కర్ణాటకలోని బళ్లారిలో సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీ.. తిరిగి వెళ్తుండగా శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే?
బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో శనివారం బళ్లారి ఫెస్టివల్ అట్టహాసంగా మెుదలైంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటి రోజు ఉత్సవంలో సింగర్ మంగ్లీ, కొంతమంది గాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ మంగ్లీ స్టేజ్ మీద పాటలు పాడింది. తిరిగి వెళ్లేటప్పుడు ఆమెను చూసేందుకు యువకులు ఎగబడ్డారు. వేదిక వెనుక ఉన్న మేకప్ టెంట్ లోపలికి కూడా ప్రవేశించారు. వెంటనే పోలీసులు ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత మంగ్లీ వెళ్లేటప్పుడు కొంతమంది యువకులు ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారు.