Sree Vishnu Bhala thandhanana movie review: నటీనటులు: శ్రీవిష్ణు, కేథరిన్, గరుడ రామ్, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస్‌రెడ్డి, సత్య తదితరులు; సంగీతం: మణి శర్మ; సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతు; ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్; కథ, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా; నిర్మాత: రజని కొర్రపాటి;బ్యానర్: వారాహి చలన చిత్రమ్; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చైతన్య దంతులూరి; విడుదల:06-05-2022
పరాజయాలు ఎదురైనా కొత్త రకమైన కథలతోనే సినిమాలు చేస్తున్న కథానాయకుడు శ్రీవిష్ణు. అందుకే ఆయన సినిమాపై కథల పరంగా ప్రత్యేకమైన అంచనాలు ప్రేక్షకుల్లో కనిపిస్తుంటాయి. ఈసారి ‘భళా తందనాన’ అంటూ ‘బాణం’ దర్శకుడు చైతన్య దంతులూరితో కలిసి సినిమా చేశారు. ఈ కలయికతోపాటు... ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహిచలన చిత్రంలో రూపొందడంతో సినిమా విడుదలకి ముందే ఆసక్తిని రేకెత్తించింది. మరి అందుకు తగ్గట్టుగా ఉందా? శ్రీవిష్ణు సారి ఎలాంటి పాత్ర చేశారు?
కథేంటంటే: చందు అలియాస్ చంద్రశేఖర్ (శ్రీవిష్ణు) ఓ అనాథాశ్రమంలో అకౌంటెంట్. అనుకోకుండా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన శశిరేఖ (కేథరిన్)ని కలుస్తాడు. ఇద్దరూ దగ్గరయ్యే క్రమంలోనే కొన్ని వరుస హత్యలు జరుగుతాయి. దాని వెనక హవాలా కింగ్ ఆనంద్ బాలి (రామచంద్రరాజు) ఉన్నాడని తెలుస్తుంది. హత్యకి గురవుతున్న వ్యక్తుల్ని తాను చూశానని కూడా చెబుతాడు చందు. ఆ హత్యోదంతాల్ని పరిశోధించే క్రమంలో శశిరేఖకి ఎలాంటి విషయాలు తెలిశాయి? హవాలా కింగ్ దగ్గరున్న రూ.2 వేల కోట్ల డబ్బు దొంగతనం చందు మెడకి చుట్టుకున్నాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?ఇంతకీ ఆ రూ.2 వేల కోట్లతో అతనికి సంబంధం ఉందా లేదా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందిన చిత్రమిది. ఈ కథకి హాస్యంతో పాటు, ప్రేమని కూడా జోడించారు. ఆరంభ సన్నివేశాలు నాయకా నాయికల పాత్రల్ని, వారి ప్రపంచాల్ని పరిచయం చేస్తూ సాగుతాయి. అలా కథలోకి వెళ్లడానికి ఎక్కువ సమయమే తీసుకున్నాడు దర్శకుడు. రాజమండ్రి, కాకినాడ మధ్య ముల్లంగి అంటూ కథానాయకుడు తన ఫెయిల్యూర్ ప్రేమకథని చెప్పినా అదంతా కాసిన్ని నవ్వులు పంచడానికే. కథ వేగం పుంజుకునేది మాత్రం వరుస హత్యల తర్వాతే. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు, అక్కడ మలుపులు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ద్వితీయార్ధంలోనే అసలు కథ మొదలవుతుంది.
తన రూపాయి కోసం లక్ష రూపాయలైనా ఖర్చు పెట్టే ప్రతినాయకుడు కథలోకి ఎంట్రీ ఇవ్వడంతో పోరాటం రక్తి కడుతుంది. 25 చోట్ల ఉండే హవాలా డబ్బుని ఒక చోటకి చేరేలా చేయడం, అక్కడ్నుంచి దాన్ని మాయం చేయడం వంటి సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. విభిన్నమైన కథ, దానికి తగినట్టుగా మలుపులతో కూడిన కథనమే కుదిరింది. కానీ, నేర నేపథ్యంతోపాటు, థ్రిల్లర్ అంశాలకి చోటున్న ఈ కథని ఇంటెన్స్‌గా తీయకుండా... అందులోకి హాస్యం, ప్రేమ, పాటల్ని జోడించడంతో కథలో బిగి తగ్గినట్టు అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. అడుగడుగునా ఉత్కంఠ రేకెత్తించే ప్రత్యేకమైన కథ, కథనాలున్నప్పటికీ సగటు సినిమా అనిపిస్తుంది. అసలు కథానాయకుడి గతం ఏమిటి?డబ్బు ఎక్కడుంది? అనే అంశాల్ని దాచేస్తూ రెండో భాగం కూడా ఉందంటూ కథని ముగించారు దర్శకుడు. అక్కడక్కడా నిదానంగా సాగే సన్నివేశాల్ని భరిస్తే కాలక్షేపానికి మాత్రం ఢోకా ఉండదు.
ఎవరెలా చేశారంటే: శ్రీవిష్ణు తన పాత్రలో ఒదిగిపోయారు. ప్రథమార్ధంలో అమాయకమైన యువకుడిగా కనిపించిన తీరు మెప్పిస్తుంది. ద్వితీయార్ధంలో ఆయన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ నటించిన తీరు రక్తి కట్టిస్తుంది. కేథరిన్ బొద్దుగా కనిపించినా జర్నలిస్ట్‌గా చక్కటి అభినయం ప్రదర్శించింది. మీ తెలుగు ఇంగ్లిష్‌లా ఉంటుందని సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్‌కి న్యాయం చేకూరుస్తూ తెలుగుని ఇంగ్లిష్‌లా పలుకుతూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది కేథరిన్. రామచంద్రరాజు, పోసాని కృష్ణమురళి ప్రతినాయక పాత్రల్లో నటించిన తీరు మెప్పిస్తుంది. సత్య ప్రథమార్ధంలో నవ్విస్తాడు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. మణిశర్మ సంగీతం, సురేష్ రగుతు కెమెరా పనితనం మెప్పిస్తుంది. ‘బాణం’లాంటి ఇంటెన్సిటీ ఉన్న సినిమాని తీర్చిదిద్దిన దర్శకుడు తన శైలికి భిన్నంగా అన్ని అంశాల్ని జోడించి తీశారు.
బలాలు
+కథ, కథనం