Suma Jayamma Panchayati movie: "సౌకర్యవంతమైన స్థానంలో ఉన్నప్పుడు ఏ భయాలు ఉండవు. అక్కడి నుంచి బయటికి రావడమే ఓ సాహసం. ఇవన్నీ ఎందుకని భయపడుతూ గిరిగీసుకుని అక్కడే ఉంటే మనలో కొత్తదనాన్ని ఎలా ఆవిష్కరిస్తాం? ధైర్యం చేసి నేను సినిమా చేసినందుకు నన్ను నేనే శభాష్ అని భుజం తట్టుకుంటున్నా" అన్నారు సుమ. వ్యాఖ్యాతగా బుల్లితెరతో ఇంటింటికీ చేరువైన ఆమె... 'జయమ్మ పంచాయితీ'తో వెండితెరపై సందడి చేయనున్నారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సందర్భంగా సిని సంగతులను తెలిపారు సుమ. ఆ విషయాలివీ...
"రంగస్థల నటిగా చాలా డ్రామాలు చేశా. అవతలి వాళ్ల డైలాగులూ గుర్తు పెట్టుకుని చెప్పడం, సరికొత్త పాత్రలతో సందడి చేయడం... ఇవన్నీ చాలా మిస్ అయ్యా. మీరు యాంకరింగ్ చాలా బాగా చేస్తున్నారంటూ అందరూ నన్ను మెచ్చుకునేవాళ్లే కానీ, ఇది మీరు చేయగలరా? అన్న వాళ్లు ఎవరూ లేరు. దర్శకుడు విజయ్‌కుమార్ 'జయమ్మ పంచాయితీ' స్క్రిప్ట్‌ని ఇచ్చి ఇది మీరు చేయగలరా? అన్నారు. ఇలాంటి మాట విని చాలా రోజులైంది కదా అనిపించింది. పైగా నా శక్తి సామర్థ్యాల్ని నేను పూర్తిగా ఆవిష్కరించలేదనే ఓ వెలితి ఉండేది. అందుకే ఓ సవాల్‌గా తీసుకుని ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నా. రమ్యకృష్ణ, అనుష్క... ఇలా చాలా మందిని అనుకుని రెండేళ్లుగా ఈ కథతో తిరిగారట దర్శకుడు. చివరికి నా దగ్గరికొచ్చారు. ఆయన రాసిన స్క్రిప్ట్ చదువుతుంటే జయమ్మ అనే పాత్రతో మొదలై... చివరి వరకూ అదే పాత్ర కనిపించింది. ఇంత నిడివి కలిగిన పాత్ర నా దగ్గరికి రావడం ఇంకెప్పుడో అని వెంటనే ఒప్పుకొన్నా".