నేపథ్య గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్(కేకే)కు కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు కన్నీటి వీడ్కోలు పలికారు. ముంబయిలో కేకే ఇంటికి కిలోమీటరు దూరంలో ఉన్న హిందూ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన అంబులెన్స్‌లో కేకే పార్థీవదేహాన్ని శ్మశాన వాటిక వరకు తీసుకెళ్లారు. కేకే కుమారుడు నకుల్.. తన తండ్రికి అంతిమ కార్యాన్ని నిర్వహించాడు.
విశాల్ భరద్వాజ్‌తో పాటు అతడి భార్య రేఖ, నిర్మాత అశోక్ పండిట్, జావేద్ అక్తర్, శంకర్ మహదేవన్, ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్, సలీం మర్చంట్, అల్కా యాగ్నిక్ అభిజిత్ భట్టాచార్య తదితర బాలీవుడ్ ప్రముఖులు కేకేను చివరిసారి చూసేందుకు తరలివచ్చారు. బంగాల్ ప్రభుత్వం బుధవారం కేకే గౌరవార్థం గన్ సెల్యూట్ చేసింది. సీఎం మమతా బెనర్జీ నివాళులర్పించారు.