South Indian Super Hero Films : సూపర్ హీరో సినిమా అనగానే మూవీ లవర్స్‌కు మొదటగా హాలీవుడ్ చిత్రాలే గుర్తొస్తుంటాయి. బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా అంటూ కల్పిత పాత్రలతో ఆ సినిమాలు ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. ఈ సూపర్ హీరోలకు ఇండియాలో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. అయితే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ విషయానికొస్తే యాక్షన్, హారర్, కామెడీ, లవ్ - ఇలా ఏ జానర్లో అయినా సినిమాలు చేస్తారు కానీ సూపర్ హీరోను అంత ఈజీగా టచ్ చేయరు. ఎందుకంటే అలాంటి సినిమాలు చేయాలి అంటే భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో పాటు ఆ సినిమా చిత్రీకరణ కోసం ఏళ్ల పాటు సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఇంత చేశాక కూడా సరైన ఔట్‌ఫుట్ వస్తుందా అంటే దానికి గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి! అందుకే ఇక్కడి ఫిల్మ్ మేకర్స్ సూపర్ హీరోల చిత్రాల వైపు అడుగులు వేయరు.
అయితే ఇండియన్ సూపర్ హీరో అంటే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చేది 'క్రిష్'. ఈ సిరీస్‌కు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. దీని తర్వాత షారుక్ షారుఖ్ ఖాన్ 'రా.వన్'(బాలీవుడ్ - 2011) వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత మరే సూపర్ హీరోలు కనపడలేదు. అయితే ఇప్పుడా సూపర్ హీరోల మాయాజాలం ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు మన దర్శకులు. ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి ప్రస్తుతం ఇద్దరు సూపర్ హీరోలు వచ్చారు. ఆ మధ్యలో 2021లో మలయాళంలో విడుదలైన మిన్నల్ మురళి(Minnal Murali Movie) - సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కి మంచి హిట్ టాక్‌ను దక్కించుకుంది. ఇప్పుడు తెలుగు నుంచి ప్రశాంత్ వర్మ హనుమాన్(Hanuman Movie) విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భవిష్యత్‌లోనూ ఈ ఇద్దరు సూపర్ హీరోల నుంచి సినిమాలు రాబోతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ అయితే మొత్తం 12 సూపర్ హీరోలు కథలు ఉన్నాయని వాటిని ఒకదాని తర్వాత ఇంకొకటి తెరకెక్కిస్తానని అన్నారు. ఇంకా ఈ సూపర్ హీరోలు మాత్రమే కాకుండా రీసెంట్గా వచ్చిన శివ కార్తికేయన్ 'మహావీరుడు' కూడా సూపర్ హీరో మోడ్‌లోనే వచ్చి ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది.