కర్ణాటకలోని బళ్లారిలో గాయని మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగినట్లు వార్తలు సోషల్మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిపై మంగ్లీ స్పందించారు. దాడి వార్తలను ఖండించారు. కన్నడ ప్రజల నుంచి తనకు గొప్ప మద్దతు లభించినట్లు పేర్కొన్నారు.
కర్ణాటకలో సింగర్ కారుపై రాళ్ల దాడి!.. క్లారిటీ ఇచ్చిన మంగ్లీ.. - సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి
గాయని మంగ్లీ కారుపై కర్ణాటకలో రాళ్ల దాడి జరిగినట్లు సోషల్మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వాటిపై మంగ్లీ స్పందించారు. ఏమన్నారంటే?
అసలేం జరిగిందంటే?
వర్ధమాన గాయని మంగ్లీ శనివారం రాత్రి కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమం అనంతరం మంగ్లీని చూసేందుకు కొందరు యువకులు మేకప్ టెంట్‌లోకి దూసుకొచ్చారని, ఆమె వెళ్తుండగా కారుపై కొందరు వ్యక్తులు రాళ్లదాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సంఘటనపై మంగ్లీ స్పందించారు. దాడి వార్తలను ఖండించారు. కన్నడ ప్రజల నుంచి తనకు గొప్ప మద్దతు లభించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
"బళ్లారిలో నాపై దాడి జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలను పూర్తిగా ఖండిస్తున్నాను. నేను పాల్గొన్న వాటిల్లో ఇదో గొప్ప కార్యక్రమం. ఫొటోలు, వీడియోలు చూస్తే మీకే తెలుస్తుంది. ఈ ఈవెంట్ ఎంతో విజయవంతం అయింది. కన్నడ ప్రజలు నాకు మద్దతుగా నిలవడంతోపాటు ఎంతో ప్రేమ చూపారు. అక్కడి అధికారులు, నిర్వాహకులు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ విషయాన్ని మాటల్లో చెప్పలేను. నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇదంతా చేస్తున్నారు. నాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాను" అని మంగ్లీ పేర్కొన్నారు.