బాలీవుడ్ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్ర పెళ్లి ఘనంగా జరిగింది. మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతిరథ మాహారథుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి రాజస్థాన్‌లోని జైసల్మేర్ సూర్యగఢ్ ప్యాలెస్ వేదికైంది. కాగా, ఫిబ్రవరి 4 నుంచి మొదలైన వేడుకలు మంగళవారం జరగనున్న బరాత్‌తో ముగియనున్నాయి. ఇక, పెళ్లికి వచ్చిన గెస్టుల కోసం ఈ జంట ఘనంగా ఏర్పాట్లు చేసింది. వివాహానికి విచ్చేసిన సినీ, రాజకీయ ప్రముఖలను రిసీవ్ చేసుకోడానికి దాదాపు 70 లగ్జరీ కార్లు ఏర్పాటు చేశారు. వీరికి వండి వడ్డించడానికి 500 మంది దాకా వెయిటర్లను ముంబయి, దిల్లీ నుంచి ప్రత్యేకంగా రప్పించారు.
రోజుకు రెండు కోట్లు ఖర్చు..!
ముంబయికి చెందిన ఓ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ ఆధ్వర్యంలో కియారా సిద్ధార్థ్ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. కాగా దీనికి ఒక్క రోజుకు దాదాపు రూ. 2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని సమాచారం. ఇక మూడు రోజుల పాటు జరుగుతున్న స్టార్ కపుల్ వెడ్డింగ్‌కు రూ.6 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నారని టాక్. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ప్రస్తుతానికి ప్రైవసీలో ఉంచనున్నారట ఈ జంట. తాము పోస్ట్ చేసేంత వరకు అతిథులెవరూ సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదని కోరారట. ఈ విషయాన్ని హోటల్ సిబ్బందికి కూడా తెలియజేశారని సమాచారం. కాగా గతంలో విక్కీ, కత్రినా సైతం తమ పెళ్లి సందర్భంగా బంధుమిత్రులకు ఇలాంటి విజ్ఞప్తి చేశారు.