తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ మూవీతో జెట్​స్పీడ్​లా దూసుకుపోయిన ఎన్టీఆర్! - raghavendra rao ntr movies

ఎన్టీఆర్​.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయనోక దిక్సూచి. 'నందమూరి తారకరామారావు' అనే పేరు లేకుండా.. తెలుగు సినిమాను ఊహించుకోవడం కష్టం. అంతటి మహానటుడు కూడా సినిమా పరిశ్రమలో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారని తెలుసా? షూటింగ్స్​​ లేకుండా.. మేకప్​ వేసుకోకుండా.. ఆయన కొంతకాలం ఖాళీగా ఇంట్లో కూర్చున్నారన్న విషయ చాలా మందికి తెలిసి ఉండదు. ఇంతకీ ఆయన ఎదుర్కొన్ని ఇబ్బందులు ఏంటి? ఏ సినిమాతో ఆయన కెరీర్​ జెట్​ స్పీడుతో దూసుకెళ్లిందో తెలుసుకుందామా?

ntr
ఎన్టీఆర్

By

Published : May 28, 2022, 10:31 AM IST

నందమూరి తారకరామారావు.. తెలుగు తెరకు ఆయనే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి. సినిమాల్లో ఆయన పోషించని పాత్ర లేదు. ఏడాదికి వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి.. కార్మికుల కడుపు నింపేందుకు కృషి చేశారు. నిత్యం సినిమా కోసం జీవించి.. సినిమా కోసం శ్వాసించి.. సినిమా కోసం పరితపించిన ఎన్టీఆర్​.. తన నట ప్రస్థానంలో ఒకానొక దశలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు.

70వ దశకంలో కృష్ణ, శోభన్​బాబు, కృష్టంరాజు లాంటి కొత్త తరం హీరోలు దూసుకుపోతున్న నేపథ్యంలో.. అప్పటికే స్టార్​ హీరోలైన ఎన్టీఆర్​- ఏఎన్​ఆర్ దగ్గరికి కథలు రావడం తగ్గాయి. దీంతో సినిమాలను తగ్గించేశారు ఎన్టీఆర్​. కథలు చెప్పడానికి కొందరు వచ్చినా.. అవి నచ్చేవి కావు. దీంతో మంచి కథలే చేయాలని నిర్ణయించుకున్నారట. ఆయన అప్పటికే 200 చిత్రాలు పూర్తి చేశారు.

బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్​

ఈ క్రమంలో అప్పటివరకు ఏడాదికి ఏడు నుంచి పది సినిమాలు చేసే ఆయన.. షూటింగ్​లు లేక.. మేకప్​ వేసుకోకుండా ఇంట్లోనే ఉన్నారట. ఎప్పుడూ సినిమా షూటింగ్స్​తో.. మేకప్​తో కనిపించే ఎన్టీఆర్​ను అలా చూసి.. ఆయన తమ్ముడు త్రివిక్రమరావు బాధపడేవారట. అయితే ఎన్టీఆర్​ మాత్రం తన తమ్ముడికి నచ్చజెప్పేవారట. 'మన టైమ్​ వస్తే ఎవరూ ఆపలేరు' అని త్రివిక్రమరావుతో ఎన్టీఆర్​ అన్నారట.

అలా ఖాళీగా ఇంట్లో కూర్చున్న సమయంలో దాసరి నారాయణరావు 'తాతా మనవడు' సినిమాలో ఎస్వీ రంగారావు పాత్ర కోసం ఎన్టీఆర్​ను సంప్రదించారు. అయితే ఆ పాత్రను 'నేను చేయను. హీరో పాత్రనే చేస్తాను. ఇందులో హీరో కమెడియన్​. అందుకే నేను చేయను' అని ఎన్టీఆర్​ చేప్పారు. దీంతో దాసరి తిరిగి వెళ్లిపోయారు.

అయితే కొద్దిరోజులకే పీసీ రెడ్డి.. 'బడి పంతులు' కథతో ఎన్టీఆర్​ వద్దకు వచ్చారు. ఇందులో హీరో పాత్ర కావడం.. కథ కూడా నచ్చడం వల్ల ఈ సినిమా చేసేందుకు ఆయన ఒప్పుకున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో ఫిల్మ్​ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు ఎన్టీఆర్​. ఈ వ్యవహారం అంతా 1972-73 సంధికాలంలో జరిగింది. ఆ సినిమా తర్వాత ఆయన కెరీర్​ గాడిన పడ్డదనే చెప్పుకోవాలి.

ఆ సమయంలోనే ఎన్టీఆర్​ సినీ జీవితంలోకి ప్రవేశించారు అప్పటి యువ దర్శకులు దాసరి, రాఘవేంద్రరావు. 1976లో దాసరి ఎన్టీఆర్​తో హిట్​ మూవీ 'మనుషులంతా ఒక్కటే' చేస్తే.. 1977లో రాఘవేంద్రరావు సెన్సెషనల్​ హిట్​ అడవిరాముడు తీశారు. ఆ తర్వాత ఇద్దరితో వరుసపెట్టి సినిమాలు తీశారు ఎన్టీఆర్​. అన్ని సినిమాలు బ్లాక్​ బస్టర్లు, సిల్వర్​ జూబ్లీలే. ఆ సినిమాలు ఎన్టీఆర్​ను ఎదురులేని, తిరుగులేని హీరోగా నిలబెట్టాయి.

ఇదీ చదవండి: ఆ సీన్​ కోసం కోర్టులో మూడేళ్ల పాటు పోరాడిన ఎన్టీఆర్!

ABOUT THE AUTHOR

...view details