తెర మీద నన్ను చూసిన చాలామంది "మీరు బయట కూడా సీరియస్‌గానే ఉంటారా.." అని అడుగుతుంటారు. నిజానికి నేను చాలా సరదా మనిషిని. కానీ, నేను చేసే విలన్ పాత్రల వల్ల అందరూ సీరియస్ పర్సన్‌ని అనుకుంటున్నారు. ఆన్‌స్క్రీన్ వరలక్ష్మి గురించి తెలిసిన మీకు.. తెర వెనక వరూ ఎలా ఉంటుందో చెబుతా..
పుట్టి పెరిగింది చెన్నైలోనే. నాకు ఊహ తెలిసేప్పటికే అమ్మానాన్నలు విడిపోయారు. మా అమ్మ ఛాయ.. అవమానాలూ, ఆర్థిక సమస్యలూ ఎదుర్కొంటూనే నన్నూ, చెల్లినీ పెంచింది. అయినా ఎప్పుడూ భయపడలేదు, బాధపడలేదు. మాకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ఆశపడేది. కొన్నాళ్లకు ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థను ప్రారంభించి మంచి పేరు తెచ్చుకుంది. పైగా మగవారితో పనిచేయించడం, గంటలు గంటలు తానూ కష్టపడటం నాకు ఎంతో అబ్బురంగా అనిపించేది. అయితే తనకి మేం సినిమాలు చూడటం ఇష్టముండేది కాదు.
పదమూడు, పద్నాలుగేళ్లు వచ్చే వరకూ కార్టూన్ షోలకే అనుమతిచ్చేది. నాన్న సినిమాలు కూడా నేను ఓ పదికి మించి చూడలేదు. అయితే సినిమా ప్రపంచానికి దూరంగా పెరిగిన నాకు డాన్స్ అంటే పిచ్చి అనే చెప్పాలి. అమ్మ భరతనాట్యం నేర్పించింది. నా ఆసక్తి కొద్దీ బాలే, వాల్ట్, సల్సా, హిప్‌హాప్ వంటివన్నీ నేర్చుకున్నా. బాలే, సల్సాల్లో గోల్డ్ మెడల్ కూడా అందుకున్నా.
కాలేజీకి వెళ్లాక రంగస్థలం వైపు మనసు మళ్లింది. చదువుకంటే నాటకాలకే ప్రాధాన్యమిచ్చేదాన్ని. అలా డిగ్రీ పూర్తి చేశాక ఎంబీఏ చదవడానికి స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర యూనివర్సిటీకి వెళ్లా. అక్కడ చదువుకుంటున్నప్పుడే ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగమొచ్చింది. ఇక అదే నా భవిష్యత్తు అని ఫిక్సైపోయా. తీరా చదువు పూర్తై ఉద్యోగంలో చేరదామనుకునేటప్పుడు... "నువ్వు దూరంగా ఉండటం నాకు నచ్చట్లేదు. చదువు కోసం తప్పలేదు కానీ, నా దగ్గరే ఉండి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు. ఇండియాకి వచ్చెయ్" అంది అమ్మ. అయిష్టంగానే ఇంటికొచ్చా. కొన్నాళ్లు అమ్మ నడిపే ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థలోనే పనిచేశా. అప్పుడే అనిపించింది ఇలాంటి ఉద్యోగాలు మన వల్ల కాదనీ, అందుకు నేను సెట్‌కాననీ. క్రమంగా నేనేం చేయగలనూ, ఏ రంగం నాకు బాగుంటుందీ అని ఆలోచించడం మొదలుపెట్టా. చివరికి నాకు డాన్స్ పట్ల అంతర్లీనంగా ఉన్న ఇష్టం నన్ను సినిమాల వైపు వెళ్లేలా చేసింది. నాకో స్పష్టత తెచ్చి పెట్టింది.
నాన్న నో అన్నారు
టీనేజీకొచ్చాక అమ్మానాన్నలు ఎందుకు విడిపోయారో అర్థమైంది. వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాలని నేనూ, చెల్లీ అనుకున్నాం. అమ్మతోపాటు నాన్ననీ అర్థం చేసుకోవడం మొదలుపెట్టాం. అందుకే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాక మొదట నాన్నకే చెప్పా. కానీ, ఆయన వద్దన్నారు. కాదు.. కాదు.. భయపడ్డారు. సినీరంగంలోని ఒడుదొడుకుల్ని తట్టుకునే శక్తి నాకుందో లేదోనని తండ్రిగా ఆయన ఆలోచించారు. అమ్మ నా ఇష్టాన్ని కాదనలేదు. నాన్న ఒప్పుకోవట్లేదని తనతో చెబితే వెంటనే నటి రాధిక ఆంటీకి ఫోన్ చేసి విషయం చెప్పింది.
