సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు సినీ చరిత్రలో ఓ ట్రెండ్ సెట్టర్. సంచలన సినిమాలు చేయాలన్నా.. సాహస సినిమాలు తీయాలన్నా.. సూపర్ స్టార్ తర్వాతే ఎవరైనా. నటుడిగా మొదలైన తన సినీ జీవితంలో.. దర్శకుడిగా మారి ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. నిర్మాతగా మారి ఎన్నో మరుపురాని చిత్రాలకు ప్రాణం పోశారు. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా గూఢచారి 116, తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్ళకు మోసగాడు, తొలి ఫుల్‌స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, తొలి 70 ఎంఎం సినిమా సింహాసనం వంటివి ఎన్నో హిట్ చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించారు. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాల్లోనూ నటించారు. అయితే ఆయన ఎలా సినిమాల్లోకి వచ్చారు, సూపర్‌స్టార్ అన్న బిరుదు ఎలా వచ్చింది? దాన్ని కన్నా ముందు ఆయనకు ఉన్న టైటిల్స్ ఏంటో చూద్దాం..
అలా సినిమాల్లోకి..
తెలుగు సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణది ప్రత్యేక అధ్యాయం. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 1942, మే 31న జన్మించారు. ఆయన అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కృష్ణను హీరోగా పరిచయం చేశారు. అంతకుముందు ఒకట్రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. పూర్తిగా కొత్తవాళ్లతో తీసిన తేనెమనుసులు(1965) చిత్రంలో కృష్ణకు అవకాశం దక్కింది. అయితే అందులో ఆయన సోలో హీరో కాదు. మరో కొత్త నటుడితో తెరపంచుకున్నారు. ఆ సినిమా విజయం సాధించడంతో కృష్ణను వరుస అవకాశాలు తలుపు తట్టాయి. జానపద, పౌరాణిక, చరిత్ర, సాంఘిక చిత్రాల్లో నటించి ఆంధ్రుల హీరో అయ్యారు.