Sonu Sood news today: మహారాష్ట్రలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీలో వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నిర్మించనున్నట్లు ప్రకటించారు సినీ నటుడు సోనుసూద్. బుధవారం సాయి బాబాను దర్శించుకున్న అనంతరం ఈ విషయం వెల్లడించారు. "నేను సాయి బాబా చూపిన మార్గాన్ని అనుసరిస్తున్నా. షిర్డీలో వృద్ధాశ్రమం నిర్మించాలని అనుకుంటున్నా. అందుకోసమే ఇక్కడకు వచ్చా. షిర్డీలో వృద్ధాశ్రమం, అనాథాశ్రమం ఏర్పాటు చేయాలన్న నా కల త్వరగా నెరవేరేలా చూడాలని సాయి బాబాను ప్రార్థించా" అని చెప్పారు సోను.
షిర్డీలో సోనుసూద్ సేవాయజ్ఞం- త్వరలో వారి కోసం ఆశ్రమం! - sonu sood charity trust
సినిమా ద్వారా రూ.500 కోట్లు ఆదాయం వచ్చినదానికన్నా.. ఐదుగురికి సాయం చేస్తేనే తనకు ఎక్కువ సంతోషం లభిస్తుందని చెప్పారు ప్రముఖ సినీ నటుడు సోనుసూద్. షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న ఆయన.. అక్కడ ఓ వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నిర్మించనున్నట్లు వెల్లడించారు.
హిందీ భాషను అన్ని రాష్ట్రాల ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారన్న వాదనలు, ఇదే విషయంపై ఇటీవల ఇద్దరు అగ్ర కథానాయకుల మధ్య ట్వీట్ల సంవాదం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు సోనుసూద్. "మానవత్వాన్ని మించిన భాష లేదు. నేను తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, చైనీస్.. ఇలా అన్ని భాషల్లోనూ పనిచేశా. ఏ భాషలో పనిచేస్తే.. అదే నా మాతృ భాష అని నాకు అనిపిస్తుంది. మానవత్వమే అతిపెద్ద భాష అని కరోనా నేర్పించింది. కష్టంలో ఉన్నవారు వచ్చి ఏ భాషలో అడిగినా సాయం చేశాం. మానవత్వం అనే భాష అందరికీ రావాలి. పాఠశాలల్లో నేర్పాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలి. సాయం చేసేందుకు బాగా డబ్బులు సంపాదించడం, జీవితంలో విజేతలుగా నిలవడం, ఎక్కువ సమయం కేటాయించడం తప్పనిసరి కాదు. సంకల్పం ఉంటే ఎలాగైనా సాయం చేయవచ్చు. ఒక సినిమాకు రూ.500కోట్లు ఆదాయం వచ్చినదానికన్నా ఐదుగురికి సాయం చేస్తేనే ఎక్కువ సంతోషం కలుగుతుంది" అని అన్నారు సోనుసూద్.