Siima Awards 2023 :దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'సైమా' (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ఈసారి సెప్టెంబర్ 15, 16 తేదీల్లో గ్రాండ్గా జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్కు దుబాయ్ వేదికకానుంది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, నిధి అగర్వాల్, సైమా ఛైర్పర్సన్ బృందా ప్రసాద్, మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ హాజరయ్యారు.
"సైమా అంటే సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్నీ కలిసి జరుపుకునే వేడుక. గత 11 ఏళ్లుగా నేను ఈ వేడుకల్లో భాగమవుతున్నాను. అయితే ప్రతీసారి కొత్తగా మొదలుపెట్టిన ఉత్సాహం, సంతోషం కలుగుతోంది. ఓ మంచి వేదికని ఏర్పాటు చేసి.. కళలపై ఒకే రకమైన అభిరుచి ఉన్న అందరినీ ఒకచోటకి చేర్చడంలో సైమా విజయవంతమైంది. అవార్డులు ఎవరికి వస్తే బాగుంటుందనే అంశం కంటే.. ఎంత ఎక్కువ మంది నటీనటులు ఈ వేడుకలో పాల్గొంటే అంత బాగుంటుందనేది నా అభిప్రాయం" అని రానా అన్నారు.
దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నప్పటి నుంచీ 'సైమా' సంబరాల్లో పాల్గొంటున్నట్లు నటి నిధి నిధి అగర్వాల్ అన్నారు. గొప్ప నటులతో కలిసి వేదిక పంచుకోవడం ఆనందాన్నిస్తుందని ఆమె తెలిపారు. ఇక సమావేశంలో పాల్గొన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి.. అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ కలిసి ఎంతో గొప్పగా ఓ పండగలా జరుపుకునే ఈ వేడుకకోసం తాను ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.