కెరీర్ సంతృప్తికరంగా సాగుతున్న సమయంలోనే సూపర్‌స్టార్ కృష్ణకు దర్శకత్వం చేయాలనే ఆసక్తి ఉండేది. నటుడిగా తనకున్న అనుభవాన్ని రంగరించి తన అభిరుచికి తగ్గ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలనుకున్నారు. ఆ ఆలోచన కార్యరూపం దాల్చి 'సింహాసనం' అయింది. జానపద నేపథ్యం అయితేనే గ్రాండియర్‌గా ఉంటుందని భావించిన కృష్ణ తన శ్రేయోభిలాషులతో కలిసి ఓ నిర్ణయానికొచ్చారు. నిర్మాణ వ్యయం ఎక్కువవుతుందనే కారణంగా ఆ చిత్రాన్ని హిందీ (సింఘాసన్)లో కూడా ప్లాన్ చేశారు. హిందీ వెర్షన్‌కూ కృష్ణనే దర్శకత్వం వహించడం విశేషం. అంతేకాదు ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే బాధ్యతలూ కృష్ణవే. ఈ సినిమా సెట్స్‌ను రూ. 50 లక్షల వ్యయంతో రూపొందించారు. ఆ సెట్ 'టాక్ ఆఫ్ ది టాలీవుడ్' అయింది. 70 ఎం. ఎం. సిక్స్‌ట్రాక్స్ స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టమ్‌తో వచ్చిన తొలి సినిమాగా పేరొందిన 'సింహాసనం' రూ. 3 కోట్లతో నిర్మితమైంది. 'జానపదాలు అంతరించిపోతున్న రోజుల్లో ఇంత బడ్జెట్ పెట్టి జానపద చిత్రం తీయడం సాహసం' అని కృష్ణను ఎంతోమంది కొనియాడారు. 1986 మార్చి 21న 85 ప్రింట్లతో 157 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఇదీ ఓ రికార్డే.
సింహాసనం ఉత్సాహంలో.. తొలి చిత్రం 'సింహాసనం'తో దర్శకుడిగానూ తనకు తిరుగులేదని అనిపించుకున్న కృష్ణ తదుపరి 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు', 'కొడుకు దిద్దిన కాపురం', 'రిక్షావాలా', 'అన్న-తమ్ముడు', 'బాల చంద్రుడు', 'నాగాస్త్రం', 'ఇంద్ర భవనం', 'అల్లుడు దిద్దిన కాపురం', 'రక్తతర్పణం', 'మానవుడు దానువుడు', 'పండంటి సంసారం', 'ఇష్క్ హై తుమ్‌సే' (హిందీ) చిత్రాలను తెరకెక్కించారు.