తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

2022లో సినిమాల జోరు... 2023లో సీక్వెల్​కు తయారు - తెలుగు హిట్​ సినిమాలు

2022 సంవత్సరమంతా కొత్త చిత్రాల జోరు కొనసాగింది. అన్ని పరిశ్రమల్లోనూ ఈ ధోరణి కొనసాగింది. అయితే కొన్ని చిత్రాలు కొత్త సంవత్సరంలో సీక్వెల్​కు రెడీగా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా?

tollywood heros
తెలుగు హీరోలు

By

Published : Dec 3, 2022, 8:30 AM IST

Updated : Dec 3, 2022, 9:04 AM IST

ఈ ఏడాది కొనసాగింపు చిత్రాలు జోరు చూపించాయి. భాషతో సంబంధం లేకుండా అన్ని పరిశ్రమల్లోనూ ఆ చిత్రాలు రూపొంది ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రికార్డు స్థాయిలో విజయాల్ని కూడా అందుకున్నాయి. ఈ విజయాలే స్ఫూర్తినిస్తున్నాయో లేక, కథలు అలా డిమాండ్‌ చేస్తున్నాయో తెలియదు కానీ... రానున్నదంతా కూడా కొనసాగింపుల కాలమే అనిపిస్తోంది. ఎప్పుడూ లేని రీతిలో ఏ భాషలో చూసినా కొనసాగింపు చిత్రాలకి సంబంధించి ఓ పెద్ద జాబితా కనిపిస్తోంది. హాలీవుడ్‌... బాలీవుడ్‌ పరిశ్రమల తరహాలో దక్షిణాదిలో ఫ్రాంచైజీల హంగామా కూడా షురూ అయ్యింది.

ఇప్పటికే సెట్స్‌పైకి...
కొనసాగింపు చిత్రాల నిర్మాణం ఎప్పట్నుంచో ఉంది. హిందీలో సిరీస్‌గా సినిమాలుగా వచ్చాయి. తెలుగులోనూ కొన్ని రూపొందినా విజయం సాధించినవి తక్కువే. "బాహుబలి"తోనే ఒక కథని రెండు భాగాలుగా చెప్పే ట్రెండ్‌ ఊపందుకుంది. "పొన్నియిన్‌ సెల్వన్‌" చిత్రాలు "బాహుబలి" ఇచ్చిన స్ఫూర్తితోనే తెరకెక్కిస్తున్నా అన్నారు మణిరత్నం. 2023 - 24 కాలంలో భారతీయ చిత్ర పరిశ్రమలో కొనసాగింపు చిత్రాల వెల్లువ కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సినీ నటులు

దక్షిణాదిలో ఇప్పటికే "పుష్ప2", "డీజే టిల్లు2", "భారతీయుడు2" చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇక కొనసాగడానికి సిద్ధంగా ఉన్న చిత్రాల మాటకొస్తే ఆ జాబితా చాంతాడంత ఉంది. "ఆర్‌ఆర్‌ఆర్‌"కి కొనసాగింపు ఆలోచన ఉందని, కథ కూడా సిద్ధమవుతోందని ఇప్పటికే దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. "అఖండ"కి కొనసాగింపు చిత్రం ఉంటుందని బాలకృష్ణ చెప్పారు. ఆయనే వచ్చే ఏడాదిలో "ఆదిత్య 369"కి సీక్వెల్‌గా "ఆదిత్య 999 మాక్స్‌" పట్టాలెక్కిస్తామని చెప్పారు. "హిట్‌ 3" కోసం కథానాయకుడు నాని రంగంలోకి దిగుతున్నారు.

రామ్‌చరణ్‌ చిత్రం "ధృవ"కి కొనసాగింపుగా దర్శకుడు మోహన్‌రాజా ఓ కథని సిద్ధం చేశారు. అన్నీ కుదిరితే ఆ చిత్రం కూడా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. "కార్తికేయ 3", "బింబిసార 2", "ఢీ అండ్‌ ఢీ" (డబుల్‌ డోస్‌), "గూఢచారి 2", "ఫలక్‌నుమా దాస్‌ 2"... ఇలా ఇప్పటికే ప్రకటించిన కొనసాగిపు చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత "యశోద"కి కూడా సీక్వెల్‌ రూపొందే అవకాశం ఉందని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ చెప్పారు.

