తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆయన ఇచ్చిన మంత్రోపదేశమే ఎస్పీబీ టర్నింగ్ పాయింట్.. అందుకే NTR, ANR టు చిరు, బాలయ్య క్యూ కట్టేవారు - balasubramaniam first song

SPB Death Anniversary : ఎస్​పీ బాలసుబ్రహ్మణ్యం.. పేరు తెలియని వారుండరు. కేవలం తెలుగు వారికి మాత్రమే కాదు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ సహా ఉత్తరాది ప్రజలకూ ఈయన పేరు సుపరిచితమే. ఎందుకంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా 16 భారతీయ భాషల్లో రికార్డు స్థాయిలో 40 వేలకు పైగా పాటలు పాడి తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటారు. అయితే సోమవారం ఎస్పీబీ బాలు 3వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన పలు విశేషాలు మీకోసం.

SPB Death Anniversary
SPB Death Anniversary

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 5:27 AM IST

Updated : Sep 25, 2023, 6:21 AM IST

SPB Death Anniversary :5 దశాబ్దాలకు పైగా ప్రతి ఒక్కరినీ ఏదో ఒక గానంతో రంజింప జేసింది ఆ గొంతు. 1964లో తన విద్యార్థి దశలో రెండోసారి ఒక సంగీత సాంస్కృతిక సంస్థ నిర్వహించిన పాటల పోటీల్లో పాల్గొన్న ఆయనకు ప్రథమ బహుమతి వరించింది. అలా కొందరు దిగ్గజ గాయకుల ప్రోత్సాహం, సహకారంతో పాటల లోకంలోకి ప్రవేశించారాయన. 1966 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' సినిమాలోని 'ఏమి ఈ వింత మోహం' అనే సూపర్​ డూపర్​ హిట్​ పాటతో ఆయణ్ను సినీలోకానికి పరిచయం చేశారు కోదండపాణి. ఆయనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. నేడు(సెప్టెంబర్​ 25) సోమవారం ఆయన 3వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించి కొన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం.

బాలు బాల్యం భళా!

  • ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.
  • ఈయన 1946 జూన్​ 4న ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లాలోని కోణేటంపేటలో జన్మించారు.
  • తల్లిదండ్రులు.. శకుంతలమ్మ, సాంబమూర్తి. తండ్రి సాంబమూర్తి హరికథా కళాకారుడు, రంగస్థల నటుడు.
  • ఎస్వీ ఆర్ట్స్​ కళాశాలలో పీయూసీ చదువును పూర్తి చేసిన బాలు.. తండ్రి నుంచే సంగీతంలో మెళకువలను నేర్చుకున్నారు.
  • విద్యార్థి దశలోనే బహుముఖ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించారు బాలు.
  • 1962లో గూడురులోని కాళిదాసు కాళానికేతన్​ పాటల పోటీల్లో పాల్గొని ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు.

సోలో సాంగ్​ అనుకున్నారు.. కానీ!
'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' సినిమాలోని 'ఏమి ఈ వింత మోహం' పాటతో సినిమాలో తొలిసారి పాట పాడే అవకాశాన్ని దిగ్గజ గాయకుడు కోదండపాణి ద్వారా దక్కించుకున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఈ పాటను కోదండపాణి వారం రోజులపాటు బాలుతో సాధన చేయించారట. అయితే బాలు పాడిన తొలిపాట ముందుగా సోలో సాంగ్​ అనుకున్నారంతా. కానీ, చివరకు అది గ్రూప్​ సాంగ్​ అని తెలిసింది. అలా పీ.సుశీల, కల్యాణం రఘురామయ్య, పీ.బీ. శ్రీనివాస్​లతో కలిసి బాలు తన గాత్రాన్ని తొలిసారి వెండితెర వేదికపై వినిపించారు. ఈ పాటను 1966 డిసెంబర్​ 15న విజయా గార్డెన్స్​లో స్వామినాథన్​ ఆధ్వర్యంలో రికార్డు చేశారు. పాట మొదటి టేక్​లోనే ఓకే కావడం విశేషం.

అక్కడి నుంచి గిన్నీస్​ రికార్డు దాకా!..1962 జూన్ 2న విడుదలైన బాలు పాడిన తొలిపాట 'ఏమి ఈ వింత మోహం'తో చలనచిత్ర సంగీత ప్రపంచంలో గానగంధర్వుడు బాలు ప్రభంజనానికి తెరలేచింది. తనకు తొలి అవకాశం ఇచ్చిన కోదండపాణి గారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని ఎస్పీ బాలు గారు ఎప్పుడూ చెప్తుండేవారు. ఎందుకంటే గాయకుడిగా తన భవిష్యత్తు మీద అంత నమ్మకం ఉంచారాయన. తన మొదటి పాట టేప్​ రికార్డును చెరిపేయకుండా సంవత్సరంపాటు అలాగే విజయా గార్డెన్స్​లోనే ఉంచేలా చేశారట కోదండపాణి. అలా ఆ స్టూడియోకు వచ్చిన ప్రతి సంగీత దర్శకుడికి బాలు పాడిన ఫస్ట్ సాంగ్​ను వినిపించి తనకు అవకాశాలు ఇమ్మని కోరేవారట. ఇలా బాలు గారికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా మొదలైన బాలు పాటల ప్రయాణం వందలు.. వేలు దాటి మొత్తం 16 భారతీయ భాషల్లో 40 వేలకుపైగా పాటలు పాడి గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​ను సొంతం చేసుకున్నారు.

మరిన్ని విశేషాలు..

  • లిపి లేని భాషలు కొంకణి, తులులోనూ పాటలు పాడిన బాలు.
  • హిందీలో 'ఏక్​దుజే కేలియే' పాటతో ఉత్తరాది ప్రేక్షకుల మనస్సులను దోచేశారు బాలు.
  • బాలీవుడ్​లో పలు సూపర్​ హిట్​ చిత్రాలకు స్వరాలు అందించారు బాలు.
  • 'మైనే ప్యార్​ కియా', 'హమ్​ ఆప్​కే హై కౌన్​', 'సాజన్​' వంటి బ్లాక్​బస్టర్​ చిత్రాల్లోనూ బాలు స్వరం.
  • తమిళ సినిమా 'కేలడి కన్మణి'లో 26 సెకన్ల పాటు ఏకబిగిన పాట పాడి సంచలనం సృష్టించారు బాలు.
  • 'ఓ పాప లాలీ' పాటతో తెలుగులోనూ గుక్క తిప్పుకోకుండా పాటను ఆలపించారు బాలు.

ఆయన మాటలే స్ఫూర్తి!

"అవకాశాలు మన దగ్గరకు రావు, వాటిని నీవే సృష్టించుకోవాలి, అప్పుడే నీవు నిలదొక్కుకోగలవు" అని సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు చేసిన మంత్రోపదేశం బాలసుబ్రహ్మణ్యం భవిష్యత్తును దివ్యంగా తీర్చిదిద్దింది. ఆయన మాటలనే వేదవాక్కులుగా భావించిన ఎస్​పీ బాలు దీనిని తూచాతప్పకుండా పాటించారు. అలా హీరో నాగేశ్వరరావుకి పాడితే ఆయనలా, ఎన్టీఆర్​కు పాడితే ఆయనలా, ఇలా ఏ హీరో కోసం పాడితే వారే స్వయంగా పాడారా అనిపించేలా పాటలను ఆలపించేవారు. అలా ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ తర్వాత తరంలో తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు మూల స్తంభాలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లకు కూడా బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు.

Last Updated : Sep 25, 2023, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details