నాన్న రాధిక ఆంటీని పెళ్లి చేసుకున్నాక అమ్మ తనతో మొదటిసారి మాట్లాడటం అప్పుడే. "వరూ కోరుకుంటే మనం తనని ప్రోత్సహించాల్సిందే. మీ ఇద్దరూ బయల్దేరి రండి... ఆయనతో మాట్లాడదాం" అని ఆంటీ అనడంతో షూటింగ్‌లో ఉన్న నాన్న దగ్గరకు ముగ్గురం వెళ్లాం. మా ముగ్గుర్నీ చూసిన నాన్న షాక్ అయ్యారు. అమ్మా, ఆంటీ ఒక్కటైపోయి నాన్నని ఒప్పించి ఆయన భయాలన్నీ పోగొట్టారు. "ఆడవాళ్లంతా ఒక్కటయ్యాక నేను మాత్రం నో ఎలా చెప్పగలను" అంటూ నాన్న కూడా నేను సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నారు. ముంబయి వెళ్లి అనుపమ్‌ఖేర్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణకు చేరా.
కొన్నిరోజుల తరవాత ఆయన మా నాన్నకు ఫోన్ చేసి "మీ అమ్మాయి అద్భుతంగా నటిస్తుంది. నాకు తన భవిష్యత్తు కనిపిస్తోంది. మీరూ ప్రోత్సహించండి" అని చెప్పారు. ఆ మాటలకు నాన్నకు సంతోషం కలిగింది. నాలోనేమో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదిలా ఉంటే... ఫేస్‌బుక్‌లో నా ఫొటోని ముంబయిలోని ఓ నిర్మాత భార్య చూశారట. వాళ్లకి తెలిసినవాళ్లు తమిళంలో సినిమా తీస్తున్నారని ఆమె నన్ను సంప్రదించారు. అలా నాకు 2012లో 'పోడా పోడి' అనే సినిమాలో మొదటి అవకాశం వచ్చింది. నన్ను నేను తెరపైన చూసుకున్నాక నటిగా నేను పనికొస్తాను అనే ధైర్యం కలిగింది. కథ వినడం, నా పాత్ర ఏంటో తెలుసుకోవడం వంద శాతం అందుకు తగ్గట్టు నటించడం... మొదలుపెట్టా. కానీ, దాదాపు నాలుగేళ్ల పాటు సరైన అవకాశాలు రాలేదు. అలాగని నాన్న రికమండేషన్లు కూడా నాకు నచ్చవు.
2016లో అనుకుంటా, మలయాళంలో 'కసబా' అనే సినిమాలో నెగెటివ్ రోల్ చేశా. ఒకరకంగా అది సాహసమే. హీరోయిన్‌గా చేస్తూ నెగెటివ్ పాత్ర ఒప్పుకోవడం వల్ల కెరీర్‌కి నష్టం జరుగుతుందేమోనని చాలామంది అనుకున్నారు. కానీ, నేను నా నటనని నమ్ముకున్నా. హీరోయిన్ అవ్వాలి, స్టార్‌డమ్ రావాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఛాలెంజింగ్‌గా, నటిగా సంతృప్తి కలిగించే ఏ పాత్ర అయినా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నా. ఆ సినిమా విడుదలయ్యాక దాదాపు అటువంటి పాత్రలే వరస కట్టాయి. తెలుగులో 'పందెం కోడి2' నా మొదటి సినిమా, ఆ తరవాత 'సర్కార్'లో కోమలవల్లి పాత్ర కూడా బాగా పేరు తెచ్చిపెట్టింది. 'మారి2'లోనూ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
అందుకు ఒప్పుకోలేదు
2019లో వచ్చిన 'తెనాలి రామకృష్ణ' నేను నేరుగా తెలుగులో నటించిన సినిమా. అల్లరి నరేశ్ 'నాంది'లో మాత్రం పాజిటివ్ పాత్ర. లాయర్ ఆద్యగా నేను చేసిన ఆ పాత్ర ఎప్పటికీ నా ఫేవరెట్. నేను చాలా బాగా నటించానని ఫీలైన సినిమా అదే. అంతేకాదు, ఈ సినిమాలో నాకు మరో అనుభవం కూడా ఉంది. సాధారణంగా నా సినిమాలకు నేను డబ్బింగ్ చెప్పుకుంటా. నా హావభావాలకు మరొకరి గొంతును జత చేయడం నచ్చదు. పైగా నేను సినిమా రంగంలోకి వచ్చిన కొత్తల్లో చాలామంది "నీది మగాడి గొంతులా ఉంది" అన్నారు. మరికొందరేమో అసలు హీరోయిన్‌కి ఉండాల్సిన వాయిస్ కాదన్నారు. అందుకే నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నా.