Singer KK Death Reason: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే.. మంగళవారం హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో ఓ కార్యక్రమానికి హాజరై పలు బాలీవుడ్ గీతాలు ఆలపించారు. తర్వాత తాను బసచేసిన హోటల్‌కు వెళ్లగానే.. ఛాతీలో నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడివారు హూటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. ఈలోపే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కేకేను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. అయితే కేకే ముఖం, పెదవిపై గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.హోటల్‌లో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడం సహా అక్కడి సిబ్బందిని విచారిస్తున్నారు.
రెండురోజుల కోల్‌కతా పర్యటనకు వెళ్లిన కేకే.. రెండు కళాశాలల్లో సంగీత కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి నజ్‌రుల్ మంచా ఆడిటోరియంలో సంగీత కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్లే సమయంలో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆడిటోరియం వందలాది మంది అభిమానులతో నిండిపోగా.. విపరీతమైన వేడికి ఆయన ఇబ్బంది పడినట్లు సమాచారం. ఆడిటోరియం నుంచి హోటల్‌కు వెళ్లగానే.. అక్కడికి పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు. వారికి కొద్దిసేపు సెల్ఫీలు ఇచ్చిన కేకే.. తర్వాత నిరాకరించారు. అక్కడి నుంచి హోటల్ గదిలోకి వెళ్లే సమయంలో.. గుండెపోటుతో కిందపడిపోయినట్లు అధికారులు వివరించారు. ఆయన వెంట ఉన్నవారు హోటల్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే.. ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు.. కేకే చనిపోయినట్లు నిర్ధరించారని తెలిపారు. కిందపడిపోవడం వల్ల కేకేకు నుదుటిపైన, పెదవిపైన గాయాలు అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
గుండెపోటు కారణంగానే కేకే చనిపోయి ఉండొచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత కేకే మరణానికి అసలు కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు కేకే భార్య, ఇతర కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు.