పసందైన పాటలకు నెలవు కథానాయకుడు కృష్ణ చిత్రాలు. మంచి సంగీతాభిరుచి కలిగిన ఆయన.. తన సినిమాల పాటల ఎంపికలో ఎంతో ప్రత్యేకత కనబర్చేవారు. అందుకే ఆయన సినిమాల్లో సింహభాగం మ్యూజికల్ హిట్లుగా నిలిచాయి. అప్పట్లో కృష్ణ చిత్రాల పాటల క్యాసెట్లకు, పాటల పుస్తకాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. 'సాక్షి'లోని "అమ్మ కడుపు చల్లగా.." పాట నుంచి.. 'సింహాసనం'లోని "జింతాన జింతాన" పాట వరకు వందల చిత్రాల్లో ఎన్నో విజయవంతమైన పాటలు వినిపించారు కృష్ణ.
ఆయన చేసిన 'దేవదాస్' బాక్సాఫీస్ ముందు చేదు ఫలితాన్ని అందుకున్నా.. సంగీత పరంగా చక్కటి ఆదరణనే దక్కించుకుంది. అందులోని "కల చెదిరింది.. కథ మారింది.. కన్నీరే ఇక మిగిలింది" పాట అప్పట్లో ప్రతి చోటా వినిపించేది. 'అవేకళ్లు'లోని "మా ఊళ్లో ఒక పడుచుంది..’" 'పండంటి కాపురం'లోని "బాబూ వినరా..", "మనసా కవ్వించకే", 'మీనా'లోని "పెళ్లంటే నూరేళ్లపంట" గీతాలు ఇప్పటికీ వీనుల విందుగా వినిపిస్తూనే ఉంటాయి. 'దేవుడు చేసిన మనుషులు'లోని "మసక మసక చీకటిలో", 'ఊరికి మొనగాడు'లోని "ఇదిగో తెల్లచీర.. అదిగో మల్లెపూలు" వంటి గీతాలు అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించాయి.
ఇక కృష్ణ.. రచయిత సి.నారాయణ రెడ్డిలది పాటల పరంగా సూపర్ హిట్ కాంబినేషన్. కృష్ణ నటించిన పలు చిత్రాలకు ప్రాచుర్యం పొందిన ఎన్నో పాటల్ని అందించిన కలం సినారేదే. "ఎన్నాళ్లో వేచిన ఉదయం" (మంచి మిత్రులు), "గువ్వలా ఎగిరిపోవాలి" (అమ్మకోసం), "వస్తాడు నా రాజు ఈరోజు"(అల్లూరి సీతారామరాజు), "మ్రోగింది కల్యాణ వీణ" (కురు క్షేత్రం), "బుగ్గ గిల్లగానే" (ముహూర్తబలం), "పాలరాతి మందిరాన" (నేనూ మనిషినే), "చందమామ రమ్మంది చూడు" (అమాయకుడు) వంటి గీతాలు నాటి తరం ప్రేక్షకుల మదిలో ఆణిముత్యాల్లా నిలిచిపోయాయి. "మల్లెపందిరి నీడలో" (మాయదారి మల్లిగాడు), "నవ్వుతూ బతకాలి రా.. తమ్ముడూ నవ్వుతూ చావాలిరా" పాటలు ఇప్పటికీ మళ్లీ మళ్లీ వినాలనిపించేవే.
కృష్ణ సినిమాల్లో వినిపించిన పాటలన్నీ ఒకెత్తైతే.. 'అల్లూరి సీతారామరాజు'లోని "తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా" గీతం మరో ఎత్తు. మహాకవి శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన ఈ స్ఫూర్తిదాయక గీతానికి జాతీయ పురస్కారం దక్కింది. తెలుగులో జాతీయ అవార్డు అందుకున్న తొలి పాట ఇదే. 'సింహాసనం' సినిమాతో సంగీత దర్శకుడు బప్పీలహరిని తెలుగు తెరకు పరిచయం చేశారు కృష్ణ. 'గౌరీ' చిత్రంలోని "గల గల పారుతున్న గోదావరిలా", 'సింహాసనం'లోని "ఆకాశంలో ఒక తార", 'పచ్చని కాపురం'లోని "వెన్నెలైనా చీకటైనా.." వంటి గీతాలు రీమిక్స్ రూపంలోనూ ఈతరం ప్రేక్షకుల మదిపైనా చెరగని ముద్ర వేశాయి.
రికార్డుల అసాధ్యుడు
ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో.. 360 చిత్రాల్లో నటించిన కృష్ణ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. వాటిలో ముఖ్యమైనవి ఇవి...
- 1983లో ఒకే నగరంలో (విజయవాడ)లో ఆరు చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్న ఏకైక ఇండియన్ హీరో.
- 1972లో ఒకే ఏడాదిలో అత్యధికంగా 18 చిత్రాలు విడుదలయ్యాయి.
- కృష్ణ హీరోగా కె.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల సంఖ్య: 31
- కృష్ణతో పనిచేసిన సంగీత దర్శకులు : 52
- 1965 నుంచి 2009 వరకు 44 సంవత్సరాలు ఏ ఏడాదిలోనూ గ్యాప్ రాకుండా నటించిన ఏకైక హీరో.
- 44ఏళ్లలో సంక్రాంతి రోజు రిలీజైన సినిమాల సంఖ్య: 30
- కృష్ణ తెరకెక్కించిన తొలి సినిమా 'సింహాసనం' విడుదలైన థియేటర్ల సంఖ్య: 50
- కృష్ణతో నటించిన కథానాయికలు: 80
- కృష్ణ, జయప్రద కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు: 43
- కృష్ణ, శ్రీదేవి కలయికలో వచ్చిన చిత్రాలు: 31
- ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు: 25
- త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు: 7
కృష్ణ తల్లి కోరికే 'ముగ్గురు కొడుకులు'
కృష్ణ సినిమాల్లోకి రావడం వెనక ఆయన తల్లి నాగరత్నమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది. కృష్ణ హీరోగా ఎదిగాకా ఆమె కోరిక ఒకదాన్ని దర్శకుడు పీసీ రెడ్డితో 'ముద్దుబిడ్డ' సినిమా షూటింగులో చెప్పారట. "నాకు ముగ్గురు కొడుకులు కదా. ముగ్గురు కొడుకుల నేపథ్యంలో ఓ కథ తయారు చేయకూడదా!’ అని పీసీరెడ్డిని అడిగితే ఆయన అరగంటలో కథ చెప్పారట. ఆ చిత్రమే కృష్ణ దర్శకత్వం వహించిన 'ముగ్గురు కొడుకులు'. అందులో కృష్ణతో పాటు రమేష్‌బాబు, మహేష్‌బాబులు నటించారు.
కథానాయకుడిగానే..
కృష్ణ దాదాపు 350 సినిమాల్లో నటించారు. అందులో తొంభైశాతం హీరో, కీలక పాత్రలే. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించినవారు అరుదు. మొదటి సినిమా 1961 నుంచి 2016లో విడుదలైన ‘శ్రీశ్రీ’ వరకు ఆయనది యాభై రెండేళ్ల సుదీర్ఘ కెరీర్. ఇందులో 25 చిత్రాల్లో ద్విపాత్రాభినయం, ఏడు సినిమాల్లో త్రిపాత్రాభినయం చేశారు. భార్య విజయనిర్మలతో కలిసి ఏకంగా 49 సినిమాల్లో నటించారు.
తప్పిన ప్రాణగండం