ఎలాంటి పాటైనా ఆమె గొంతులోంచి రాగానే అమృతంలా ఉంటుంది అంటూ సినీ సంగీత ప్రియులు మురిసిపోతారు. ముఖ్యంగా మెలోడీలు ఆమె పాడితే ఎంతో హాయిగా ఉంటాయంటూ పదేపదే వింటారు. దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఆ మధుర గాయినే శ్రేయా ఘోషల్. 'నీ జతగా నేనుండాలి...', 'నువ్వే నా శ్వాస..', 'చలి చలిగా అల్లింది...', 'మాఘ మాస వేళ', 'నువ్వేనా...నా నువ్వేనా...' ఇలా చెప్పుకుంటే పోతే తెలుగులోనూ ఎన్నో సూపర్‌హిట్ గీతాలను ఆమె ఆలపించింది. భాషతో సంబంధం లేకుండా ఎన్నో భారతీయ భాషల్లో ఆమె గొంతు ఏదోచోట వింటూనే ఉంటాం. సంజయ్ లీలా భన్సాలీ 'దేవదాస్' చిత్రంతో పదహారేళ్ల వయస్సులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. చిత్ర పరిశ్రమకు వచ్చి 20ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రేయా ఘోషల్ పంచుకున్న కొన్ని సంగతులు..
'దేవదాస్' కోసం రికార్డు చేస్తున్నప్పుడు నాకు 16ఏళ్లు. నా చుట్టూ దిగ్గజ సంగీత దర్శకులు, సంగీత విద్వాంసులు ఉన్నారు. స్టూడియో మొత్తం జనంతో నిండిపోయింది. ఆ దృశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను సంజయ్ భన్సాలీ చిత్రంలో ఐశ్వర్యరాయ్ కోసం పాడాను. ఈ చిత్రంలోని 'భైరి పియా' పాటకు జాతీయ అవార్డును గెలుచుకుంటానని అనుకోలేదు. కొత్తలో నా ప్రతి పాట రికార్డింగ్ ఒక ఆడిషన్‌లానే ఉండేది. దేవదాస్ సినిమా నన్ను కేరీర్‌లో మరో దశకు ఎదిగేలా చేసింది. దీని తర్వాత నాకు వరస అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే పరిశ్రమలో 20సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినప్పటికీ పెద్దగా ఏమీ మారనట్టుంది. నేను ఇప్పటికీ చిన్న అమ్మాయిలానే భావిస్తున్నాను.