సూపర్‌స్టార్ కృష్ణ తన సినీకెరీర్‌లో సుమారు 350 సినిమాలు చేశారు. ప్రతి చిత్రం దేనికదే ప్రత్యేకం. కొన్నింటిలో ఆయన చేసిన సాహసాలు, పేల్చిన డైలాగులు, సింపుల్ డ్యాన్స్ స్టెప్పులు కనిపిస్తే.. ఇంకొన్నింటిలో ఇతర హీరోలతో కలిసి పంచిన వినోదం కనిపిస్తుంది. ఒకటీ రెండు కాదు దాదాపు 80 మల్టీస్టారర్ చిత్రాలు చేసి కృష్ణ రికార్డు సృష్టించారు. ఆయన ఏ ఏ హీరోలతో కలిసి నటించారో ఓసారి గుర్తు చేసుకుందాం..
ఎన్టీఆర్‌తో అలా.. కృష్ణ మరో హీరోతో కలిసి నటించిన తొలి చిత్రం 'ఇద్దరు మొనగాళ్లు'. అందులో కాంతారావుతో కలిసి తెరను పంచుకున్నారు. ఆ తర్వాత ఈ కాంబోలో మరో రెండు చిత్రాలొచ్చాయి. 'పాతాళభైరవి' సినిమాలోని ఎన్టీఆర్ నటనకు ముగ్దుడైన కృష్ణ.. ఆయనతోనే కలిసి నటించే అవకాశం రావడం గురించి ప్రత్యేకంగా చెప్పేవారు. ఎన్టీఆర్‌తో కలిసి కృష్ణ నటించిన తొలి సినిమా 'స్త్రీ జన్మ'. తర్వాత, ఈ కాంబినేషన్‌లో 'నిలువు దోపిడి', 'విచిత్ర కుటుంబం', 'దేవుడు చేసిన మనుషులు', 'వయ్యారి భామలు-వగలమారి భర్తలు' సినిమాలొచ్చాయి. ఈ ఐదు చిత్రాల్లోనూ ఈ ఇద్దరు హీరోలు సోదరులుగా నటించడం విశేషం.