కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా ఓటీటీకి ఆదరణ బాగా పెరిగింది. ఇప్పటికీ కొన్ని చిన్న చిత్రాలు నేరుగా ఓటీటీల్లో విడుదలవుతుండగా పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజైన కొన్ని రోజులకే డిజిటల్ మాధ్యమాల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎప్పుడెప్పుడొస్తుందా? అని కొందరు ఎదురుచూస్తుంటే, మరికొందరు ‘అతి త్వరలోనే’ అని జ్యోతిషం చెప్పేస్తున్నారు. నెట్టింట పెద్ద చర్చ సాగిస్తున్నారు. దీనిపై చిత్ర బృందం స్పష్టతనిచ్చింది. ‘‘ఆర్‌ఆర్‌ఆర్’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?’’ అని ఓ సినీ అభిమాని అడగ్గా ‘‘ఇంకా చాలా సమయం ఉంది’’ అని బదులిచ్చింది. మరోవైపు, ఫుల్ వీడియో సాంగ్స్ విడుదలపైనా స్పందించింది. శ్రోతల హృదయాన్ని హత్తుకున్న ‘కొమురం భీముడో’ గీతాన్ని అన్నింటికంటే చివరన రిలీజ్ చేస్తామని తెలిపింది. మెల్లగా ఒకదాని తర్వాత మరొకటి వస్తాయని చెప్పింది. ఇప్పటికే ‘నాటు నాటు’ పాట విడుదలైన సంగతి తెలిసిందే. ‘కొమ్మా ఉయ్యాలా’ పాట ఫుల్ వీడియో శనివారం రానుంది.
'శ్రీదేవి శోభన్‌బాబు' గీతం విన్నారా!.. ఓటీటీలోకి 'ఆర్‌ఆర్‌ఆర్'?
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఓటీటీలోకి అతి త్వరలోనే వస్తుందంటూ ప్రచారం జరుగుతుండగా.. దీనిపై చిత్ర బృందం స్పష్టతనిచ్చింది. అలాగే సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన 'శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమాలోని తొలి గీతాన్ని సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
‘శ్రీదేవి శోభన్‌బాబు’ సాంగ్..
‘పేపర్ బాయ్’, ‘మంచి రోజులు వచ్చాయి’, ‘ఏక్ మినీ కథ’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు సంతోష్ శోభన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. గౌరి జీ కిషన్ కథానాయిక. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని తొలి గీతాన్ని సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా శుక్రవారం విడుదల చేశారు. ‘నిన్ను చూశాక’ అంటూ సాగే ఈ పాటను రాకేందు మౌళి రచించగా జునైద్ కుమార్ ఆలపించారు. కమ్రాన్ స్వరాలందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: శశిధర్ రెడ్డి, ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ రామస్వామి.