ఒకప్పుడు.. నిర్మాతే దేవుడు. ఎంత గొప్ప నటుడైనా, దర్శకుడైనా నిర్మాత మాటను జవదాటేవారు కాదు. విజయ, ఏవీఎం, సురేశ్ ప్రొడక్షన్స్, ఉషాకిరణ్ మూవీస్ తదితర నిర్మాణ సంస్థలు అత్యధిక విజయవంతమైన చిత్రాలు నిర్మించాయంటే సినిమాపై ఆ నిర్మాతలకు ఉన్న అభిరుచి, నిర్మాణ వ్యయం పట్ల అవగాహన, నటీనటులు-సాంకేతిక నిపుణులపై ఉన్న పట్టే కారణం. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
కానీ, ఇప్పుడిప్పుడే కొన్ని నిర్మాణ సంస్థలు కథను పరిగణనలోకి తీసుకుని అద్భుత చిత్రాలను ప్రేక్షకులు అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో అలా భారతీయ చలన చిత్ర పరిశ్రమంతా చర్చించుకునేలా చేసిన నిర్మాణ సంస్థల్లో 'హోంబలే ఫిల్మ్స్' ఒకటి. 'కేజీయఫ్'తో సంచలనం సృష్టించిన ఈ సంస్థ 'కాంతార'తో రికార్డులు బద్దలు కొడుతోంది. ఇంకా ఎన్నో ఆసక్తికర ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోంది. వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న 'హొంబలే' ప్రయాణాన్ని ఓ సారి చూద్దాం..
హోంబలే అర్థమిదీ..విజయ్ కిరంగదూర్, చలువే గౌడ, కార్తిక్ గౌడ.. ఈ ముగ్గురికి సినిమాపై ఉన్న ఆసక్తే 'హోంబలే' ఫిల్మ్స్’కు కారణం. వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు విజయ్ కిరంగదూర్ మాండ్య నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయిన రోజులవి. అదే సమయంలో కార్తిక్ సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డారు. కానీ, ఈ కజిన్స్‌కు మాత్రం సినిమాపై ప్రేమ పోలేదు. ఎలాగైనా చిత్ర పరిశ్రమలోకి వెళ్లాలనుకుని, దాని కోసం ఎంతో ప్రయత్నించి 2013లో 'హోంబలే ఫిల్మ్స్'ను ప్రారంభించారు. దీనికి కిరంగదూర్, చలువే గౌడ అధినేతలుకాగా కార్తిక్ గౌడ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహిస్తున్నారు. తమ ఇలవేల్పు హోంబలమ్మ కావడంతో నిర్మాణ సంస్థకు 'హోంబలే ఫిల్మ్స్' అని నామకరణం చేశారు.
తొలి ప్రయత్నం విఫలం..సినిమాలు నిర్మించేందుకు కావాల్సిన డబ్బు, ఆసక్తి ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో విజయం దక్కుతుందా? చిత్రాల నిర్మాణంపై పెద్దగా అవగాహన లేకపోవడంతో తొలి ప్రయత్నంలో పరాజయం అందుకున్నారు ఈ నిర్మాతలు. కొత్త దర్శక, నిర్మాతలకు ప్రోత్సాహాన్ని ఇచ్చే పునీత్ రాజ్‌కుమార్‌తో వారు 'నిన్నిందలే' అనే సినిమాను నిర్మించారు. 2014లో విడుదలైన ఆ సినిమా ప్రొడ్యూసర్లకు నష్టాన్ని మిగిల్చింది.
ఇతర వృత్తుల్లో ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును చిత్ర పరిశ్రమలో పోగొట్టుకున్నట్టైంది. అయినా వారు వెనకడుగేయలేదు. 'నిర్మాత అంటే డబ్బు ఖర్చు పెట్టడమే కాదు కథను జడ్జ్ చేయాలి' అనే ధోరణిలో ఏడాది తిరిగేలోపు 'మాస్టర్‌పీస్' అనే చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. యశ్‌తో వారి ప్రయాణం ఈ చిత్రంలోనే మొదలైంది. ఈ సినిమా 2015లో రిలీజై 'హోంబలే' పేరును ఎక్కువ మందికి తెలిసేలా చేసింది. ఈ చిత్రం వసూళ్లు సుమారు రూ. 35 కోట్లు.
పునీత్‌తో మరోసారి..పునీత్ రాజ్‌కుమార్‌తో తమ తొలి ప్రయత్నం విఫలమైనా 'హోంబలే' నిర్మాతలు మరోసారి ఆయనతోనే సినిమా చేశారు. అదే 'రాజకుమార'. 2017 మార్చిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం అందుకుంది. కన్నడ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు (సుమారు రూ. 76 కోట్లు: గ్రాస్) రాబట్టిన ఆరో చిత్రంగా నిలిచింది. మల్టీప్లెక్స్‌ల్లో ఆరు వారాల్లో 6000 షోస్ ప్రదర్శితమైన తొలి కన్నడ చిత్రంగా రికార్డు సృష్టించింది.
సంచలనానికి నాంది..తొలి సినిమా రొమాంటిక్ కామెడీ డ్రామా, రెండు, మూడు చిత్రాలు యాక్షన్ డ్రామాలు... ఇవి నేర్పిన పాఠాలతో నిర్మాతలు ‘కేజీయఫ్ చాప్టర్ 1’ అనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాంతీయ సినిమాగా రూపొంది, ఇతర భాషల్లోకి డబ్ అయి అన్ని చోట్లా శాండిల్‌వుడ్ సత్తా చాటింది. రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ 'కోలార్ గోల్డ్ ఫీల్డ్స్' కథ దాదాపు రూ. 250 కోట్లు కలెక్ట్ చేసింది.