తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Superstar Krishna: సాహసాల మొనగాడు.. తేనె మనసు 'బుర్రిపాలెం' బుల్లోడు - undefined

రేయి.. పగలు అనే తేడా లేకుండా సినీ సీమలో అలుపెరగకుండా మెరిసింది ఓ తార. వెండితెరకు తనవైన సాహసాల వెలుగులు.. ప్రయోగాల సొబగులు అద్ది సరికొత్త దారుల్ని చూపించింది ఆ ధ్రువతార. అందుకే అభిమానంతో స్వచ్ఛందంగా అంతా 'సూపర్‌ స్టార్‌' అన్నారు. అలా పిలిపించుకున్న ఆ తార, ధ్రువతార... మన 'బుర్రిపాలెం బుల్లోడు' ఘట్టమనేని కృష్ణ.

Superstar Krishna
Superstar Krishna

By

Published : Nov 16, 2022, 7:31 AM IST

Superstar Krishna: ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ.. అంటూ పాడుకున్నారు కృష్ణ. నిజంగా ఆకాశం నుంచి తారే దిగి వచ్చి కృష్ణని ఆవహించిందేమో... కెరీర్‌ తొలి అడుగుల్లోనే స్టార్‌ అనిపించుకున్న ఆయన... జయాపజయాలతో సంబంధం లేకుండా దశాబ్దాల పాటు 'సూపర్‌స్టార్‌'గా వెలిగారు.

సాహసాలకి 'సింహాసనం' వేసి, తాను అనుకున్నది సాధించిన 'అసాధ్యుడు' కృష్ణ. చిత్ర పరిశ్రమలో అప్పటికే 'హేమాహేమీలు' ఉన్నా... ఆరంభం నుంచే ప్రయోగాలకి పట్టం కడుతూ, పక్కన పోటీగా ఎవరు కనిపిస్తున్నా 'అతనికంటే ఘనుడు' అనిపించుకున్నవాడు. 'అగ్ని పరీక్ష'ల్ని ఎదుర్కొని... ఆ తర్వాత వరస విజయాలతో రగిలిన 'జమదగ్ని' కృష్ణ. చిత్రసీమలో ఒక్కసారి పడ్డాక, మళ్లీ లేవడమే కష్టం అంటారు. అలాంటిది పడి లేచి 'నెంబర్‌వన్‌' అనిపించుకున్న ఏకైక హీరో... కృష్ణ. 'తెలుగువీర లేవరా' అంటూ ప్రపంచ సినిమావైపు దారిని చూపించి.. కొత్త కథ, సాంకేతికతల్ని పరిచయం చేశారు.

ఎప్పటికప్పుడు ప్రపంచ సినిమాలో మార్పులకి అనుగుణంగా కొత్త సాంకేతికతని పరిచయం చేయడంలోనూ, కొత్త కథల్ని తెలుగు తెరకి తీసుకు రావడంలోనూ ఆయన ముందున్నారు. అదే ఆయన విజయ రహస్యం.

కథానాయకుడిగానే కాదు, నిర్మాతగా, దర్శకుడిగా జైత్రయాత్ర కొనసాగించారు. తన అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్‌తోనూ, తను కథానాయకుడిగా ఎదిగేందుకు స్ఫూర్తినిచ్చిన ఏఎన్నార్‌తోపాటు శోభన్‌బాబు, కృష్ణంరాజు, ఆ తర్వాత వచ్చిన నవతరం కథానాయకులతోనూ సినిమాలు చేసి మల్టీస్టారర్‌ చిత్రాల మొనగాడు అనిపించుకున్నారు. అత్యధిక మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించిన నటుడిగా కృష్ణ రికార్డులు సాధించారు. ''మరో కథానాయకుడితో నటించడంలో నాకెలాంటి అభ్యంతరాలు ఉండేవి కావు. అప్పట్లో మా మధ్య మంచి వాతావరణం ఉండేది. కథలూ అలాంటివి వచ్చేవి. అందుకే, మల్టీస్టారర్‌ చిత్రాల సంఖ్య అప్పట్లో ఎక్కువగా ఉండేది'' అనేవారు కృష్ణ.

మీ పాత్ర డ్రెస్‌ వేసుకొని నిద్రపోండి చాలు..
కెరీర్‌ మొదలైన మూడో ఏట నుంచీ కృష్ణకి రోజూ మూడు షిఫ్టులూ... సినిమానే. విరామం అంటూ లేకుండా... అంతగా పనిచేశాక ఎవరైనా అలసిపోతారు, ఇంటికి వెళ్లిపోతానంటే 'మీరు నిద్రపోయేటప్పుడు మా పాత్రకి సంబంధించిన డ్రెస్‌ వేసుకుని పడుకోండి. కథలోని సన్నివేశం ప్రకారం మీరు నిద్రపోతున్న సన్నివేశమైనా తీసుకుని వెళ్లిపోతాం' అనేవారట కృష్ణతో మరో సినిమా తీస్తున్న దర్శకనిర్మాతలు. సూపర్‌స్టార్‌ కృష్ణ కెరీర్‌ అలా సాగింది. 1965లో ఒక్క సినిమాతో ప్రారంభమైన ఆయన ప్రయాణం... 67లో 7 సినిమాలతోనూ, 68లో 11, 69లో 15, 70లో 16, 71లో 11, 72లో 18 చిత్రాలతో జోరుగా సాగింది. కెరీర్‌ మొదలైన తొమ్మిదేళ్లలోనే వంద సినిమాల్ని పూర్తి చేసిన ఘనత ఆయనది.

తెలుగు కౌ బాయ్‌ (మోసగాళ్లకి మోసగాడు) ఆయనే. మన జేమ్స్‌బాండ్‌ (గూఢచారి 116) ఆయనే. వెండితెర అల్లూరి సీతారామరాజు అన్నా... 'కురుక్షేత్రం' అన్నా గుర్తుకొచ్చేది ఆయనే. అప్పటిదాకా తెలుగులో తెరకెక్కని నేర నేపథ్య చిత్రాల్ని చేసి ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకున్న కథానాయకుడు కృష్ణ. అలాగని ఓ ముద్రకి పరిమితం కాలేదు.

కుటుంబ కథలు, జానపద కథలు, రాజకీయ కథలు, చారిత్రాత్మక కథలతోపాటు, నవలా చిత్రాలతోనూ తనదైన ప్రతిభ చూపించి విజయాల్ని అందుకున్నారు. అల్లూరిగానే కాదు... యేసుక్రీస్తు, దేవదాసు, విశ్వనాథ నాయకుడు వంటి పలు వైవిధ్యమైన పాత్రలు చేశారు. దర్శకనిర్మాతలు రచయితలు ఎలాంటి పాత్రలతో సంప్రదించినా సరే... వెనకడుగు వేయని నైజం ఆయనది.

అల్లూరి జోలికే పోవద్దన్నా
ఏదైనా సాధించాలంటే... దేనికైనా సాహసించాలనేది కృష్ణ నమ్మిన సిద్ధాంతం. ఆ ధైర్యమే ఆయన్ని శిఖరాగ్రాన నిలబెట్టింది. కృష్ణ చేసిన 'అల్లూరి సీతారామరాజు', 'కురుక్షేత్రం' సంచలన చిత్రాలు. వాటికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని పూర్తి చేసి శభాష్‌ అనిపించుకున్నారు. అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌కి ఇష్టమైన పాత్ర... అల్లూరి సీతారామరాజు. అందులో నటించాలని ఆయనకి ఎప్పట్నుంచో కోరిక. ఇంతలో నిర్మాత డి.ఎల్‌.నారాయణ తాను సిద్ధం చేయించిన స్క్రిప్ట్‌ని కృష్ణ చేతిలో పెట్టారు. అది నచ్చి... సొంత సంస్థ పద్మాలయా సంస్థ నిర్మాణంలో 'అల్లూరి సీతారామారాజు' సినిమాని ప్రకటించారు కృష్ణ. పరిశ్రమ నుంచి వ్యతిరేక స్పందన వచ్చింది. ఎన్టీఆర్‌ కూడా 'వద్దు బ్రదర్‌' అని వారించారు. భారీ ప్రాజెక్ట్‌ చేయాలనుకుంటే 'కురుక్షేత్రం' తీయండి, నేను కాల్‌షీట్లు ఇస్తా అని ముందుకొచ్చారు. వెనక్కి తగ్గని కృష్ణ సాహసానికి సై అన్నారు. అన్నగారూ... నేను నిర్ణయం తీసేసుకున్నా. మీకు ఇష్టమైన పాత్ర కదా, మీరు వెంటనే ఈ సినిమా చేస్తానంటే నేను సంతోషంగా వెనక్కి తగ్గుతా. లేదంటే నేను చేస్తా' అని చెప్పి వచ్చేశారు.

