ఆస్కార్... ప్రపంచంలోని ప్రతి సినిమా నటుడు, సాంకేతిక నిపుణుడు అందుకోవాలని చూసే పురస్కారం. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును ముద్దాడాలనుకునే నటులుండరంటే అతిశయోక్తి కాదు. అయితే 95వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆస్కార్ వేడుకకు ఘన చరిత్ర ఉన్నట్టే.. ఆస్కార్ పురస్కార ప్రతిమకూ ఓ చరిత్ర ఉంది. ఈ ఏడాది మార్చి 12న ఆస్కార్ వేడుక అట్టహాసంగా జరగనుంది. అందుకు సంబంధించి నామినేట్ అయినా వాటిని మరికొద్దిసేపట్లో కాలిఫోర్నియాలో ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డ్ గురించి కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం.
హాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులతో కూడిన 5 విభాగాలతో 1927లో 'ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ' ఏర్పడింది. అదే 1929 నుంచి చలన చిత్ర రంగంలో విశేష ప్రతిభ చూపిన వారికి 'అకాడమీ ఆవార్డ్ ఆఫ్ మెరిట్' పేరిట పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత, వీటిని ఆస్కార్ పురస్కారాలుగా పిలవడం మొదలైంది. ఆస్కార్ పేరు ఎలా వచ్చిందో తెలుసుకునేముందు ఆ అవార్డు ఎలా రూపొందిందో చూద్దాం..
ఆస్కార్ అవార్డును ఎవరు సృష్టించారు?
ఆస్కార్ ప్రతిమ.. కాంతులీనే పసిడి వర్ణంతో, ఓ యోధుడు రెండు చేతులతో వీర ఖడ్గం చేతపట్టి ఫిల్మ్ రీలుపై ఠీవీగా నిల్చొన్నట్టు కనిపిస్తుంది. ఈ రూపును ఎంజీఎం స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్ సృష్టించారు.
ఆ ఐదు చువ్వలు దేనికి సూచికలు?
ఆస్కార్ ప్రతిమ కింది భాగంలోని రీలు చుట్టులో 5 చువ్వలుంటాయి. అకాడమీలోని 5 విభాగాలకు అవి సూచికలు. ఎమిలో ఫెర్నాండెజ్ అనే నటుడిని నగ్నంగా నిలబెట్టి అతడి ఆకారం నుంచి స్ఫూర్తిపొంది.. గిబ్బన్స్ ఈ ప్రతిమను రూపొందించాడట. అందుకే ఆస్కార్ ప్రతిమ నగ్నంగా కనిపిస్తుంది.