"గుర్తు పెట్టుకుని పాడుకునే పాటలు మెలోడీలే. ఫాస్ట్ బీట్ పాటల్ని సినిమా విడుదలైన తర్వాత మరిచిపోతామేమో! మెలోడీలు అలా కాదు. నవతరం సంగీత దర్శకులూ వీటిపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నార"న్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్. తండ్రి ఎస్పీ బాలు వారసత్వం పుణికి పుచ్చుకుని, గాయకుడిగా పాటతో ప్రయాణం కొనసాగిస్తూనే... మరోపక్క నిర్మాతగానూ అభిరుచిని చాటారు. ఇటీవల 'సీతారామం' సినిమాలో రెండు పాటల్ని ఆలపించారు. 'ఓహ్ సీతా', 'ఇంతందం...' అంటూ సాగే ఆ పాటలు చక్కటి ఆదరణ పొందాయి. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సీతారామం' ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
"మరోసారి మంచి పాటలు పాడే అవకాశం 'సీతారామం'తో లభించింది. చిరకాలం నిలిచిపోయేలా ఉంటాయివి. స్వచ్ఛమైన తెలుగుతో నిండి, పాడుతున్నప్పుడే ఎంతో తీయగా అనిపించింది. రచయిత కేకే, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పని తీరులో కొత్త అందం కనిపించింది. నాన్న పాడాల్సిన పాటలు అప్పుడూ ఉన్నాయి, ఇప్పుడూ ఉంటాయి. అలాగని నాన్నలా పాడాలని, ఆయన పాడదగ్గ పాటలు నా దగ్గరికి వస్తున్నాయని అనుకోవడం లేదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన పాటల్ని శక్తిమేరకు పాడాలనేదే నా ప్రయత్నం".