SPY Movie Telugu : కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు సంపాదించారు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ. ఇప్పుడు మరో అడ్వెంచర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఎడిటర్ గ్యారీ బీహెచ్ కాంబోలో 'స్పై' సినిమాలో నటించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మేనన్ కథానాయికగా నటించింది. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం జూన్ 29న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్.. దిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద సోమవారం విడుదల చేసింది.
ఈ 'స్పై' చిత్రాన్ని ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై.. చరణ్ తేజ్ ఉప్పలపాటి సమర్పణలో కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి కథ కూడా ఈ సినిమా నిర్మాత అందించడం గమనార్హం. ఈ సినిమాలో ఆర్యన్ రాజేశ్, మకరంద్ దేశ్‌పాండే, సన్యా ఠాకూర్, రాబర్ట్ లానెన్, దయానంద్ రెడ్డి, నితిన్ మెహతా, అభినవ్ గోమటం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాలు సంగీతం సమకూరుస్తున్నారు. అనిరుధ్ కృష్ణమూర్తి మాటలు రాశారు. ఇక ఈ మూవీకి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్లు లీ విటేకర్, రాబర్ట్ లిన్నెన్ యాక్షన్ యాక్షన్స్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. వీరితోపాటు బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కెయికో నకహారా (Keiko Nakahara), హాలీవుడ్ డీఓపీ జూలియన్ అమరు ఎస్ట్రాడా (Julian Amaru Estrada) ఈ సినిమాకు పనిచేస్తున్నారు.