తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Mister Pregnant Movie Review : కొత్త కాన్సెప్ట్​తో 'మిస్టర్​ ప్రెగ్నెంట్'.. సినిమా ఎలా ఉందంటే? - Mister Pregnant story

Mister Pregnant Movie Review : బిగ్​బాస్​ స్టార్ సోహైల్​, రూప నటించిన చిత్రం 'మిస్టర్​ ప్రెగ్నెంట్​'. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?

Mister Pregnant Movie Review
Mister Pregnant Movie Review

By

Published : Aug 18, 2023, 12:57 PM IST

Mr pregnant movie review :చిత్రం: మిస్టర్‌ ప్రెగ్నెంట్‌; నటీనటులు: సయీద్‌ సోహెల్‌, రూప, సుహాసిని, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, ఆలీ, హర్ష, అభిషేక్‌రెడ్డి, స్వప్నిక తదితరులు; సంగీతం: శర్వణ్‌ భరద్వాజ్‌; సినిమాటోగ్రఫీ: నిజర్‌ షఫీ; ఎడిటింగ్‌: పవన్‌ పూడి; నిర్మాత: అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల, వెంకట్‌ అన్నపురెడ్డి; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్‌ వింజనం పాటి; విడుదల తేదీ: 18-08-2023

'బిగ్​బాస్' కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ నటించిన తాజా చిత్రం 'మిస్టర్ ప్రెగ్నెంట్'. రూపా కొడవాయుర్ హీరోయిన్​గా నటించింది. పురుషుడు ప్రెగ్నెంట్ అయితే అనే డిఫరెంట్ కాన్సెప్ట్​తో ఈ సినిమాను తెరకెక్కించి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం థియేటర్లలో రిలీజ్​ అయిన ఈ సినిమా ఎలా ఉంది? సోహెల్​ ఎలా నటించాడు? ఆ వివరాలు మీకోసం.

మిస్టర్​ ప్రెగ్నెంట్​ స్టోరీ ఇదే.. గౌతమ్(సోహెల్) ఓ టాటూ ఆర్టిస్ట్. తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వెంటపడుతుంది మహి(రూప). అయితే ప్రేమ, పెళ్లి, పిల్లలకు దూరంగా ఉండాలనుకుంటాడు గౌతమ్. కానీ అనుకోని పరిస్థితుల్లో మహిని పెళ్లి చేసుకుంటాడు. తల్లిదండ్రులను ఎదిరించి వచ్చిన ఆమెను కాలు కిందపెట్టకుండా కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఈ క్రమంలో మహికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది. ఆ విషయం గౌతమ్‌కు నచ్చదు. తనకు గతంలో జరిగిన సంఘటన వల్ల మహి ఎక్కడ దూరమవుతుందోనని మదనపడుతుంటాడు గౌతమ్. మహి గర్భాన్ని తాను తీసుకోవాలనుకుంటాడు. సైంటిఫిక్‌గా కొన్ని దేశాల్లో అది సాధ్యపడటం వల్ల డాక్టర్ వసుధ(సుహాసిని)ని ఒప్పించి ఆ గర్భాన్ని గౌతమ్ మోస్తాడు. ఆ తర్వాత ఏమైంది? గౌతమ్ బిడ్డను కన్నాడా? అతడి జీవితంలో జరిగిన గత సంఘటనలేంటీ? గర్భాన్ని మోసిన గౌతమ్‌ను సమాజం దృష్టి ఏంటనేదే మిస్టర్ ప్రెగ్నెంట్ కథ.

సినిమా ఎలా ఉందంటే..ప్రయోగాత్మక సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడు మంచి ఆదరణ లభిస్తుంది. వారి అంచనాలను అందుకోగలిగితే బాక్సాఫిసు వద్ద ఆ చిత్రానికి కాసుల వర్షం కురుస్తుందని ఎన్నో సినిమాలు నిరూపించుకున్నాయి. అలాంటి కోవకు చెందిన చిత్రాన్ని.. ప్రపంచంలో మొదటి మేల్ ప్రెగ్నెంట్ ఆస్ట్రేలియాకు చెందిన థామస్ కథ స్ఫూర్తితో డైరెక్టర్ తయారుచేసుకున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా భావోద్వేగభరితంగా తీర్చిదిద్దాడు. సినిమాలో అంతర్లీనంగా అర్థనారీశ్వర తత్వాన్ని వివరించారు. అమ్మ గొప్పతనాన్ని కథానాయకుడి రూపంలో చెప్పే ప్రయత్నం చేశాడు. మగవాడు గర్భం దాల్చడానికి అవకాశం లేకపోయినా.. వైద్యరంగంలో ఇప్పుడున్న పరిజ్ఞానంతో తన భార్య గర్భాన్ని మోయవచ్చనే విషయాన్ని ప్రేక్షకులకు చెప్పాడు. ఇందుకు తగిన శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను ఊటంకిస్తూ.. ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లాడు. అయితే ఫస్ట్​హాఫ్​లో.. మొదటి 20 నిమిషాల సినిమా రోటీన్‌గా అనిపిస్తుంది.

ఎప్పుడైతే మహి గర్భాన్ని గౌతమ్​ మోసేందుకు సిద్ధమవుతాడో.. అప్పటి నుంచి కథ ఆసక్తికరంగా సాగుతుంది. గౌతమ్ - మహిల మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగభరితంగా ఉంటాయి. గౌతమ్ గతానికి సంబంధించిన సన్నివేశాలు కళ్లు చెమ్మగిల్లేలా చేస్తాయి. అలాగే సెకండ్​ హాఫ్​లో గౌతమ్ తన గర్భాన్ని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు, తన ఇంట్లో బ్రహ్మాజి చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్​ సన్నివేశాల్లో మగవాడు గర్భం మోయడంపై మీడియాతో చెప్పే మాటలు నాటకీయంగా అనిపించినా.. చప్పట్లు కొట్టేలా చేస్తాయి. కథను ముందుకు తీసుకెళ్లేందుకు రాసిన కొన్ని సీన్​లు సాగతీతగా అనిపిస్తాయి. మహిళా ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాలను, వాటిని తీర్చిదిద్దన విధానం ఆకట్టుకుంటుంది. సంభాషణలు ఒకటిరెండు చొట్లా ఫర్వాలేదనిపిస్తాయి. మూవీ మొత్తం ఒకే ధోరణిలో వెళ్లడం వల్ల ప్రథమార్థం పెద్దగా ఆకట్టుకోకపోయింది. సెకండ్​హాఫ్​ మాత్రం ప్రేక్షకులను అలరిస్తూనే ఆలోచింపజేస్తుంది.

ఎవరు ఎలా చేశారంటే?.. 'మిస్టర్ ప్రెగ్నెంట్' సోహెల్ వన్ మ్యాన్ షోగా చెప్పొచ్చు. ఇన్నాళ్లు అల్లరిగా, ఆకతాయి పాత్రల్లో కనిపించిన సోహెల్‌లో కొత్త నటుడు కనిపిస్తాడు. గర్భంతో సోహెల్ నటించిన తీరు, సెంటిమెంట్ సీన్​లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. డైలాగ్​ల విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. మహి పాత్రలో రూప ఒదిగిపోయింది. చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది. సోహెల్‌తో కలిసి నటించిన తీరు మెప్పిస్తుంది. సోహెల్ స్నేహితుడు సత్య పాత్రలో వైవా హర్ష, మహి మేనమామ బుట్టబొమ్మ పాత్రలో బ్రహ్మాజి ఫర్వాలేదనిపిస్తారు. మహి తండ్రిగా రాజా రవీంద్ర తన పంచ్ లతో నవ్వించారు. డాక్టర్ వసుధగా సుహాసిని ఎప్పటిలాగే తన నటనను కనబర్చింది.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం అంతం మాత్రంగానే ఉన్నాయి. దర్శకుడు శ్రీనివాస్ తను ఎంచుకున్న కథ చెప్పడంలో సక్సెస్​ అయ్యాడు. అయితే ఫస్ట్​హాఫ్​లో కొంచెం తడబడ్డా.. ద్వితీయార్ధంలో అనుకున్నది స్పష్టంగా చెప్పగలిగాడు. కొన్ని సీన్​లను మనసుకు హత్తుకునేలా తీశాడు. వాస్తవిక ప్రపంచంలో సాధ్యమైన విషయాన్ని తెరపై కథగా మల్చడంలో దర్శకుడికి మంచి మార్కులే పడ్డాయి. ఇక నిర్మాతల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమా చేయడం సాహసమని తెలిసినా ప్రయోగాత్మకంగా మంచి నిర్మాణ విలువలు జోడించారు. అయితే.. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పురిటినొప్పులు అనుభవించినా చివరకు విజయవంతంగా డెలవరీ చేయగలిగారు.

  • బలాలు
  • + కథ, కథనం
  • + సోహెల్ , రూప నటన
  • + పతాక సన్నివేశాలు
  • బలహీనతలు
  • - ప్రథమార్ధం 20 నిమిషాలు
  • - ఆకట్టుకోని పాటలు
  • చివరగా: మిస్టర్ ప్రెగ్నెంట్.. ఆలోచింపచేసే చిత్రం.
  • గమనిక.. ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించినది.. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Bro Movie Review : 'బ్రో'.. మామా అల్లుళ్లు ఆడియెన్స్​ను మెప్పించారా?

Jailer Movie Telugu Review : వింటేజ్​ రజనీ ఆగయా.. 'జైలర్​' మూవీ ఎలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details