సూపర్ స్టార్ కృష్ణ సినిమాలతోనే కాకుండా.. పలు సేవా కార్యక్రమాలతోనూ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఎంతో మంది అండగా నిలిచారు. ఓ సారి ఆయన చేసిన సేవా కార్యక్రమాలను గుర్తుచేసుకుందాం..
- 1972లో కరవు బాధితుల సహాయ నిధికి తన మిత్రులతో కలిసి అన్ని ఊళ్లు తిరిగి ప్రదర్శనలిచ్చి వసూలైన సొమ్ముతో బాధితులను ఆదుకున్నారు కృష్ణ.
- 1973లో మంచివాళ్లకు మంచివాడు చిత్రం విడుదలైన మొదటిరోజు వసూళ్లను 'జై ఆంధ్ర' ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరుల కుటుంబాలకు అందించారు.
- 1977 ప్రకృతి విలయతాండవంలో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు పదివేల రూపాయలు విరాళం ఇచ్చి.. ఒక సంవత్సరంపాటు తనకు వచ్చే ఆదాయంలో 10% తుపాను బాధితులకు అందజేశారు.
- దివి తుపాను బాధితులకు లక్ష రూపాయలు విలువచేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
- అల్లూరి సీతారామరాజు చిత్రం విడుదల సందర్భంగా 'అల్లూరి సీతారామరాజు' సోదరుడికి రూ.10,000లు విరాళంగా ఇచ్చారు.
- 1975లో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు సహాయం.
- 1977లో మెదక్ పోలీసు సంక్షేమ నిధికి విరాళం.
- 1982లో తనతల్లి నాగరత్నమ్మ పేరుతో స్వగ్రామం 'బుర్రిపాలెం'లో జిల్లాపరిషత్ పాఠశాలను నిర్మించారు.
- మద్రాస్ తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల సంఘానికి రూ.25,000 విరాళం.
- ఆకలి రాజ్యం హిందీ చిత్రం షూటింగ్ సమయంలో చండీగఢ్‌లో జరిగిన ప్రమాదంలో నష్ణపోయిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు రూ.10,000 విరాళం.
- తన 200వ చిత్రం 'ఈనాడు' విడుదల సందర్భంగా విజయవాడ పోలీసు విభాగానికి రూ.25,000 విరాళం.
- 1983లో తుపాను బాధితులకు తన పేరిట లక్ష రూపాయలు. పద్మాలయ సంస్థ పేరున రూ.25,000లు, హిమ్మత్‌వాలా వేడుకల నిమిత్తం వసూలయిన మొత్తం సుమారు 3 లక్షల రూపాయాలు బాధితులకు విరాళంగా ఇచ్చారు.
- 1986లో సంభవించిన పెను తుపాను బాధితులకు రూ.4,00,000లు విరాళం ఇచ్చారు.
- గుజరాత్ భూకంప బాధితుల సహాయార్థం రూ.3,00,000 రెడ్‌క్రాస్ సంస్థకు అందజేశారు.