రాత్రికి నానక్‌రామ్‌గూడ నివాసంలోనే కృష్ణ పార్థివదేహం ఉంచనున్నారు. అభిమాన నటుడి కడచూపు కోసం వచ్చే అభిమానులను రాత్రి 10.30 గంటల వరకు అనుమతించనున్నారు. బుధవారం ఉదయం 9 గం.కు పద్మాలయ స్టూడియోకు పార్థివదేహం తరలిస్తారు. మధ్యాహ్నం 12.30 వరకు పద్మాలయ స్టూడియోలోనే పార్థివదేహం ఉంచనున్నారు. తర్వాత ప్రభుత్వ అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కృష్ణ భౌతికకాయానికి ప్రముఖుల నివాళి.. ప్రభుత్వ లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలు - super star krishna pawankalyan
18:43 November 15
16:35 November 15
కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన ప్రభాస్
16:35 November 15
కృష్ణ వ్యక్తిత్వానికి సెల్యూట్ చేయాల్సిందే: ఆర్.నారాయణమూర్తి
"డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ. ఆయన మరణంతో ఒక గొప్ప శకం ముగిసింది. సినిమా ఇండస్ట్రీలో ఏదో సాధిద్దామని వచ్చిన ఎందరినో ప్రోత్సహించారు. నాలాంటి వారికి కూడా అవకాశాలు ఇచ్చారు. కృష్ణగారి ఆఫీస్ ఎప్పుడూ జనంతో కళకళలాడుతూ ఉండేది. సినిమా హిట్టయితే ఓకే. ఫ్లాఫ్ అయితే, నిర్మాతలను పిలిచి మరీ డేట్స్ ఇచ్చి ఆదుకునేవారు. 'అల్లూరి సీతారామరాజు'లో కృష్ణ నటన చూసి ఎన్టీఆరే స్వయంగా మెచ్చుకుని, మళ్లీ ఆ సినిమా తీయాలనుకున్న తన నిర్ణయాన్ని విరమించుకున్నారు. 'దేవదాస్' తీసి ఏయన్నార్‌తో మెప్పు పొందారు. కృష్ణ వ్యక్తిత్వానికి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే"
కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఏపీ సీఎం జగన్
దిగ్గజ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నివాళులర్పించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు గచ్చిబౌలి స్టేడియానికి రానున్న జగన్.. కృష్ణ పార్థివదేహానికి అంజలి ఘటించి మహేశ్‌బాబు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు గచ్చిబౌలి నుంచి పద్మాలయకు కృష్ణ అంతిమ యాత్ర జరగనుంది. అనంతరం మహాప్రస్థానంలో అంతక్రియలు నిర్వహించనున్నారు.
15:18 November 15
15:14 November 15
మంచి మిత్రుడిని కోల్పోయాను: కేసీఆర్
తెలుగు చలన చిత్ర రంగంలో సుప్రసిద్ధ సినీనటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయానని చెప్పారు. నానక్‌రామ్‌గూడలో కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
"కృష్ణ ఆతిథ్యమిస్తే చాలా సార్లు ఆయన ఇంటికి వచ్చాను. ఎలాంటి అరమరికలు లేకుండా ఆయన ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. పార్లమెంట్ సభ్యుడిగా దేశానికి సేవలందించారు. అల్లూరి సీతారామరాజు లాంటి దేశభక్తి సినిమాను తీశారు. కృష్ణ సేవలను, ఆయన చేసిన దేశభక్తి ప్రయత్నాన్ని గుర్తిస్తూ అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించాం. ఆయన కుటుంబసభ్యులకు దుఃఖాన్ని భరించే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని కేసీఆర్ అన్నారు.
15:14 November 15
కృష్ణ భౌతికకాయాన్ని చూసిన కన్నీటి పర్యంతమైన మోహన్‌బాబు
దిగ్గజ నటుడు కృష్ణ భౌతికకాయాన్ని చూసి నటుడు మోహన్‌బాబు భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణ పార్థివదేహం వద్దకు వచ్చి, ‘సోదరా.. సోదరా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆదిశేషగిరిరావు ఓదార్చే ప్రయత్నం చేసినా, మోహన్‌బాబు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. అనంతరం మహేశ్‌బాబును హత్తుకుని ధైర్యం చెప్పారు. కృష్ణ నటించిన ఎన్నో చిత్రాల్లో మోహన్‌బాబు ప్రతినాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఇద్దరూ కలిసి నాలుగైదు చిత్రాల్లో కథానాయకులుగానూ మెప్పించారు.