సూపర్​ స్టార్​ కృష్ణ

ఎన్టీఆర్‌ నుంచి స్పందన రాకపోవడంతో సినిమా మొదలు పెట్టారు. పది రోజులు చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇంతలో చిత్ర దర్శకుడు కన్నుమూశారు. కానీ ఆయన కోరిక మేరకు కృష్ణ స్వయంగా దర్శకత్వం వహించి సినిమాని పూర్తి చేశారు. తెరపై దర్శకుడిగా పేరు మాత్రం రామచంద్రరావుదే. అందులోని పోరాట ఘట్టాలకు మాత్రం కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ నేతృత్వం వహించారు. ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. తాష్కెంట్‌ చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమైంది. ఆ తర్వాత పన్నెండేళ్లకి ఆ సినిమాని చూసిన ఎన్టీఆర్‌ 'కృష్ణగారు గొప్పగా తీశారు. మనం కొత్తగా అందులో తియ్యటానికేమీ లేదు. ఆ పాత్రని చేయాలనే నిర్ణయాన్ని విరమించుకుంటున్నాం' అన్నారట. ఆయన 125వ చిత్రంగా విడుదలైన 'కురుక్షేత్రం' కూడా ఓ సంచలనమే. అప్పట్లో ఎన్టీఆర్‌ చేసిన 'దానవీర శూరకర్ణ'కి పోటీగా వచ్చిన చిత్రంగా 'కురుక్షేత్రం' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్‌ వద్దన్నా కొన్ని కారణాలతో ఆ సినిమాని చేశారు కృష్ణ. 1977 జనవరి 14నే ఎన్టీఆర్‌ 'దానవీర శూరకర్ణ', కృష్ణ నటించి, నిర్మించిన 'కురుక్షేత్రం' విడుదలయ్యాయి. అందులో 'దానవీర శూరకర్ణ' ఘన విజయం అందుకోగా, 'కురుక్షేత్రం' మేకింగ్‌ ప్రేక్షకులు, పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. కృష్ణ కెరీర్‌లో ఓ మైలురాయి చిత్రం 'సింహాసనం'. సాంకేతికత అంతగా లేని రోజుల్లో నేటి బాహుబలి తరహాలో చేసిన జానపద చిత్రం ఇది.

నిర్మాతల హీరో
ఆ రోజుల్లో నిర్మాతల హీరోగా అవతరించారు కృష్ణ. ఆయన చుట్టూ పదుల సంఖ్యలో నిర్మాతలే. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల సినిమాలకి అయ్యే నిర్మాణ వ్యయంలో సగంతో కృష్ణ సినిమాలు పూర్తయ్యేవి. ఆయన సినిమాల్లో కొత్తతరం నటులే ఎక్కువగా కనిపించేవారు. దాంతో నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి పోటీపడేవారు. కృష్ణ కూడా తన పారితోషికం కంటే, నిర్మాత గురించే ఎక్కువగా ఆలోచించేవారు.

హీరోగా కృష్ణ తెర పరిచయమే ఓ సంచలనం. ఆయన తొలి చిత్రం 'తేనె మనసులు' తొలి సాంఘిక వర్ణచిత్రం. కొత్తతరంతో తీసిన ఆ సినిమాని రంగుల్లో తీస్తే బాగుంటుందని ఆదుర్తి సుబ్బారావు అనుకోవడంతో అలా తెరకెక్కింది. అది మొదలు పలు తొలి రికార్డులన్నీ కృష్ణ పేరుపైనే. తొలి తెలుగు కౌబోయ్‌ చిత్రం 'మొసగాళ్ళకు మొసగాడు'. తొలి స్కోపు చిత్రం 'అల్లూరి సీతారామరాజు'. తొలి తెలుగు అపరాధ పరిశోధక చిత్రం 'గూడచారి 116'. తొలి 70 ఎం.ఎం, సిక్స్‌ ట్రాక్‌ స్టీరియో ఫోనిక్‌ సౌండ్‌ సిస్టమ్‌ చిత్రం 'సింహాసనం'. 'తెలుగువీర లేవరా' తొలి డీటీఎస్‌ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా తెలుగు చిత్రసీమ గర్వంగా చెప్పుకొనే మైలురాళ్లన్నీ కృష్ణ చలవే. పొరుగు పరిశ్రమలకి కూడా అత్యాధునిక సాంకేతికతని తన పద్మాలయా సంస్థ నుంచి పరిచయం చేశారాయన.

ఒక సినీ శకం ముగిసింది
కృష్ణ మరణంతో తెలుగు చలన చిత్ర చరిత్రలో ఓ తరం సినీ శకం ముగిసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల నుంచి వెండితెర బొమ్మ రంగులద్దుకున్న వరకు తెలుగు చిత్రసీమ ఖ్యాతినీ.. కీర్తిని భుజస్కంధాలపై మోసింది ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజుల తరమే. ఆ తరం సినీ హీరోలనగానే తెలుగు సినీప్రియుల మదిలో మెదిలే అగ్ర తారలంతా వీరే. వాళ్లంతా ఒకొక్కరిగా ప్రేక్షకుల్ని కన్నీటి సంద్రంలో ముంచి దివికేగారు. ఎన్టీఆర్‌ 1996లో లోకాన్ని వీడగా.. శోభన్‌బాబు 2008లో.. ఏయన్నార్‌ 2014లో కాలం చేశారు. ఇక ఆ తరానికి ప్రతినిధులుగా మిగిలి ఉన్న కృష్ణంరాజు ఈ ఏడాది సెప్టెంబర్‌ 11న అనారోగ్యంతో కన్నుమూయగా.. ఇప్పుడు కృష్ణ కూడా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక తరం కనుమరుగైనట్లయింది.

.

''రిస్క్‌ తీసుకోకపోతే జీవితంలో మనం ఏమీ సాధించలేం. సాధించాలనుకుంటే రిస్క్‌ చేయాలి. ఇది నా తత్వం. నేను ఏదనుకంటే అది చేసేసేవాణ్ని. ఇఫ్‌ అండ్‌ బట్స్‌ ఆలోచించేవాణ్ని కాదు. 'సీతారామరాజు' సినిమా తీస్తాననగానే పరిశ్రమలో అందరూ నవ్వారు. హీరోయిన్‌ ఉండదు, కాషాయ వస్త్రాలతో ఉంటాడు. ఎవరు చూస్తారీ సినిమా? అన్నారంతా. సినిమా రిలీజ్‌ చేయడానికి ఒక్క డిస్ట్రిబ్యూటరూ రాలేదు. బలవంతంగా తారకరామ వాళ్ల చేత చేయించాం. తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే''.

కృష్ణ

''ఎన్ని ఫ్లాపులొచ్చినా మళ్లీ హిట్లొస్తాయన్న నమ్మకం నాకుండేది. 'కృష్ణ ఇక అయిపోయాడు అని ఎన్నోసార్లు చాలామంది కామెంట్‌ చేశారు. వాళ్లే మళ్లీ నాకు హిట్స్‌ రావడంతో 'అబ్బే...కృష్ణ కృష్ణే' అనేవారు''.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details