సూర్య కథానాయకుడిగా నటించిన "జై భీమ్‌", కార్తి నటించిన "సర్దార్‌", హిందీలో "బ్రహ్మాస్త్ర" ప్రపంచం కొనసాగనుంది. దాంతోపాటు "ఆషికి 3", "ఓ మై గాడ్‌ 2", "ఫక్రే 3", "దోస్తానా 2", "హెరా ఫెరీ 3", "ఫిర్‌ గోల్‌మాల్‌", "క్రిష్‌ 4", "గో గోవా గాన్‌ 2", "టైగర్‌ 3", "ఇష్క్‌ విష్క్‌ రిబౌండ్‌", "గదర్‌ 2", "అప్నే2"... ఇలా కొనసాగింపులు, ఫ్రాంచైజీ చిత్రాలు చాలానే నిర్మాణ దశలో ఉన్నాయి. "కె.జి.ఎఫ్‌3" త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలున్నాయి. "లూసిఫర్‌ 2" కోసం, "దృశ్యం3" కోసం మలయాళ చిత్రసీమ సిద్ధమైంది. అవి తెలుగులోనూ రావడం ఖాయం.

తెలుగు హీరోలు

కథ ఎక్కడ ఆగిందో, అక్కడ నుంచి మళ్లీ మొదలయ్యేదే కొనసాగింపు చిత్రం. కానీ ఇప్పుడు కథలతో సంబంధం లేకుండా ఆ కథల ప్రపంచాన్నో, లేదంటే పాత్రల్నో కొనసాగిస్తూ సినిమాల్ని రూపొందిస్తున్నారు దర్శకులు. సీక్వెల్స్‌గా, ఫ్రాంచైజీగా, యూనివర్స్‌ చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఇవి ఈమధ్య ప్రేక్షకులకి ప్రత్యేకమైన అనుభూతిని పంచుతున్నాయి. తెలుగులో వస్తున్న "హిట్‌" చిత్రాలు "హిట్‌వర్స్‌"గా ప్రాచుర్యం పొందుతున్నాయి.

అనిల్‌ రావిపూడి "ఎఫ్‌2" విజయం తర్వాత దాన్ని ఫ్రాంచైజీగా మలుస్తూ "ఎఫ్‌3" తెరకెక్కించి నవ్వించారు. తమిళంలో లోకేశ్‌ కనగరాజ్‌ తాను తీసిన "ఖైదీ" చిత్రంతో ముడిపెడుతూ తీస్తున్న సినిమాల్ని "లోకేశ్‌ కనకరాజ్‌ యూనివర్స్‌ చిత్రాలు"గా పిలుస్తున్నారు. "ఖైదీ", "విక్రమ్‌"లతో ముడిపెడుతూ లోకేశ్‌ కనకరాజ్‌ "ఖైదీ2"కి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. హిందీలో వచ్చిన "బ్రహ్మాస్త్ర" ఆ కోవకి చెందినదే. అస్త్రా వర్స్‌ పేరుతో వరుస సినిమాలుగా రూపొందనున్నాయి.

తెలుగులో ఈ ఏడాది బంగార్రాజు, ఎఫ్‌ 3, కార్తికేయ 2, హిట్‌ 2... ఇలా వరుసగా సినిమాలొచ్చాయి. కన్నడ నుంచి వచ్చిన "కేజీఎఫ్‌2" తెలుగులో విశేష ఆదరణ పొందింది. తమిళం నుంచి వచ్చిన "విక్రమ్‌", హిందీలో రూపొందిన "భూల్‌ భులయ్యా2", "దృశ్యం2" చిత్రాలు విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఇలా ఏ భాషలో చూసినా వాటి హవా కొనసాగుతోంది. అవి మరో భాషలోనూ అనువాదాలుగా విడుదలవుతూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాయి.

దక్షిణాది హీరోలు

అన్నీ.. అందరికోసం..
పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ మొదలయ్యాక భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. ఇప్పుడు ఏ భాషలో సినిమా రూపొందినా సరే, జాతీయ స్థాయిలో ప్రేక్షకులు లక్ష్యం అవుతున్నారు. అన్ని సినిమాలూ అందరి కోసం ముస్తాబవుతున్నాయి. ఈ లెక్కన కొనసాగింపు చిత్రాల జోరు చూస్తుంటే... రానున్న రెండు మూడేళ్లల్లో విరామం లేకుండా భారతీయ ప్రేక్షకుల ముందుకు కొనసాగింపు చిత్రాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. విడుదలకి ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ప్రచారం కావడం ఈ సినిమాల ప్రత్యేకం. మార్కెట్‌ పరంగా కూడా కలిసొచ్చే సినిమాలవి. అంచనాలకి తగ్గట్టుగా కథలతో కట్టి పడేయాల్సి ఉంటుంది. మరి సినీరూపకర్తలు కొనసాగిపు చిత్రాలతో ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.

Last Updated : Dec 3, 2022, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details