15:14 November 15
కృష్ణ ల్యాండ్‌మార్క్ పర్సన్: నిర్మాత సురేశ్‌బాబు
ఎలాంటి కల్మషం లేని మనిషి కృష్ణ అని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు అన్నారు. నిర్మాతకు అనుకూలంగా ఉండే వ్యక్తి ఆయనని చెప్పారు. కృష్ణ ల్యాండ్ మార్క్ పర్సన్ అని.. ఆయన మృతి తమకు తీరని లోటని చెప్పారు.
13:55 November 15
కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన సినీ నటులు చిరంజీవి, వెంకటేశ్
లెజెండరీ నటుడు కృష్ణ పార్థివదేహానికి అగ్ర కథానాయకులు చిరంజీవి, వెంకటేశ్‌లు నివాళులర్పించారు. నానక్‌రాంగూడ చేరుకున్న ఇరువురు కృష్ణ భౌతికకాయం వద్ద పుష్పాలను ఉంచి అంజలి ఘటించారు. అనంతరం మహేశ్‌బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహేశ్‌కు ధైర్యం చెప్పారు.
13:55 November 15
కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన మంత్రి కేటీఆర్
కృష్ణ పార్థివదేహానికి తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం మహేశ్‌బాబు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.
13:54 November 15
కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన వెంకయ్యనాయుడు
సినీ నటుడు కృష్ణ పార్థివదేహానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు, తనయుడు మహేశ్‌బాబుతో పాటు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. "కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు ఒక గొప్ప చిత్రం. అందులో ఆయన నటన అద్భుతం. కృష్ణ స్నేహశీలి. ఆయన మరణం విచారకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నా" అని వెంకయ్యనాయుడు అన్నారు.
13:54 November 15
మహేశ్‌బాబును పరామర్శించిన జూ.ఎన్టీఆర్
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన దిగ్గజ నటుడు కృష్ణ భౌతికకాయానికి జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, నాగచైతన్య, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణిలు నివాళులర్పించారు. కృష్ణ మృతితో తీవ్ర విషాదంలో ఉన్న మహేశ్‌బాబును ఓదార్చారు.
13:54 November 15
కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన చంద్రబాబు
కృష్ణ భౌతికకాయానికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. అనంతరం మహేశ్‌బాబును పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.‘‘కృష్ణ భావితరాలకు ఆదర్శం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అభిమాన సంఘాలు కలిగిన ఏకైక నటుడు ఆయన. అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ సినిమాలు చేశారు. మహేశ్‌బాబు కుటుంబంలో ఈ ఏడాది ముగ్గురు చనిపోవడం నిజంగా బాధాకరం. వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి.’’అని చంద్రబాబు అన్నారు.
13:53 November 15
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన అల్లు అర్జున్
12:47 November 15
ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు
సినీనటుడు కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు సూచనలు చేశారు.
12:43 November 15
కృష్ణ మృతి పట్ల నటుడు సుమన్ సంతాపం
12:42 November 15
కృష్ణ మృతి పట్ల రాహుల్ గాంధీ సంతాపం
తెలుగు సినిమా సూపర్‌స్టార్ కృష్ణ మరణవార్త చాలా బాధాకరం: రాహుల్
సినీ వృత్తి పట్ల కృష్ణకు క్రమశిక్షణ ఉండేది: రాహుల్‌గాంధీ
కృష్ణ మరణం సినీలోకానికి తీరని లోటు: రాహుల్‌గాంధీ
కృష్ణ కుటుంబసభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి: రాహుల్
12:21 November 15
సెట్‌లో కృష్ణకు నివాళులర్పించిన బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్ర బృందం
12:19 November 15
కృష్ణ మృతిపట్ల సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్రమోదీ
దిగ్గజ నటుడు కృష్ణ మరణం పట్ల ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. "కృష్ణగారు లెజెండరీ నటుడు. తన విలక్షణ నటనతో ఎందరో హృదయాలను గెలుచుకున్నారు. ఆయన మరణం సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి తీరనిలోటు. మహేశ్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి"
-ప్రధాని నరేంద్రమోదీ
12:08 November 15
ఆస్పత్రి నుంచి ఇంటికి కృష్ణ పార్థివదేహం
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన లెజెండరీ నటుడు కృష్ణ పార్థివదేహాన్ని కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి నానక్‌రాంగూడలోని ఆయన ఇంటికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కృష్ణ భౌతికకాయాన్ని ఇంటి వద్ద కాసేపు ఉంచి అక్కడి నుంచి అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. ఈ మేరకు కృష్ణ కుటుంబ సభ్యులు, పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
12:05 November 15
కృష్ణ మృతి పట్ల సాయికుమార్ సంతాపం
12:03 November 15
దర్శకుడు రాఘవేంద్రరావు
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో చలనచిత్ర సీమలో ఒక శకం ముగిసింది. కేవలం నటుడుగానే కాకుండా నాకు మంచి స్నేహితుడు. నా కుటుంబానికి ఎంతో ఆప్తుడు. మంచితనానికి మారుపేరు. దేవుడు చేసిన మనిషిని దేవుడే తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. - ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు.
11:41 November 15
సూపర్‌స్టార్ కృష్ణ నిర్మాతలకు శ్రేయోభిలాషి అని ప్రముఖ సినీనటుడు, ఆయన స్నేహితుడు మురళీమోహన్ చెప్పారు. కృష్ణతో తనకు 60 ఏళ్లకు పైనే అనుబంధం ఉందన్నారు. ఇద్దరం 1956లో ఏలూరులోని సీఆర్ రెడ్డి కాలేజ్‌లో ఇంటర్మీడియట్‌లో చేరామని గుర్తు చేసుకున్నారు. ఒకే రకమైన మనస్తత్వంతో ఆత్మీయంగా ఉండేవాళ్లమని మురళీమోహన్ వివరించారు. ఎప్పటికైనా థియేటర్ కట్టాలని, పడవలాంటి పెద్ద కారు కొనాలని అప్పట్లో కృష్ణ చెప్పేవారని.. ఆయన అనుకున్నవన్నీ సాధించారన్నారు. 'గూడఛారి 116' సినిమాతో కృష్ణ సినీ కెరీర్ స్ట్రాంగ్ అయిందని.. ఆ సినిమా ఘన విజయం తర్వాత ఆయనతో సినిమా తీసేందుకు నిర్మాతలు పోటీపడ్డారని గుర్తు చేసుకున్నారు. దీంతో ఒకేసారి సుమారు 20 సినిమాల్లో నటించాలని కృష్ణకు అవకాశాలు వచ్చాయని వివరించారు. సినిమా విడుదల అయిన తర్వాత దాన్ని జడ్జ్ చేయడంలోఎవరైనా ఆయన తర్వాతే అని మురళీమోహన్ కొనియాడారు.
10:34 November 15
ఆయనతో నటించిన మూడు సినిమాలు మధుర జ్ఞాపకాలు: రజనీకాంత్
లెజెండరీ నటుడు కృష్ణ మృతి పట్ల అగ్ర కథానాయకుడు రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. కృష్ణతో మూడు సినిమాలు నటించానని, అవి ఎప్పటికీ మధుర జ్ఞాపకాలు అని గుర్తు చేసుకున్నారు. మహేశ్‌బాబు, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కృష్ణ-రజనీకాంత్ కలిసి, ఇద్దరూ అసాధ్యులే, అన్నదమ్ముల సవాల్, రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రాల్లో నటించారు.
10:34 November 15
మాటలు రావడం లేదు: నితిన్
"కృష్ణగారు చనిపోయారన్న వార్త విన్న తర్వాత మాటలు రావడం లేదు. ఆయన ఆత్మకు శాంతికలగాలి. ఇలాంటి బాధాకరసమయంలో ఘట్టమనేని కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా" -యువ నటుడు నితిన్
- కృష్ణ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన నటుడు శ్రీకాంత్
- కృష్ణగారు నిజమైన లెజెండ్..: నిర్మాత విష్ణువర్థన్ ఇందూరి
- నేను ఆయన ఫ్యాన్ అని చెప్పుకోడానికి గర్వంగా ఫీలవుతా: సినీ రచయిత అబ్బూరి రవి
- కృష్ణ మృతిపట్ల విచారం వ్యక్తం చేసిన సంగీత దర్శకుడు తమన్
10:21 November 15
సూపర్‌స్టార్’కు నిజమైన అర్థం చెప్పారు: అల్లరి నరేశ్
"ఆయనలాంటి లెజెండ్ మరొకరు లేరు. ‘సూపర్‌స్టార్’ అంటే ఏంటో నిజమైన అర్థాన్ని కృష్ణగారు మనకు నేర్పారు. నా తండ్రి (ఈవీవీ సత్యనారాయణ)ఆయనకు పెద్ద అభిమాని. ఆయనను కోల్పోవడంతో మాటలు రావడం లేదు. మహేశ్‌బాబు సర్‌కు, ఆయన కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా" అని అల్లరి నరేశ్ పేర్కొన్నారు.
