తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్రవేసిన దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. వెండితెర అల్లూరి, తెలుగు జేమ్స్ బాండ్‌గా పేరొందడం సహా తొలి ఈస్ట్‌మన్ కలర్, 70 ఎమ్ఎమ్ వంటి సాంకేతికతను టాలీవుడ్‌కు పరిచయం చేసిన 80 ఏళ్ల నటశేఖరుడు అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆదివారం అర్ధరాత్రి కృష్ణ హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు.
నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు - తెలుగు నటులు కృష్ణ మృతి
తెలుగు చలన చిత్రపరిశ్రమ దిగ్గజం, సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. ఐదున్నర దశాబ్దాలపాటు చిత్రసీమను ఏలిన నటశేఖరుడు ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆదివారం అర్ధరాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. కోట్లాది అభిమానులను శోకసంద్రంలో వదిలి భువి నుంచి దివికేగారు. కృష్ణ అంత్యక్రియలను రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.
వైద్యులు వెంటనే ఆయనకు సీపీఆర్ చేసి కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకు తెచ్చారు. అయితే కీలకమైన అవయవాలు పనిచేయకపోవడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. కృష్ణ క్షేమంగా తిరిగి రావాలని అభిమానులు శ్రేయోభిలాషులు ప్రార్థించారు. సూపర్ స్టార్‌ను బతికేందుకు వైద్యులు గంటల తరబడి శ్రమించినా ఫలితం లేకపోయింది. ఈ తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.
తర్వాత కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి కృష్ణ పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అభిమానుల సందర్శనార్థం కృష్ణ భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియంలో ఉంచారు. బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3గంటలకు అంతిమయాత్ర చేపట్టనున్నారు. సాయంత్రం 4 తర్వాత మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనుంది.