బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట, ఓయ్, బొమ్మరిల్లు తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్థ్. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రేమకథా చిత్రలతో మెప్పించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాల గురించి నెటిజన్లతో పంచుకుంటుంటాడు. తాజాగా మధురై ఎయిర్‌పోర్ట్‌లో తనకు ఎదురురైన చేదు అనుభవాన్ని గురించి ఇన్‌స్టాలో తెలిపాడు. ఇన్‌స్టా స్టోరీలో ఓ సుదీర్ఘ లేఖ రాసి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తీరుపై మండిపడ్డాడు.
"నేను మా తల్లిదండ్రులతో కలిసి వస్తుంటే మధురై విమానాశ్రయంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది వేధించారు. ఏకంగా 20 నిమిషాల పాటు మాపై దురుసుగా ప్రవర్తించారు. పదేపదే హిందీలో మాట్లాడారు. ఇంగ్లిషులో మాట్లాడాలని నేను కోరినా.. పట్టించుకోలేదు. మా అమ్మనాన్నల బ్యాగ్‌లు చెక్ చేస్తూ అందులో ఉన్న వస్తువులన్నీ తీయాలని అన్నారు. వాళ్లు పెద్దవాళ్లని నేను చెప్పినా వినిపించుకోలేదు. పైగా ఇండియాలో ఇలాగే ఉంటుందని బదులిచ్చారు" అని సిద్ధార్థ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.