Sri Simha Koduri Latest Interview : ఇటీవలే విడుదలైన 'భాగ్ సాలే' సినిమాతో ఆడియెన్స్‌ను పలకరించారు యంగ్ హీరోశ్రీసింహా. 'మత్తువదలరా', 'తెల్లవారితే గురువారం', 'దొంగలున్నారు జాగ్రత్త' లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ స్టార్ ఇప్పుడు 'ఉస్తాద్'గా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్లో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు తన మాటల్లోనే..
- 'మత్తువదలరా' సినిమా తర్వాత విన్న కథ ఇది. గతేడాది షూటింగ్ ప్రారంభించాం. అయితే మధ్యలో 'భాగ్ సాలే' సినిమా షూటింగ్ కాస్త లేట్ అయ్యింది. అందుకే ఇప్పుడు ఈ రెండు సినిమాలు వెనువెంటనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి వచ్చింది. మంచి స్టోరీతో వస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం. అందుకే రెండు పెద్ద చిత్రాల మధ్య థియేటర్లలోకి వస్తున్నాం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరుస సెలవులు వస్తుండటం కూడా మాకు కలిసి వస్తుందని అనిపిస్తోంది.
- సూర్య అనే ఓ కుర్రాడి జీవితం చుట్టూ తిరిగే కథ ఇది. ఈ స్టోరీ మూడు దశల్లో కనిపిస్తుంది. ఇందులో నటనకు ఎంతో ఆస్కారముంది. ఎమోషనల్గానూ అనిపిస్తుంది. నేనిప్పటి వరకు చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది.
- ఇందులో నా పాత్ర భావోద్వేగాలన్నీ ఓ బైక్‌తో ముడిపడి ఉంటాయి. అది ఎన్నో మరచిపోలేని జ్ఞాపకాల్ని అందిస్తుంది. ఆ బండి ద్వారానే జీవితమంటే ఏంటో తెలుస్తుంది. పైలట్ అవ్వాలన్న నా లక్ష్యాన్ని చేరుకోగలుగుతా. అందుకే ఆ బైక్‌ను గురువుగా భావించి.. దానికి ఉస్తాద్ అనే పేరు పెట్టుకుంటాను. దీని ఆధారంగానే ఈ మూవీ టైటిల్‌ను ఖరారు చేశాం.
- Sri Simha Role in Ustaad Movie : ఈ సినిమాలో నా రోల్‌ను మూడు కోణాల్లో ఆవిష్కరించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఓ కాలేజీ కుర్రాడిలా చిన్నగా కనిపించడం కోసం కఠిన కసరత్తులు చేసి మరీ బరువు తగ్గాల్సి వచ్చింది. ఇక చదువు పూర్తయ్యాక నడిచే దశలో హీరోయిన్‌కు నాకు మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది. ఆ పాత్ర కోసం బాగా గడ్డం పెంచాను. మూడో దశలో పైలట్‌గా కనిపిస్తాను. ఇందులో గౌతమ్ మేనన్ నాకు సీనియర్ పైలట్‌గా కనిపిస్తారు. మా ఇద్దరికీ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి.
- నా సినిమాల విషయంలో తొలి క్రిటిక్స్ మా ఫ్యామిలీ మెంబర్స్. బాబాయ్ రాజమౌళి కానీ, నాన్న కీరవాణి గానీ ప్రతి ఒక్కరూ సినిమా చూశాక అందులోని తప్పు.. ఒప్పుల్ని విశ్లేషించి నాకు చెబుతారు. నేనిప్పటి వరకు కథా బలమున్న చిత్రాలే చేస్తూ వచ్చాను. 'ఉస్తాద్' ఫలితాన్ని బట్టే తదుపరి సినిమాల్ని నిర్ణయిస్తాను.
- SSMB 29 Update : 'మత్తువదలరా'కు సీక్వెల్ చేయాలని ఉంది. కానీ, అదెప్పుడు కుదురుతుందో తెలియదు. ఇక మహేశ్ బాబు - రాజమౌళి కలయికలో తెరకెక్కనున్న సినిమా అన్ని మార్కెట్లను టచ్ చేసేలా ఉంటుంది. ప్రస్తుతం కథ సిద్ధమవుతోంది.