Sisters Day Special: సోదరీమణులు అంటే మంచి స్నేహితులు. ఒకే ఇంట్లో పెరుగుతూ ఉన్న సమయంలో ప్రతి విషయంలో పోటీ పడుతుంటారు. అవసరమైన సమయంలో అన్నీ మర్చిపోయి సపోర్ట్ చేసుకుంటారు. ఎటువంటి బేధ భావం ఎరుగని.. ప్రాణ స్నేహితులకు మించిన బంధం అక్కాచెల్లెళ్ల అనుబంధం. అయితే తమ గానంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మంగ్లీ సిస్టర్స్, విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తూ.. నాన్న అశ్వనీదత్‌కి తగిన తనయలుగా నిలుస్తున్న స్రవంతి సిస్టర్స్.. ఆదివారం అక్కాచెల్లెళ్ల దినోత్సవం సందర్భంగా తమ అనుబంధాలను షేర్ చేసుకున్నారు.
తల్లీబిడ్డల అనుబంధం..
Singers Mangli Satyvathi:సత్యవతి.. అంటే కాస్త ఆలోచిస్తారేమో కానీ మంగ్లీగా తెలుగు నాట అక్క అందరికీ సుపరిచితమే. తన బాటలోనే నడుస్తూ ఒక్కపాటతో ప్రపంచంలోని తెలుగు వారందరికీ పరిచయమైంది చెల్లి ఇంద్రావతి చౌహాన్. వీళ్లది అనంతపురంలోని గుత్తి దగ్గర చిన్న తండా. పేద కుటుంబం. చదువుకుంటూనే ఇంటి పని, నాన్న బాధ్యతను భుజానికెత్తుకొని తోబుట్టువుల ఆలనాపాలనా చూసుకునేది మంగ్లీ.
అందుకే.. "పాట అక్క నుంచే నేర్చుకున్నా. తనే నాకు స్ఫూర్తి. చిన్నప్పటి నుంచీ ఆమె చేతుల్లోనే పెరిగా. తను అక్క కాదు.. అమ్మంటా"నని ఇంద్రావతి చెబుతుంది. మంగ్లీనేమో.. "ఇంద్రావతి, వెంకటలక్ష్మి.. ఇద్దరు చెల్లెళ్లు నాకు. ఉద్యోగం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ల చదువులు, బాగోగులు అన్నీ నేనే చూసుకున్నా. ఇంద్రావతి, నేను కలిసి ఎన్నో వేదికల్నీ పంచుకున్నాం. తనని గాయనిగా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. శిక్షణా ఇవ్వలేదు. సరదాగా నాతో కలిసి పాడుతూ ఆసక్తి పెంచుకుంది. తను నా చెల్లి.. అవకాశాలివ్వమని ఏనాడూ ఎవరినీ అడగలేదు. నేను పాడటానికి వెళ్లినప్పుడు చెల్లెళ్లలో ఎవరో ఒకరు తోడుగా వస్తారు. ఓసారలా వచ్చినపుడు సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ ఇంద్రావతితో మాట్లాడారు. అలా తనకి అవకాశమొచ్చింది.
నేను పదేళ్లు కష్టపడితే వచ్చిన గుర్తింపు తను ఒక్క 'ఊ అంటావా మావా' పాటతో తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ చేరువైంది. తననలా చూస్తోంటే చాలా ఆనందంగా ఉంది. తను ఎదుగుతూ గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉన్నా.. కష్టపడుతోంది, సెలబ్రిటీగా శాంతియుత జీవితానికి దూరమవుతోందన్న బాధా ఉంది. చెల్లెల్లిద్దరికీ నేనంటే ప్రాణం. నువ్వు మా అమ్మవి అంటారు. ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. ఇంద్రావతి పాటను ఎంచుకుంది. నాకో తమ్ముడు కూడా. వాళ్లనీ వాళ్లకు నచ్చిందే చేయమంటా. ఇది చెయ్యమని ఎప్పుడూ చెప్పను. ప్రతి ఒక్కరి దగ్గర్నుంచీ ఒక్కోటి నేర్చుకోవచ్చు. అలా నేర్చుకుంటూ ఉండమన్న సూచన మాత్రం ఇస్తా"నంటోంది.
ముగ్గురిదీ ఒకే మాట
AshwaniDatt Daughters: కష్టమైనా సుఖమైనా మా ముగ్గురిదీ ఒకే బాట అంటున్నారు.. స్వప్న, ప్రియాంక, స్రవంతిదత్. మహానటి, జాతిరత్నాలు, సీతారామం వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తూ.. నాన్న అశ్వనీదత్‌కి తగిన తనయలుగా నిలుస్తున్నారు. వాళ్ల అనుబంధం గురించి..
'పదోతరగతి వరకు విజయవాడలోనే పెరిగాం. చిన్నప్పుడు అందరిలాగే మేమూ బాగా కొట్టుకునేవాళ్లం. ముగ్గురం రెండు వర్గాలుగా విడిపోయేవాళ్లం. కొద్దిసేపటికే తిరిగి కలిసిపోయేవాళ్లం. స్కూల్‌లో పుట్టినరోజని ఎవరైనా ఒక చాక్లెట్ ఇస్తే, బతిమాలి మరోటి తీసుకునేదాన్ని. ఇంటర్‌వెల్‌లో మా చెల్లెలు స్రవంతి దగ్గరకెళ్లి సంతోషంగా ఇచ్చొచ్చేదాన్ని. మధ్యాహ్నం భోజనం ఆలస్యమైతే ఆలస్యమైతే స్వప్న అక్క కంగారుపడేది. క్యాంటిన్‌కెళ్లో, స్నేహితులనడిగో మాకేదైనా తెచ్చిచ్చేది. అంత బాధ్యతగా ఉండేది.