐమ్యాక్స్, 3డీ వెర్షన్‌లోనూ ఇది అందుబాటులోకి తెలుస్తున్నాం. తమిళనాడు చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత పెంచేలా ఈ సినిమా ఉండనుంది." అని జ్ఞానవేల్ రాజా అన్నారు. ఈ వ్యాఖ్యల కారణంగా ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.