Shubman Gill Spider Man : టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ తన అద్భుతమైన ఆటతీరుతో అలవోకగా పరుగులు చేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లోనూ అగరగొడుతున్నాడు. అయితే ఎవరికీ తెలియని తనలోని మరో కోణాన్ని త్వరలో ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. సిల్వర్ స్ర్కీన్‌పై మ్యాజిక్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు గిల్. స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో భాగంగా 'స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వెర్స్' పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. ఈ మూవీకి గిల్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు.
ఈ సినిమాను యానిమేటెడ్ మోడ్‌తో ఇండియన్ వెర్షన్ విడుదల కానుంది. హిందీతో పాటు పంజాబీ భాషలో రానున్న ఈ వెర్షన్‌కు గిల్ తన స్వరం ఇవ్వనున్నాడు. పవిత్ర్ ప్రభాకర్ అలియాస్ ఇండియన్ స్పైడర్ మ్యాన్ అనే పాత్ర చుట్టు ఈ ఇండియన్ వెర్షన్ సాగనుంది. ఈ క్యారెక్టర్‌కే గిల్ డబ్బింగ్ చెప్పనున్నాడు. ఈ మేరకు మూవీ యునిట్ సోమవారం ప్రకటించింది. హాలీవుడ్ మూవీకి డబ్బింగ్ చెప్పనున్న తొలి క్రికెటర్ శుభ్‌మనే కావడం విశేషం. కాగా జూన్ 2న పలు భాషల్లో స్పైడర్ మ్యాన్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లలో కొందరు ఇప్పటికే సనిమాల్లో సందడి చేశారు. సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి అలరించారు. ఐపీఎల్లో పంజాబ్ తరఫున ఆడుతున్న శిఖర్ ధావన్ ఇప్పటికే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేడు. ప్రముఖ కథానాయికలు సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన 'డబుల్ ఎక్స్ఎల్'లో గెస్ట్ రోల్లో నటించాడు. 1991 నుంచి 2000 వరకు భారత క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించిన టీమ్ఇండియా మాజీ బ్యాటర్ వినోద్ కాంబ్లీ.. 2002లో విడుదలైన 'అనర్థ్' సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్‌ను అందించిన కపిల్ దేవ్ సైతం పలు సినిమాల్లో నటించారు. 'ఇక్బాల్', 'ముజ్సే షాదీ కరోగీ', 'చెయిన్ కులీకి మే కులీ' చిత్రాల్లో చిన్న పాత్రలతో అలరించారు.
టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. 'విక్టరీ', 'ముజ్సే షాదీ కరోగీ', 'ఫ్రెండ్షిప్', 'డిక్కిలోనా'తో పాటు మరో రెండు సినిమాల్లో యాక్ట్ చేశారు. వీరితో పాటు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్.. హీరో విక్రమ్ నటించిన 'కోబ్రా'లో నటించారు. 'ముజ్సే షాదీ కరోగీ'లో అతిథి పాత్రలో మెరిశారు. కేరళ ఆటగాడు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ 'అక్సర్-2', 'క్యాబరెట్', 'టీమ్ 5' తదితర చిత్రాల్లో నటించి మెప్పించాడు.