Singer P Susheela Honorary Doctorate : 'గాన కోకిల' పి సుశీలకు అరుదైన గౌరవం దక్కింది. చెన్నైలో ఉన్న.. తమిళనాడు డాక్టర్ జే జయలళిత సంగీత విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి కె స్టాలిన్.. సుశీల, సంగీత దర్శకుడు పీఎమ్ సుందరంతో పాటు విద్యార్థులు అవార్డులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా అవార్డులు ప్రదానం చేయడానికి ముందు స్టాలిన్ మాట్లాడారు. 'ఈరోజు ఇద్దరు సంగీత మేధావులకు డాక్టరేట్లు ప్రధానం చేస్తున్నారు. గాయని పి సుశీల గాత్రానికి మంత్రముగ్దులు కాని వారు ఉండరు. అందులో నేను ఒకడిని. నా కారు ప్రయాణాల్లో నేను సుశీల పాటలే వింటాను. అందులో నాకు ఇష్టమైన పాట 'నీ ఇల్లత ఉలగత్తిల్ నిమ్మత్తి ఇల్లై' ' అని స్టాలిన్ తెలిపారు. అంతేకాకుండా గాయని సుశీల దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని.. 50 వేలకు పైగా పాటలు పాడారని స్టాలిన్ కొనియాడారు. 60 ఏళ్లకు పైగా సంగీతానికి సేవ చేశారన్నారు.
మధుర గాయని పి సుశీల హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహళ, ఒరియా, పంజాబి, తులు వంటి భాషల్లో పాటలు పాడారు. ఇప్పటివరకు ఐదు జాతీయ అవార్డులు అందుకున్నారు.