10:21 November 15
10:20 November 15
మంచిని ఆస్తిగా పొందిన నటుడు కృష్ణ: బ్రహ్మానందం
సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకశైలిని ఏర్పరుచుకుని, ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన వ్యక్తి కృష్ణ అని హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. కృష్ణ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన మాట్లాడుతూ.. కృష్ణ సాహసాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవడమే కాదని, గుండెధైర్యం కలిగిన నిర్మాత కూడానని అన్నారు. కృష్ణ మంచి నటుడు, దర్శకుడు, నిర్మాత అన్న ఆయన, మంచిని ఆస్తిగా పొందిన మహా నటుడు కృష్ణ అని కొనియాడారు.
10:20 November 15
మీరెప్పటికీ మా జ్ఞాపకాల్లో ఉంటారు: సమంత
హీరోయిన్ సమంత కూడా కృష్ణ మరణం పట్ల సంతాపం తెలిపింది. మీరెప్పటికీ మా జ్ఞాపకాల్లో ఉంటారని ట్వీట్ చేసింది.
10:19 November 15
ప్రతి జానర్‌లో సినిమా తీసిన ధైర్యశైలి కృష్ణ: నాగార్జున
"చలనచిత్ర పరిశ్రమలో ప్రతి జానర్‌లోనూ సినిమా తీసిన ధైర్యశాలి. తెలుగు చిత్రాల్లో ఆయనే నిజమైన కౌబాయ్. ఆయన సానుకూల ధోరణిని ఆకళింపు చేసుకోవడానికి నేను గంటల తరబడి కృష్ణగారి పక్కనే కూర్చొనేవాడిని. లెజెండరీ సూపర్‌స్టార్. మిమ్మల్ని మిస్ అవుతున్నాం కృష్ణగారు" -సినీ నటుడు అక్కినేని నాగార్జున
09:40 November 15
కళామతల్లి ముద్దుబిడ్డ ఘట్టమనేని కృష్ణ: నందమూరి బాలకృష్ణ
నటనలో కిరీటి, సాహసానికే మారుపేరు కృష్ణ: నందమూరి బాలకృష్ణ
స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్, అపర దానకర్ణుడు: బాలకృష్ణ
తెలుగులో కౌబాయ్ సినిమాలకు ఆద్యుడు: నందమూరి బాలకృష్ణ
కృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కు కోల్పోయింది: బాలకృష్ణ
కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలి: నందమూరి కల్యాణ్‌రామ్
కృష్ణ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: కల్యాణ్‌రామ్
09:25 November 15
ఎన్టీఆర్ సంతాపం
కృష్ణ అంటే సాహసానికి మరో పేరు: జూనియర్ ఎన్టీఆర్
ఎన్నో ప్రయోగాత్మక, విలక్షణ పాత్రలు చేశారు: జూనియర్ ఎన్టీఆర్
సాంకేతికంగా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేశారు: జూనియర్ ఎన్టీఆర్
కృష్ణ ఘనతలు ఎప్పటికీ చిరస్మరణీయం: జూనియర్ ఎన్టీఆర్
09:16 November 15
సూపర్ స్టార్ బిరుదుకు కృష్ణ సార్థకత చేకూర్చారు : పవన్
కృష్ణ మృతి పట్ల సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తుదిశ్వాస విడవడం తనను ఎంతో ఆవేదనను కలిగించిందని అన్నారు. చిత్ర సీమలో సూపర్ స్టార్ బిరుదుకు కృష్ణ సార్థకత చేకూర్చారని.. మద్రాస్‌లో ఉన్నప్పటి నుంచి తమ కుటుంబంతో మంచి అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రజా జీవితంలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. కృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు.
07:25 November 15
కృష్ణ మరణం మాటలకు అందని విషాదం: చిరంజీవి
సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణ మరణం మాటలకు అందని విషాదం అన్నారు మెగస్టార్ చిరంజీవి. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం కలబోసిన మనిషి కృష్ణ అని కొనియాడారు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల సాహసాలు చేశారని పేర్కొన్నారు.